ఫైల్ ఫోటో
సాక్షి, అమరావతి : తెలంగాణ సర్కార్ అక్రమ నీటి వినియోగంపై కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం మరోసారి ఫిర్యాదు చేసింది. ప్రస్తుత నీటి సంవత్సరం ప్రారంభం నుంచే.. అంటే జూన్ ఒకటో తేదీ నుంచే దిగువన సాగు, తాగునీటి అవసరాలు లేకున్నా, కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండానే తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ ప్రాజెక్టును ఖాళీ చేస్తోందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ అక్రమ నీటి వినియోగంపై పలుమార్లు ఫిర్యాదు చేశామని బోర్డుకు గుర్తు చేసింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురేకు ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి బుధవారం లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానాంశాలు..
► శ్రీశైలంలో 884.90 అడుగుల మట్టంలో నీటి నిల్వ ఉండగా.. తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రంలో నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తుండటం వల్ల బుధవారం నాటికి నీటి మట్టం 879.3 అడుగులకు తగ్గిపోయింది.
► నాగార్జునసాగర్ పూర్తి నీటి మట్టం 590 అడుగులు, పూర్తి నీటి నిల్వ 312.05 టీఎంసీలు. బుధవారం నాటికి సాగర్‌లో 589.5 అడుగుల్లో 310.55 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సాగర్‌లో పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉన్న నేపథ్యంలో సాగు, తాగునీటి అవసరాల కోసం తక్షణమే శ్రీశైలం నుంచి నీటిని దిగువకు విడుదల చేయాల్సిన అవసరం లేదు. అయినా సరే తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రంలో అక్రమంగా నీటిని వాడుకుంటోంది.
► శ్రీశైలం నీటి మట్టం 854 అడుగుల కంటే ఎగువన ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగు నీటిని, చెన్నైకి తాగు నీటిని సరఫరా చేయొచ్చు. కానీ, ప్రాజెక్టును తెలంగాణ సర్కార్ ఖాళీ చేస్తుండటం వల్ల నీటి మట్టం తగ్గిపోతుండటంతో సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీటిని సరఫరా చేయడంలో సమస్యలొస్తున్నాయి.
► శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని వదిలేస్తుండటంతో ఆ నీరు సాగర్, పులిచింతల మీదుగా ప్రకాశం బ్యారేజీ ద్వారా వృథాగా సముద్రంలో కలుస్తోంది.
► ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్‌ను నియంత్రించి.. ఏపీ హక్కులను పరిరక్షించాలి. అనుమతి లేకుండా విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ సర్కార్ వాడుకున్న నీటిని ఆ రాష్ట్ర కోటా కింద లెక్కించాలి.
Comments
Please login to add a commentAdd a comment