60 రోజుల ప్రణాళికతో.. | KCR Plan On Village Development In Telangana | Sakshi
Sakshi News home page

60 రోజుల ప్రణాళికతో..

Published Sun, Aug 4 2019 2:17 AM | Last Updated on Sun, Aug 4 2019 5:18 AM

KCR Plan On Village Development In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసే విధంగా త్వరలోనే అన్ని గ్రామ పంచాయతీల్లో ‘60 రోజుల కార్యాచరణ ప్రణాళిక’అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. పల్లెల సమగ్రాభివృద్ధితోపాటు పూర్తిస్థాయిలో పచ్చదనం, పరిశుభ్రతను సాధించేందుకు వివిధ అంశాలపై స్పష్టతనిస్తూ ప్రజాప్రతినిధులు, అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. గ్రామాల అభివృద్ధికి తోడ్పడేందుకు వీలుగా నూతన పంచాయతీరాజ్‌ చట్టంలో నిర్దేశించిన వివిధ విషయాలపై మరింత స్పష్టతనిస్తూ మార్గదర్శకాలు జారీచేశారు. 60రోజుల కార్యాచరణ అమలులో భాగంగా పవర్‌ వీక్, హరితహారం నిర్వహించాలని చెప్పారు.

గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత ఏర్పడే విధంగా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడం కోసం అమలుచేస్తున్న ఈ కార్యాచరణలో అధికారులు, ప్రజాప్రతినిధులు సిద్ధం కావాలని సీఎం పిలుపునిచ్చారు. గ్రామ వికాసం, పూర్తిస్థాయిలో అభ్యున్నతి కోసం ప్రభుత్వం సమగ్రవిధానం తీసుకువస్తోందని ఆయన తెలిపారు. 60 రోజుల గ్రామ వికాసంలో పంచాయతీరాజ్‌ శాఖది చాలా క్రియాశీలకమైన పాత్రన్న ముఖ్యమంత్రి ఈ శాఖను సంస్థాగతంగా బలోపేతం చేయనున్నట్టు స్పష్టంచేశారు. దీని కార్యాచరణ ప్రణాళికను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎప్పటి నుంచి దీన్ని అమలు చేయాలన్న దానిపై రెండు మూడ్రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. 60రోజుల తర్వాత ముఖ్య అధికారుల నేతృత్వంలోని 100 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, ఆకస్మిక తనిఖీలు చేపడతాయన్నారు. ఏ గ్రామంలో అయితే 60రోజుల కార్యాచరణలో నిర్దేశించిన పనులు చేపట్టలేదో అక్కడ సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. 

పీఆర్, పరిషత్‌ పోస్టులు భర్తీ 
పంచాయతీరాజ్, మండల పరిషత్, జిల్లా పరిషత్‌ల్లోని పోస్టులను భర్తీ చేస్తామని ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు. గ్రామాభివృద్ధిలో పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు ఏమేమి పనులు చేయాలో స్పష్టంగా నిర్వచించుకుని ఎవరి విధులు వారే నిర్వహించాలన్నారు. శనివారం ప్రగతిభవన్‌లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళికపై వివిధ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు, డీపీవోలు, ఈవోపీఆర్డీలు, సర్పంచ్‌ల సంఘం ప్రతినిధులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సీఎస్‌ ఎస్‌కే జోషి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ముఖ్య కార్యదర్శి ఎస్‌. నర్సింగ్‌ రావు, పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి వికాస్‌ రాజ్, కమిషనర్‌ నీతూ ప్రసాద్, పాలమూరు, సిద్దిపేట, కామారెడ్డి, జయశంకర్‌ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, సిరిసిల్ల జిల్లాల డీపీవోలు, రిటైర్ట్‌ డీపీవో లింబగిరి స్వామి, ఈవోపీఆర్డీలు సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన యాదవ్, ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడు ప్రణీత్‌ చందర్, ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్‌ రెడ్డి, నల్లగొండ జిల్లా అధ్యక్షురాలు ధనలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి బాచిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

నిక్కచ్చిగా వ్యవహరిస్తాం 
‘స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా గ్రామాల పరిస్థితి ఇంకా మారలేదు. వివిధ రూపాల్లో వేల కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేదు. గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే పడి ఉన్నాయి. ఎవరికి వారు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను బాగుచేసుకునే పద్ధతి రావడం లేదు. ఈ పరిస్థితిలో గుణాత్మక మార్పు రావాలి. అందుకోసమే కొత్త పీఆర్‌ చట్టం తెచ్చాం. అధికారులు, ప్రజా ప్రతినిధులపై కచ్చితమైన బాధ్యతలు పెట్టాం. ఎవరేం పని చేయాలో నిర్దేశించాం.

అవసరమైన అధికారాలిచ్చాం. కావాల్సిన నిధులను బడ్జెట్లోనే కేటాయించాం. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం కూడా ఈ చట్టం ప్రభుత్వానికి కల్పించింది. కొత్త చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేసే విషయంలో ప్రభుత్వం చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తుంది. ఎవరినీ ఉపేక్షించదు. గుణాత్మక మార్పుకోసం ఏంచేయాలో అది చేస్తాం’అని కేసీఆర్‌ పేర్కొన్నారు. 

ఈవోపీఆర్డీ పేరు ఎంపీవోగా మార్పు 
‘అన్ని జిల్లాలకు జిల్లా పంచాయతీ అధికారులను (డీపీవో)లను నియమించాలి. రెవెన్యూ డివిజన్‌ ఓ డీఎల్పీవోను, మండలానికో ఎంపీవోను నియమించాలి. ఖాళీగా ఉన్న ఎంపీడీవో, సీఈవో పోస్టులను భర్తీ చేయాలి. వీటిని భర్తీ చేయడానికి వీలుగా పంచాయతీ అధికారులకు పదోన్నతులివ్వాలి. శాఖాపరంగానే కొత్త నియామకాలు చేపట్టాలి. ప్రక్రియ అంతా చాలా వేగంగా జరగాలి’అని సీఎం ఆదేశించారు. 

ఈ కార్యాచరణలో చేపట్టాల్సిన పనులు.. 

  • గ్రామంలో పారిశుధ్య పనులను పక్కాగా నిర్వహించాలి. మురికి కాల్వలన్నీ శుభ్రం చేయాలి.  
  • గ్రామ పరిధిలోని పాఠశాల, పీహెచ్‌సీ, అంగన్‌వాడీ కేంద్రంతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థల్లో పారిశుధ్యం గ్రామ పంచాయతీల బాధ్యత. 
  • కూలిపోయిన ఇండ్లు, పాడైపోయిన పశువుల కొట్టాల శిథిలాలను పూర్తిగా తొలగించాలి. 
  • ఉపయోగించని, పాడుపడిన బావులను, నీటి బొందలను పూర్తిగా పూడ్చేయాలి. ఇందుకోసం ఉపాధిహామీ నిధులతో మొరం నింపాలి. గ్రామంలో ఎప్పటికప్పుడు దోమల మందు పిచికారి చేయాలి. 
  •  వైకుంఠధామం (శ్మశాన వాటిక) నిర్మాణం కోసం అనువైన స్థలాలను ఎంపిక చేయాలి. 
  •  గ్రామ డంపింగ్‌ యార్డు కోసం స్థలం సేకరించాలి. విలేజ్‌ కమ్యూనిటీ హాల్, గోదాము నిర్మాణానికి స్థలాలు సేకరించాలి. 
  •  గ్రామానికి కావాల్సిన వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించాలి. 

పంచాయతీలు నిర్వహించాల్సిన బాధ్యతలు 
గ్రామంలో 100% పన్నులు వసూలు చేయాలి. వారపు సంత (అంగడి)లో సౌకర్యాలు కల్పిం చాలి. వివాహ రిజిస్ట్రేషన్‌ నిర్వహించాలి. ఎవరు పెళ్లి చేసుకున్నా వెంటనే రికార్డు చేయాలి.  జనన, మరణ రికార్డులు రాయాలి. పుట్టిన వెంటనే తల్లిదండ్రులకు, కులం వివరాలతో బర్త్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలి.  విద్యుత్‌ సంస్థలకు తప్పకుండా బిల్లులు చెల్లించాలి. పంచాయతీ నిధు లతో ఉపాధి హామీ నిధులు అనుసంధానం అయ్యే విధానం రూపొందించాలి. ఆయా ప్రాంతాల్లోని పరిశ్రమలతో సంప్రదించి, సీఎస్‌ఆర్‌ నిధులను గ్రామాభివృద్ధికి ఉపయోగించే విధానం అవలంబించాలి. గ్రామస్తులను శ్రమదానానికి ప్రోత్సహించి, సామాజిక కార్యక్రమాలు చేపట్టాలి.  

‘పవర్‌’వీక్‌ లో చేయాల్సిన పనులు

  • 60 రోజుల కార్యాచరణలో భాగంగా 7రోజుల పాటు పూర్తిగా విద్యుత్‌ సంబంధమైన సమస్యలను పరిష్కరించాలి. 
  • ఆ గ్రామంలో వీధిలైట్ల కోసం ఎంత కరెంటు వాడుతున్నారో కచ్చితమైన నిర్ధారణకు రావాలి. 
  • మీటర్లు పెట్టాలి. వీధిలైట్ల కోసం థర్డ్‌ లైను వేయాలి. విధిగా ఎల్‌ఈడీ బల్బులు అమర్చాలి. 
  •  గ్రామంలో వంగిపోయిన స్తంభాలు, వేలాడే వైర్లు సరిచేయాలి. 

హరితహారంలో చేయాల్సిన పనులు

  • గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనే విలేజ్‌ నర్సరీ ఏర్పాటు చేయాలి. 
  • మండల అటవీశాఖాధికారి సాంకేతిక సహకారం తీసుకోవాలి. ఉపాధిహామీ నిధులు వినియోగించాలి. 
  • గ్రామంలో విరివిగా మొక్కలు నాటాలి. వాటికి నీళ్లు పోసి, రక్షించాలి. పెట్టిన మొక్కలన్నీ చెట్లుగా ఎదిగే వరకు బాధ్యత తీసుకోవాలి. గ్రామస్తులకు కావాల్సిన రకం మొక్కలను సరఫరా చేయాలి. 
  • చింతచెట్లను పెద్ద సంఖ్యలో పెంచాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement