Srisailam hydroelectric project
-
విద్యుదుత్పత్తికి అనుమతి ఇవ్వండి
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు నిండటానికి మరో 99 టీఎంసీలే అవసరమని, ఎగువ నుంచి 150 టీఎంసీల వరద జలాలు వస్తాయన్న అంచనాల నేపథ్యంలో కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేయడానికి అనుమతి ఇవ్వాలని కృష్ణాబోర్డుకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. గేట్లు ఎత్తేసి వరదను దిగువకు విడుదల చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని పేర్కొంది. విభజన చట్టం ప్రకారం వరద ముప్పును ఎదుర్కోవాల్సిన బాధ్యత రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని, విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదల చేయడం వల్ల వరద ముప్పును తప్పించవచ్చని తెలిపింది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా విద్యుదుత్పత్తికి అనుమతి ఇవ్వాలని కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురేకు ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ఆదివారం లేఖ రాశారు. ఆ లేఖలోని ప్రధానాంశాలు.. ► ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి శ్రీశైలం ప్రాజెక్టులో 4,05,724 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 36,059 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. 863.4 అడుగుల్లో 116.92 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ► కృష్ణా వరద ఉద్ధృతి వల్ల ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర జలాశయాల గేట్లు ఎత్తేశారు. ఎగువ నుంచి 3, 4 రోజులపాటు రోజుకు 4 లక్షల క్యూసెక్కుల చొప్పున వరద శ్రీశైలానికి వస్తుందని సీడబ్ల్యూసీ సమాచారం ఇచ్చింది. ► మూడు నాలుగు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టుకు 150 టీఎంసీల ప్రవాహం చేరుతుందని ఆ ప్రాజెక్టు సీఈ లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండటానికి మరో 99 టీఎంసీలే అవసరం. ప్రాజెక్టు ఆపరేషనల్ ప్రొటోకాల్స్ ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టుకు ఎక్కువ వరద వచ్చినప్పుడు మిగులు జలాలను విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేయాలి. విభజన చట్టం 11వ షెడ్యూల్లో సెక్షన్–85(7) ఈ ప్రకారం వరద ముప్పును తప్పించాల్సిన బాధ్యత 2 రాష్ట్రాలపై ఉంటుంది. కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదల చేయడానికి అనుమతివ్వండి. -
శ్రీశైలం విద్యుదుత్పత్తి: తెలంగాణకు మళ్లీ లేఖ
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తిని తక్షణమే నిలిపేయాలని కృష్ణా బోర్డు మరోసారి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తిని నిలిపేయాలని ఈ నెల 15న తెలంగాణను బోర్డు ఆదేశించినప్పుటికీ తాము ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటామని తెలంగాణ జెన్కో అధికారులు బోర్డుకు లేఖ రాశారు. ఈ సమయంలో బోర్డు ఆదేశించినా విద్యుదుత్పత్తి కొనసాగిస్తుందని తెలంగాణపై ఏపీ ఫిర్యాదు చేసింది. వీటిన్నింటి నేపథ్యంలో శుక్రవారం రాత్రి బోర్డు తెలంగాణకు మరో లేఖ రాసింది. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని ఆపాలని, నీటి విడుదల ఉత్తర్వులను అమలు చేయాలని సూచించింది. జూరాల, శ్రీశైలంకు పెరిగిన ప్రవాహాలు కృష్ణా బేసిన్ పరీవాహకంలో కురుస్తోన్న వర్షాలతో ఎగువ ప్రాజెక్టులైన ఆల్మట్టి, నారాయణపూర్‌లకు 50వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహాలు వస్తున్నాయి. నీటిని దిగువకు వదిలేయడంతో జూరాలకు 61,700 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఇక్కడి నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో శ్రీశైలానికి 59,650 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 215 టీఎంసీలకుగానూ 36.04 టీఎంసీల నిల్వలున్నాయి. 6,357 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదవుతోంది. ఇక దిగువన సాగర్‌కు 4,982 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 312 టీఎంసీల నిల్వకుగానూ 169.13 టీఎంసీల నిల్వ ఉంది. -
శ్రీశైలం టెయిల్‌పాండ్ డ్యాంకు గండి
కోట్ల రూపాయలు కృష్ణార్పణం! మన్ననూర్: తెలంగాణ రాష్ట్ర జెన్కో ఆధ్వర్యంలో సుమారు రూ.100 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న శ్రీశైలం టెయిల్‌పాండ్ కాంక్రీట్ డ్యాంకు గండిపడింది. శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టుకు అనుసంధానంగా మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం వజ్రాలమడుగు వద్ద పాతాళగంగ నుంచి సుమారు 16కి.మీ దూరంలో ఈ డ్యాంను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాన్ని 2003లో ప్రారంభించగా.. 12 ఏళ్లుగా కొనసాగుతోంది. కృష్ణానది బ్యాక్ వాటర్‌ను మళ్లించి జలవిద్యుదుత్పత్తిని చేసేందుకు ఈ టెయిల్‌పాండ్ డ్యాంను నిర్మిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న డ్యాం శుక్రవారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. శ్రీశైలం హైడల్ ప్రాజెక్టులో విద్యుదుత్పాదన కొనసాగుతుండటంతో కొద్దిపాటి ప్రవాహానికి నిర్మాణంలోని డ్యాం మధ్య భాగంలో సుమారు 30 అడుగుల వెడల్పు, ఎత్తులో కాంక్రీట్ కొట్టుకుపోయింది. ఈ కారణంగా నిల్వ నీరు దిగువకు పారుతోంది. గురువారం రాత్రి 9 గంటల సమయంలో గండిపడినట్లు లింగాలగట్టు, పాతాళగంగ మత్స్యకారులు చెబుతున్నారు. మూడు నెలలుగా ఈ డ్యాంకు పగుళ్లు ఏర్పడినట్లు పేర్కొంటున్నారు. నీటిలో వేయాల్సిన ట్రీమి కాంక్రీట్‌లో నాణ్యత లోపించడం వల్లే గండిపడినట్లు ఇంజనీరింగ్ నిపుణులు ఓ అంచనాకు వచ్చారు. అకస్మాత్తుగా కాంక్రీట్ డ్యాంకు గండిపడడంతో మత్స్యకారుల వలలు, బుట్టలు దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు డ్యాం దెబ్బతినడానికి దారితీసిన పరిస్థితులపై ఉన్నతస్థాయిలో సమీక్షిస్తున్నట్లు తెలిసింది. సంఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో వర్షం కురవడం ద్వారా చిత్తడిగా మారింది. ఈ నేపథ్యంలో శనివారం జెఎన్‌కో ఉన్నతాధికారులు వజ్రాలమడుగుకు చేరుకునే అవకాశం ఉందని తెలిసింది. కాగా, టెయిల్‌పాండ్ డ్యాం నిర్మాణ పనులు నాసిరకంగా జరుగుతున్నట్లు ప్రారంభం నుంచీ ఆరోపణలు రావడం గమనార్హం.