ఎన్‌వైఎస్‌ఈ ఎఫెక్ట్... రిస్క్ మేనేజ్‌మెంట్‌పై సెబీ సమీక్ష
ముంబై : అమెరికాలోని న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్‌వైఎస్‌ఈ)లో సాంకేతిక సమస్య కారణంగా బుధవారం 4 గంటలపాటు ట్రేడింగ్ నిలిచిపోవడంతో భారత్‌లోనూ ఇలాంటి పరిస్థితులు తలెత్తితే తీసుకోవాల్సిన చర్యలపై సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీలు దృష్టిసారించాయి. దేశీ మార్కెట్లలో మొత్తం రిస్క్ మేనేజ్‌మెంట్, విపత్తుల రికవరీ వ్యవస్థలపై గురువారం అత్యవసరంగా సమీక్ష నిర్వహించాయి. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా సిస్టమ్స్ అన్నింటినీ క్రమంగా ఇప్పటికే అప్‌గ్రేడ్ చేసినట్లు సంబంధిత ఉన్నతాధికారులు వెల్లడించారు. సమీక్షలో అన్ని సిస్టమ్స్ పనితీరుపై సంతృప్తి వ్యక్తమైందని, ఎలాంటి సమస్యలూ గుర్తించలేదన్నారు.
ఎన్‌వైఎస్‌ఈలో సాంకేతిక సమస్యను నాలుగు గంటల తర్వాత పరిష్కరించడంతో ఆ ఎక్స్ఛేంజ్‌లో ముగింపు సమయంలో ట్రేడింగ్ జరిగింది. కాగా ఈ సాంకేతిక సమస్యకు అంతర్గత సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్స్ కొంతవరకూ కారణమైనట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. సైబర్ దాడులు వంటివి ఈ సమస్యకు కారణం కాదని కూడా అమెరికా నియంత్రణ సంస్థలు, ఇతర ఏజెన్సీలు స్పష్టం చేశాయి. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ(ఎస్‌ఈసీ) పేర్కొంది. మరోపక్క, బుధవారం కంప్యూటర్ సంబంధ సమస్యల కారణంగానే యునెటైడ్ ఎయిర్‌లైన్స్ విమానాలు రెండు గంటలపాటు నిలిచిపోవడం, వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక వెబ్‌సైట్ తాత్కాలికంగా పనిచేయకపోవడంతో అక్కడి నియంత్రణ సంస్థలకు ముచ్చెమటలు పట్టించింది.