
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు నిండటానికి మరో 99 టీఎంసీలే అవసరమని, ఎగువ నుంచి 150 టీఎంసీల వరద జలాలు వస్తాయన్న అంచనాల నేపథ్యంలో కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేయడానికి అనుమతి ఇవ్వాలని కృష్ణాబోర్డుకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. గేట్లు ఎత్తేసి వరదను దిగువకు విడుదల చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని పేర్కొంది. విభజన చట్టం ప్రకారం వరద ముప్పును ఎదుర్కోవాల్సిన బాధ్యత రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని, విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదల చేయడం వల్ల వరద ముప్పును తప్పించవచ్చని తెలిపింది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా విద్యుదుత్పత్తికి అనుమతి ఇవ్వాలని కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురేకు ఏపీ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి ఆదివారం లేఖ రాశారు. ఆ లేఖలోని ప్రధానాంశాలు..
► ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి శ్రీశైలం ప్రాజెక్టులో 4,05,724 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 36,059 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. 863.4 అడుగుల్లో 116.92 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
► కృష్ణా వరద ఉద్ధృతి వల్ల ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర జలాశయాల గేట్లు ఎత్తేశారు. ఎగువ నుంచి 3, 4 రోజులపాటు రోజుకు 4 లక్షల క్యూసెక్కుల చొప్పున వరద శ్రీశైలానికి వస్తుందని సీడబ్ల్యూసీ సమాచారం ఇచ్చింది.
► మూడు నాలుగు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టుకు 150 టీఎంసీల ప్రవాహం చేరుతుందని ఆ ప్రాజెక్టు సీఈ లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండటానికి మరో 99 టీఎంసీలే అవసరం. ప్రాజెక్టు ఆపరేషనల్ ప్రొటోకాల్స్ ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టుకు ఎక్కువ వరద వచ్చినప్పుడు మిగులు జలాలను విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేయాలి. విభజన చట్టం 11వ షెడ్యూల్‌లో సెక్షన్–85(7) ఈ ప్రకారం వరద ముప్పును తప్పించాల్సిన బాధ్యత 2 రాష్ట్రాలపై ఉంటుంది. కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదల చేయడానికి అనుమతివ్వండి.
Comments
Please login to add a commentAdd a comment