వరంగల్, న్యూస్‌లైన్ : ఎస్సారెస్పీ నీటి విడుదల ప్రణాళిక ఖరారైంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీరు నిల్వ ఉండడం, ఇప్పటికే రెండో దశకు నీటిని విడుదల చేస్తుండడంతో.. మొదటి దశకు నీటి విడుదల ఖరారు చేశారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ షెడ్యూల్‌ను శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఈసారి చివరి ఆయకట్టుకు సైతం నీటిని అందించనున్నారు. ఖరీఫ్ సీజన్‌లో ఆన్ ఆఫ్ పద్ధతిని పాటించనున్నారు. గతంలో ఆన్ ఆఫ్ పద్ధతి సరిసమానంగా ఉండేది. కానీ ఇప్పుడు నీరు నిల్వ ఉండడంతో.. ఆఫ్ పద్ధతిని తగ్గించారు. 9 రోజులు ఆన్.. 6 రోజులు ఆఫ్ పద్ధతిన నీటిని విడుదల చేయనున్నారు.
అవసరమైన మేరకు చెరువులు, పెద్ద చెరువులు, రిజర్వాయర్లకు సైతం నీటిని అందించనున్నారు. దీంతో భూగర్భ జలాలు పెరుగుతాయని నీటిపారుదల శాఖ భావిస్తోంది. సెప్టెంబర్ 1 నుంచే ఎస్సారెస్పీ మొదటి దశ కాల్వలకు 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. కాగా, నేటి నుంచి రెండో దశ నీటి విడుదలకు బ్రేక్ వేస్తారు. అయితే అత్యవసర సందర్భంలో రెండో దశకు నీటిని విడుదల చేసేందుకు కూడా ప్రణాళిక వేశారు. మొదటి దశకు విడుదల చేసిన అనంతరం ఆఫ్ రోజుల్లో రెండో దశకు ఇస్తారు. దిగువ ఎల్‌ఎండీ పరిధిలో ఆదివారం నుంచి ఎస్సారెస్పీ జలాలు విడుదల కానున్నాయి. డీబీఎం-31 వరకు ఈ నీటిని అందించనున్నారు. రోజూ 3 వేల క్యూసెక్కుల నీటిని కాకతీయ ప్రధాన కాల్వ, ఉప కాల్వల ద్వారా విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 23 వరకు ఎస్సారెస్పీ నీటిని మొదటి దశకు అందిస్తున్నారు. మొదటి దశలో మొత్తం 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇప్పటికే ఆయకట్టులో వరి నార్లు పూర్తి చేశారు. పొలాల్లో కూడా వరి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మొదటి దశకు నీటి విడుదల ప్రణాళిక ఖరారు కావడంతో సాగు మరింత పెరగనుంది.