water irrigation department
-
విద్యుదుత్పత్తికి అనుమతి ఇవ్వండి
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు నిండటానికి మరో 99 టీఎంసీలే అవసరమని, ఎగువ నుంచి 150 టీఎంసీల వరద జలాలు వస్తాయన్న అంచనాల నేపథ్యంలో కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేయడానికి అనుమతి ఇవ్వాలని కృష్ణాబోర్డుకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. గేట్లు ఎత్తేసి వరదను దిగువకు విడుదల చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని పేర్కొంది. విభజన చట్టం ప్రకారం వరద ముప్పును ఎదుర్కోవాల్సిన బాధ్యత రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని, విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదల చేయడం వల్ల వరద ముప్పును తప్పించవచ్చని తెలిపింది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా విద్యుదుత్పత్తికి అనుమతి ఇవ్వాలని కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురేకు ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ఆదివారం లేఖ రాశారు. ఆ లేఖలోని ప్రధానాంశాలు.. ► ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి శ్రీశైలం ప్రాజెక్టులో 4,05,724 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 36,059 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. 863.4 అడుగుల్లో 116.92 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ► కృష్ణా వరద ఉద్ధృతి వల్ల ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర జలాశయాల గేట్లు ఎత్తేశారు. ఎగువ నుంచి 3, 4 రోజులపాటు రోజుకు 4 లక్షల క్యూసెక్కుల చొప్పున వరద శ్రీశైలానికి వస్తుందని సీడబ్ల్యూసీ సమాచారం ఇచ్చింది. ► మూడు నాలుగు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టుకు 150 టీఎంసీల ప్రవాహం చేరుతుందని ఆ ప్రాజెక్టు సీఈ లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండటానికి మరో 99 టీఎంసీలే అవసరం. ప్రాజెక్టు ఆపరేషనల్ ప్రొటోకాల్స్ ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టుకు ఎక్కువ వరద వచ్చినప్పుడు మిగులు జలాలను విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేయాలి. విభజన చట్టం 11వ షెడ్యూల్లో సెక్షన్–85(7) ఈ ప్రకారం వరద ముప్పును తప్పించాల్సిన బాధ్యత 2 రాష్ట్రాలపై ఉంటుంది. కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదల చేయడానికి అనుమతివ్వండి. -
కాలువలు మరిచారా?
ఇంద్రవెల్లి(ఖానాపూర్): రైతుల మెట్ట భూములకు సాగునీరు అందించే లక్ష్యంతో మండలంలోని ముత్నూర్ శంకగర్గూడ గ్రామపంచాయతీల పరిధిలో 2005లో త్రివేణి సంఘం చెరువు నిర్మించారు. కాని ఎడమ, కుడి కాలువలు నిర్మించడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో రైతులకు సాగునీరు అందక వర్షాధార పంటలపైనే ఆధారపడుతున్నారు. 15 ఏళ్లుగా రైతులు ఆశతో సాగునీటి కోసం ఎదురుచూస్తేనే ఉన్నారు. రూ.3.70కోట్లతో చెరువు నిర్మాణం మండలంలోని ముత్నూర్, శంకర్‌గూడ, కేస్లాపూర్, మెండపల్లి, మెండపల్లిగూడ, దుర్వగూడ, గౌరపూర్, చిత్తబట్ట,« ధర్మసాగర్, మల్లాపూర్ తదితర గ్రామాల పరిధిలోని సుమారు 1500 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2005లో నీటిపారుదలశాఖ రూ.3.70కోట్లతో ముత్నూర్, శంకర్‌గూడ గ్రామాల మధ్య సుమారు 150ఎకరాల విస్తీర్ణంలో త్రివేణి సంఘం చెరువు నిర్మాణం చేపట్టారు. 14 సంవత్సరాలు పూర్తి కావస్తున్న చెరువు కుడి, ఎడమ కాలువలు మాత్రం నిర్మించలేదు. దీంతో చెరువు కేవలం చేపలు పెంచడానికి మాత్రమే పరిమితమైందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కాలువలను నిర్మించాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు. కాలువల నిర్మాణానికి రూ.2కోట్లు మండలంలోని ముత్నూర్ గ్రామ సమీపంలో నిర్మించినా త్రివేణి సంఘం చెరువు కుడి, ఎడమ కాలువు నిర్మించడానికి మూడు సంవత్సరాల క్రితం నీటిపారుదల శాఖ సర్వే చేసింది. ఎడమ, కుడి కాలువలు నిర్మాణానికి రూ.2కోట్లు మంజూరు చేసింది. నిధులు మంజూరై మూడేళ్లవుతున్నా స్థానిక నీటిపారుదల, రెవెన్యూశాఖల అధికారుల నిర్లక్ష్యంతో కాలువల నిర్మాణ పనులు కదలడం లేదు. చెరువు కింద భూములు పోతున్న రైతులు తమకు పరిహారం గిట్టుబాటుకాదని భూములు ఇవ్వడం లేదు. ఈ విషయంలో అధికారులు చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించకపోవడంతో కాలువల నిర్మాణం ముందుకు సాగడం లేదు. చెరువుకు కాలువలు నిర్మిస్తే తమ భూములకు సాగునీరు వస్తోందని ఆశతో ఉన్న ఆ ప్రాంత రైతులకు నిరాశే ఎదురవుతోంది. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి కాలువలు నిర్మించాలని రైతులు కోరుతున్నారు. సర్వే చేసినా ఫలితం లేదు.. ముత్నూర్ త్రివేణి సంఘం చెరువు నిర్మించారు. కానీ కాలువల నిర్మాణం మర్చిపోయారు. మూడు సంవత్సరాలుగా అధికారులు సర్వే చేస్తున్నా కాలువలు మాత్రం నిర్మించడం లేదు. దీంతో మా వ్యవసాయ భూములకు సాగునీరు అందడం లేదు. చెరువుల్లో ఈ ప్రాంత రైతుల వ్యవసాయ భూములకు సరిపడా సాగునీరు ఉన్నా ఫలితం లేదు. దీంతో కేవలం వర్షాధార పంటలపైనే ఆధారపడి సాగు చేస్తున్నాం. – తొడసం సంపత్‌రావు, రైతు ముత్నూర్ అసంపూర్తిగా ఎడమ కాలువు -
కొత్తకుంటకు జలకళ
గన్నేరువరం : మిడ్ మానేరు నీటితో మండలంలోని వివిధ గ్రామాల్లోని చెరువులు, కుంటలకు జలకళ సంతరించుకుంటుంది. మండలంలోని మాధాపూర్ గ్రామం కొత్తకుంటకు మిడ్ మానేరు నీటిని డిస్ట్రిబ్యూటర్ 9 ఉపకాల్వ ద్వారా విడుదల చేశారు. ఆ నీటితో కుంట నిండుకోవడంతో జలకళ వచ్చింది. రాజన్న సిరిసిల్లా జిల్లా బోయినిపల్లి మండలంలోని కొదురుపాకలో నిర్మించిన మిడ్ మానేరు నుంచి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామం వరకు గతంలో 34 కిలోమీటర్ల వరదకాల్వను పూర్తి చేశారు. మండలంలోని చీమలకుంటపల్లె, గునుకుల కొండాపూర్, పీచుపల్లి గ్రామాల మీదుగా మిడ్ మానేరు కుడికాల్వ నిర్మాణం ఉంది. అలాగే ఈ ఏడాది తోటపల్లి గ్రామంలో తోటపల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేసి గత నెల 11వ తేదీన దీనిలోకి మిడ్‌మానేరు కుడికాల్వ ద్వారా నీటి పారుదలశాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ రిజర్వాయర్ నిండుకుని కుడికాల్వలో బ్యాక్‌వాటర్ పెరిగింది. ఈ క్రమంలో ఈ నీటిని అక్టోబర్‌లో డిస్ట్రిబ్యూటర్ 4 ఉపకాల్వ ద్వారా గన్నరువరం గ్రామ చెరువుకు, పారువెల్ల గ్రామ పంట పొలాలకు నీటిని విడుదల చేశారు. బుధవారం ఖాసీంపేట గ్రామంలోని డిస్ట్రిబ్యూటర్ 8 ఉప కాల్వకు విడుదల చేశారు. తాజాగా మాధాపూర్ గ్రామానికి నీటిని విడుదల చేసి కొత్తకుంటను నింపడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బావుల్లో భూగర్భజలాలు పెరగడానికి దోహదపడుతుందని అంటున్నారు. కుడికాల్వలో నీటినిల్వతో దాని సమీపంలోని బావుల్లో, బోరుబావుల్లో భూగర్భజలాలు పెరిగినట్లు చీమలకుంటపల్లెకు చెందిన శ్రీనివాస్ తెలిపారు. రబీలో వరిసాగు చేయడానికి అనుకూలంగా మారిందని పేర్కొంటున్నారు. -
ఎస్సారెస్పీ నీటి విడుదలకు ప్రణాళిక
వరంగల్, న్యూస్‌లైన్ : ఎస్సారెస్పీ నీటి విడుదల ప్రణాళిక ఖరారైంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీరు నిల్వ ఉండడం, ఇప్పటికే రెండో దశకు నీటిని విడుదల చేస్తుండడంతో.. మొదటి దశకు నీటి విడుదల ఖరారు చేశారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ షెడ్యూల్‌ను శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఈసారి చివరి ఆయకట్టుకు సైతం నీటిని అందించనున్నారు. ఖరీఫ్ సీజన్లో ఆన్ ఆఫ్ పద్ధతిని పాటించనున్నారు. గతంలో ఆన్ ఆఫ్ పద్ధతి సరిసమానంగా ఉండేది. కానీ ఇప్పుడు నీరు నిల్వ ఉండడంతో.. ఆఫ్ పద్ధతిని తగ్గించారు. 9 రోజులు ఆన్.. 6 రోజులు ఆఫ్ పద్ధతిన నీటిని విడుదల చేయనున్నారు. అవసరమైన మేరకు చెరువులు, పెద్ద చెరువులు, రిజర్వాయర్లకు సైతం నీటిని అందించనున్నారు. దీంతో భూగర్భ జలాలు పెరుగుతాయని నీటిపారుదల శాఖ భావిస్తోంది. సెప్టెంబర్ 1 నుంచే ఎస్సారెస్పీ మొదటి దశ కాల్వలకు 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. కాగా, నేటి నుంచి రెండో దశ నీటి విడుదలకు బ్రేక్ వేస్తారు. అయితే అత్యవసర సందర్భంలో రెండో దశకు నీటిని విడుదల చేసేందుకు కూడా ప్రణాళిక వేశారు. మొదటి దశకు విడుదల చేసిన అనంతరం ఆఫ్ రోజుల్లో రెండో దశకు ఇస్తారు. దిగువ ఎల్ఎండీ పరిధిలో ఆదివారం నుంచి ఎస్సారెస్పీ జలాలు విడుదల కానున్నాయి. డీబీఎం-31 వరకు ఈ నీటిని అందించనున్నారు. రోజూ 3 వేల క్యూసెక్కుల నీటిని కాకతీయ ప్రధాన కాల్వ, ఉప కాల్వల ద్వారా విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 23 వరకు ఎస్సారెస్పీ నీటిని మొదటి దశకు అందిస్తున్నారు. మొదటి దశలో మొత్తం 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇప్పటికే ఆయకట్టులో వరి నార్లు పూర్తి చేశారు. పొలాల్లో కూడా వరి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మొదటి దశకు నీటి విడుదల ప్రణాళిక ఖరారు కావడంతో సాగు మరింత పెరగనుంది.