కృష్ణా బోర్డు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తిని తక్షణమే నిలిపేయాలని కృష్ణా బోర్డు మరోసారి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తిని నిలిపేయాలని ఈ నెల 15న తెలంగాణను బోర్డు ఆదేశించినప్పుటికీ తాము ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటామని తెలంగాణ జెన్‌కో అధికారులు బోర్డుకు లేఖ రాశారు. ఈ సమయంలో బోర్డు ఆదేశించినా విద్యుదుత్పత్తి కొనసాగిస్తుందని తెలంగాణపై ఏపీ ఫిర్యాదు చేసింది. వీటిన్నింటి నేపథ్యంలో శుక్రవారం రాత్రి బోర్డు తెలంగాణకు మరో లేఖ రాసింది. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని ఆపాలని, నీటి విడుదల ఉత్తర్వులను అమలు చేయాలని సూచించింది.
జూరాల, శ్రీశైలంకు పెరిగిన ప్రవాహాలు
కృష్ణా బేసిన్ పరీవాహకంలో కురుస్తోన్న వర్షాలతో ఎగువ ప్రాజెక్టులైన ఆల్మట్టి, నారాయణపూర్‌లకు 50వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహాలు వస్తున్నాయి. నీటిని దిగువకు వదిలేయడంతో జూరాలకు 61,700 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఇక్కడి నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో శ్రీశైలానికి 59,650 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 215 టీఎంసీలకుగానూ 36.04 టీఎంసీల నిల్వలున్నాయి. 6,357 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదవుతోంది. ఇక దిగువన సాగర్‌కు 4,982 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 312 టీఎంసీల నిల్వకుగానూ 169.13 టీఎంసీల నిల్వ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment