nec
-
రెండ్రోజులపాటు 70వ ఎన్ఈసీ సమావేశాలు
గువాహటి నుంచి సాక్షి ప్రతినిధి: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటైన ఈశాన్య రాష్ట్రాల మండలి (నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్) 70 వ ప్లీనరీ సమావేశాలు నేటి నుంచి రెండు రోజుల పాటు అసోం రాజధాని గువాహటిలో జరగనున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి, ఎన్ఈసీ ఎక్స్–అఫిషియో చైర్మన్ అమిత్ షా నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశాల్లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు, ఉన్నతాధికారులతో పాటు ఎనిమిది రాష్ట్రాల గవర్నర్లు కూడా పాల్గొననున్నారు. ఈ సమావేశాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి స్థాపన తర్వాత మారుతున్న పరిస్థితులు, ఈ ఎనిమిది రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించిన ఆర్థిక మద్దతు, వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత (రైలు, రోడ్డు, విమాన, జలమార్గాల్లో), ఉడాన్ పథకంలో భాగంగా జరుగుతున్న విమానాశ్రయాల నిర్మాణం, టెలికామ్ అనుసంధానత, విద్యుత్, ఎనర్జీ రంగాలు, విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల్లో గతంలో నిర్దేశించుకున్న లక్ష్యాల్లో ఎంతవరకు చేరుకున్నారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి లక్ష్యాల నిర్దేశం తదితర అంశాలపై కూలంకశంగా చర్చించనున్నారు. దీంతోపాటుగా యువతకు ఉపాధి కల్పన, పరిశ్రమలు, పర్యాటకం, ఆగ్నేయాసియా దేశాలతో అనుసంధానత తదితర అంశాలపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి జీ–20 సదస్సుకు భారతదేశం నేతృత్వం వహిస్తున్న సందర్భంలో.. ఈ సమావేశాల్లో ఈశాన్య రాష్ట్రాల భాగస్వామ్యం తదితర అంశాలను కూడా చర్చించనున్నారు. అంతేగాక ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ పర్యటనలో భాగంగా జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఈశాన్య రాష్ట్రాలతో సంబంధాలు మెరుగుపరిచేందుకు ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులను తీసుకొని బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సిందిగా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో బంగ్లాదేశ్ పర్యటనకు సంబంధించిన అంశాలపై కూడా ప్లీనరీలో చర్చించే అవకాశం ఉంది. కాగా గతేడాది మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో 69వ ఎన్ఈసీ సమావేశాలు జరిగాయి. చదవండి: నేనేం సోనియా రిమోట్‌ను కాను -
తెలంగాణ సర్కార్‌ను నియంత్రించండి..
సాక్షి, అమరావతి : తెలంగాణ సర్కార్ అక్రమ నీటి వినియోగంపై కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం మరోసారి ఫిర్యాదు చేసింది. ప్రస్తుత నీటి సంవత్సరం ప్రారంభం నుంచే.. అంటే జూన్ ఒకటో తేదీ నుంచే దిగువన సాగు, తాగునీటి అవసరాలు లేకున్నా, కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండానే తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ ప్రాజెక్టును ఖాళీ చేస్తోందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ అక్రమ నీటి వినియోగంపై పలుమార్లు ఫిర్యాదు చేశామని బోర్డుకు గుర్తు చేసింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురేకు ఈఎన్సీ సి.నారాయణరెడ్డి బుధవారం లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానాంశాలు.. ► శ్రీశైలంలో 884.90 అడుగుల మట్టంలో నీటి నిల్వ ఉండగా.. తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రంలో నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తుండటం వల్ల బుధవారం నాటికి నీటి మట్టం 879.3 అడుగులకు తగ్గిపోయింది. ► నాగార్జునసాగర్ పూర్తి నీటి మట్టం 590 అడుగులు, పూర్తి నీటి నిల్వ 312.05 టీఎంసీలు. బుధవారం నాటికి సాగర్‌లో 589.5 అడుగుల్లో 310.55 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సాగర్‌లో పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉన్న నేపథ్యంలో సాగు, తాగునీటి అవసరాల కోసం తక్షణమే శ్రీశైలం నుంచి నీటిని దిగువకు విడుదల చేయాల్సిన అవసరం లేదు. అయినా సరే తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రంలో అక్రమంగా నీటిని వాడుకుంటోంది. ► శ్రీశైలం నీటి మట్టం 854 అడుగుల కంటే ఎగువన ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగు నీటిని, చెన్నైకి తాగు నీటిని సరఫరా చేయొచ్చు. కానీ, ప్రాజెక్టును తెలంగాణ సర్కార్ ఖాళీ చేస్తుండటం వల్ల నీటి మట్టం తగ్గిపోతుండటంతో సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీటిని సరఫరా చేయడంలో సమస్యలొస్తున్నాయి. ► శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని వదిలేస్తుండటంతో ఆ నీరు సాగర్, పులిచింతల మీదుగా ప్రకాశం బ్యారేజీ ద్వారా వృథాగా సముద్రంలో కలుస్తోంది. ► ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్‌ను నియంత్రించి.. ఏపీ హక్కులను పరిరక్షించాలి. అనుమతి లేకుండా విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ సర్కార్ వాడుకున్న నీటిని ఆ రాష్ట్ర కోటా కింద లెక్కించాలి. -
ఎన్వైఎస్ఈ ఎఫెక్ట్... రిస్క్ మేనేజ్మెంట్పై సెబీ సమీక్ష
ముంబై : అమెరికాలోని న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్వైఎస్ఈ)లో సాంకేతిక సమస్య కారణంగా బుధవారం 4 గంటలపాటు ట్రేడింగ్ నిలిచిపోవడంతో భారత్‌లోనూ ఇలాంటి పరిస్థితులు తలెత్తితే తీసుకోవాల్సిన చర్యలపై సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీలు దృష్టిసారించాయి. దేశీ మార్కెట్లలో మొత్తం రిస్క్ మేనేజ్మెంట్, విపత్తుల రికవరీ వ్యవస్థలపై గురువారం అత్యవసరంగా సమీక్ష నిర్వహించాయి. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా సిస్టమ్స్ అన్నింటినీ క్రమంగా ఇప్పటికే అప్‌గ్రేడ్ చేసినట్లు సంబంధిత ఉన్నతాధికారులు వెల్లడించారు. సమీక్షలో అన్ని సిస్టమ్స్ పనితీరుపై సంతృప్తి వ్యక్తమైందని, ఎలాంటి సమస్యలూ గుర్తించలేదన్నారు. ఎన్వైఎస్ఈలో సాంకేతిక సమస్యను నాలుగు గంటల తర్వాత పరిష్కరించడంతో ఆ ఎక్స్ఛేంజ్లో ముగింపు సమయంలో ట్రేడింగ్ జరిగింది. కాగా ఈ సాంకేతిక సమస్యకు అంతర్గత సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్స్ కొంతవరకూ కారణమైనట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. సైబర్ దాడులు వంటివి ఈ సమస్యకు కారణం కాదని కూడా అమెరికా నియంత్రణ సంస్థలు, ఇతర ఏజెన్సీలు స్పష్టం చేశాయి. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ(ఎస్ఈసీ) పేర్కొంది. మరోపక్క, బుధవారం కంప్యూటర్ సంబంధ సమస్యల కారణంగానే యునెటైడ్ ఎయిర్‌లైన్స్ విమానాలు రెండు గంటలపాటు నిలిచిపోవడం, వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక వెబ్సైట్ తాత్కాలికంగా పనిచేయకపోవడంతో అక్కడి నియంత్రణ సంస్థలకు ముచ్చెమటలు పట్టించింది.