గువాహటి నుంచి సాక్షి ప్రతినిధి: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటైన ఈశాన్య రాష్ట్రాల మండలి (నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్) 70 వ ప్లీనరీ సమావేశాలు నేటి నుంచి రెండు రోజుల పాటు అసోం రాజధాని గువాహటిలో జరగనున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి, ఎన్‌ఈసీ ఎక్స్–అఫిషియో చైర్మన్ అమిత్ షా నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశాల్లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు, ఉన్నతాధికారులతో పాటు ఎనిమిది రాష్ట్రాల గవర్నర్లు కూడా పాల్గొననున్నారు.
ఈ సమావేశాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి స్థాపన తర్వాత మారుతున్న పరిస్థితులు, ఈ ఎనిమిది రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించిన ఆర్థిక మద్దతు, వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత (రైలు, రోడ్డు, విమాన, జలమార్గాల్లో), ఉడాన్ పథకంలో భాగంగా జరుగుతున్న విమానాశ్రయాల నిర్మాణం, టెలికామ్ అనుసంధానత, విద్యుత్, ఎనర్జీ రంగాలు, విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల్లో గతంలో నిర్దేశించుకున్న లక్ష్యాల్లో ఎంతవరకు చేరుకున్నారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి లక్ష్యాల నిర్దేశం తదితర అంశాలపై కూలంకశంగా చర్చించనున్నారు.
దీంతోపాటుగా యువతకు ఉపాధి కల్పన, పరిశ్రమలు, పర్యాటకం, ఆగ్నేయాసియా దేశాలతో అనుసంధానత తదితర అంశాలపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి జీ–20 సదస్సుకు భారతదేశం నేతృత్వం వహిస్తున్న సందర్భంలో.. ఈ సమావేశాల్లో ఈశాన్య రాష్ట్రాల భాగస్వామ్యం తదితర అంశాలను కూడా చర్చించనున్నారు.
అంతేగాక ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ పర్యటనలో భాగంగా జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఈశాన్య రాష్ట్రాలతో సంబంధాలు మెరుగుపరిచేందుకు ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులను తీసుకొని బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సిందిగా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో బంగ్లాదేశ్ పర్యటనకు సంబంధించిన అంశాలపై కూడా ప్లీనరీలో చర్చించే అవకాశం ఉంది. కాగా గతేడాది మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో 69వ ఎన్‌ఈసీ సమావేశాలు జరిగాయి.
చదవండి: నేనేం సోనియా రిమోట్‌ను కాను
Comments
Please login to add a commentAdd a comment