నిలిచిపోయిన ఎన్‌వైఎస్‌ఈ
♦ సాంకేతిక సమస్యలతో న్యూయార్క్ ఎక్స్ఛేంజీ నిలిపివేత
♦ షేర్లలో లావాదేవీల్లేవు; ముందస్తు ఆర్డర్లు కూడా రద్దు
♦ బుధవారం రాత్రి 9కి హాల్టు; అర్ధరాత్రికీ చక్కబడని తీరు
♦ సైబర్ దాడి కాదని... సాంకేతిక సమస్యలేనని చెబుతున్న అధికారులు
♦ యునెటైడ్ ఎయిర్‌లైన్స్‌కూ సాంకేతిక బెడద; విమానాలన్నీ నిలిపివేత
♦ వాల్‌స్ట్రీట్ జర్నల్ వెబ్‌సైట్ డౌన్
న్యూయార్క్ : అమెరికాలో అనూహ్య సంఘటనలు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజీగా పేరొందిన న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ తీవ్రమైన సాంకేతిక సమస్యలతో అల్లాడిపోయింది. ఫలితంగా ఈ ఎక్స్ఛేంజీలో లిస్టయిన షేర్లన్నిట్లోనూ లావాదేవీలు నిలిపేశారు. అప్పటికే పెట్టిన ఓపెన్ ఆర్డర్లన్నిటినీ రద్దు చేస్తున్నట్లు కూడా ఎక్స్ఛేంజీ ప్రకటించింది. ఇదే సమయంలో అమెరికా ప్రభుత్వ విమానయాన సంస్థ యునెటైడ్ ఎయిర్‌లైన్స్‌నూ సాంకేతిక సమస్యలు అట్టుడికించాయి. దీంతో అమెరికాలోని తమ విమానాలన్నిటినీ ఈ సంస్థ అత్యవసరంగా కిందికి దింపేసింది. బయలుదేరాల్సిన విమానాలనూ కొంతసేపు నిలిపివేసింది.
అదే సమయంలో ప్రముఖ ఫైనాన్షియల్ పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ వెబ్‌సైట్ కూడా పనిచేయకుండా డౌనయిపోయింది. దీనికి కారణాలు తెలియరాకపోగా... యునెటైడ్ ఎయిర్‌లైన్స్ మాత్రం రౌటర్లో తలెత్తిన సాంకేతిక సమస్య వల్లే ఇలా జరిగిందని, దీన్ని సరిచేసి మళ్లీ అన్నిటినీ పునరుద్ధరించామని తెలియజేసింది. ఈ 3 ఘటనలకూ సంబంధం లేకపోయినా, దాదాపు ఒకే సమయంలో జరగటంతో ప్రాధాన్యమేర్పడింది.
రాత్రి 9 గంటల నుంచీ నిలిపివేత...
భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9 గ ంటల సమయంలో ట్రేడింగ్‌ను నిలిపేస్తున్నట్లు న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ ప్రకటించింది. దాదాపు రాత్రి 12 గంటల సమయానికి కూడా పరిస్థితి చక్కబడలేదు. సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజీ కమిషన్ (ఎస్‌ఈసీ) అధికారులు అధ్యక్షుడు ఒబామాకు కూడా పరిస్థితిని తెలియజేశారు. ‘‘ఎఫ్‌బీఐ కూడా రంగంలోకి దిగింది. కాకపోతే ఇది సాంకేతిక సమస్యే తప్ప సైబర్ దాడి కాదని మేం నమ్ముతున్నాం’’ అని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. ట్రేడింగ్‌ను ఎప్పుడు పునరుద్ధరించేదీ మాత్రం ఈ వర్గాలు చెప్పలేకపోయాయి.
రోజుకు 180 బిలియన్ డాలర్ల లావాదేవీలు...
న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ పరిధిలో దాదాపు నాలుగు ఇండెక్స్‌లున్నాయి. ఎన్‌వైఎస్‌ఈ కాంపోజిట్ ప్రధాన ఇండెక్స్ కాగా, ఎన్‌వైఎస్‌ఈ 100 కూడా దీన్లో భాగమే. ఇంకా డౌజోన్స్, ఎస్ అండ్ పీ ఇండెక్స్‌లు కూడా ఒప్పందం మేరకు దీని పరిధిలోనే పనిచేస్తాయి. ఎన్‌వైఎస్‌ఈలో ప్రతిరోజూ నమోదయ్యే లావాదేవీల పరిమాణ సగటు 180 బిలియన్ డాలర్లు. మార్కె ట్ క్యాపిటల్ దృష్ట్యా ఇదే ప్రపంచంలో అతిపెద్ద ఎక్స్ఛేంజీ. ఎందుకంటే దీన్లో లిస్టయిన షేర్ల మార్కెట్ క్యాప్ దాదాపు 16.6 ట్రిలియన్ డాలర్లు. దీన్ని ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్ఛేంజీ (ఐసీ ఈ) అనే ప్రైవేటు సంస్థ నిర్వహిస్తుండగా.. ట్రేడింగ్ నిలి చిపోయే సమయానికి ఆ సంస్థ షేరు విలువ దాదాపు 4% నష్టపోయింది.