
పోతిరెడ్డిపాడుపై ఏకపక్ష నిర్ణయాలా?
కృష్ణా జలాల నీటి పంపిణీ, వినియో గం, నిర్వహణ, టెలీమెట్రీల ఏర్పాటు విషయంలో కృష్ణా బోర్డు ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలపై తెలంగాణ మరోసారి ఘాటుగా స్పందించింది.
కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శికి స్పెషల్ సీఎస్ ఎస్‌కే జోషి ఘాటు లేఖ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల నీటి పంపిణీ, వినియో గం, నిర్వహణ, టెలీమెట్రీల ఏర్పాటు విషయంలో కృష్ణా బోర్డు ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలపై తెలంగాణ మరోసారి ఘాటుగా స్పందించింది. పోతిరెడ్డిపాడు వద్ద టెలిమెట్రీ పాయింట్ మార్పునకు తాము అంగీకరించకు న్నా, తమ ఆమోదం ఉన్నట్లుగా కాంట్రాక్టు ఏజెన్సీలకు బోర్డు లేఖ రాయడాన్ని తప్పుబట్టింది. తాము సూచించిన 600 మీటర్ల పాయింట్ వద్దే టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు శుక్రవారం కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శికి నేరుగా, లేఖ ద్వారా తెలంగాణ నీటి పారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్‌కే జోషి స్పష్టం చేశారు. మొదట ఇరు రాష్ట్రాలు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ దిగువన 600 మీటర్ల వద్ద టెలీమెట్రీకి ప్రతిపా దించాయి. ఇరు రాష్ట్రాలు అంగీకరించిన తర్వాత ఏపీ దాన్ని శ్రీశైలం కుడి కాల్వ కింద 12.26 కిలోమీటర్ పాయింట్‌కు మార్చాలని కోరగా.. బోర్డు ఏకపక్షంగా ఆమోదం తెలిపింది. పాయింట్ మారిస్తే అక్కడి నీటి వినియోగం లెక్కలోకి రాదని రాష్ట్రం అభ్యంతరం తెలిపింది.
దీంతో బోర్డు వెనక్కి తగ్గింది. తాజాగా 600 మీటర్ల పాయింట్ వద్ద టెలీమెట్రీకి సమయం పట్టే అవకాశం ఉన్నందున, ఆలోగా 12.26 పాయింట్ వద్ద ఏర్పాటు చేద్దామని బోర్డు ప్రతిపాదించింది. దీనిపై ఇరు రాష్ట్రాల అభిప్రాయం కోరగా, తెలంగాణ స్పందన తెలుపలేదు. ఈ లోగానే టెలీమెట్రీ ఏర్పాటు చేస్తున్న ఏజెన్సీకి బోర్డు లేఖ రాసింది. తెలంగాణ స్పెషల్ సీఎస్ అంగీకరించారని, అందుకు అనుగుణంగా టెలీమెట్రీ ఏర్పాటు చేయాలని కోరింది. దీనిపై ఎస్‌కే జోషి, బోర్డు సభ్య కార్యదర్శిని తన కార్యాలయానికి పలిపించుకుని ఏకపక్షంగా ఎలా లేఖ రాస్తారని ప్రశ్నించారు. అనంతరం ఇదే అంశాలపై ఆయనకు విడిగా లేఖ రాశారు.