కడప అగ్రికల్చర్: ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవడం.. ప్రాజెక్టులు నిండటం.. కేసీ కెనాల్‌కు నీరు రావడంతో పంటలసాగు ఆశాజనకంగా ఉంది. దీంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఖరీ‹ఫ్ సీజన్‌కు సంబంధించి సాధారణం కంటే అధికశాతంలో పంటలు సాగయ్యాయి. కొన్ని పంటలు వందశాతం, మరికొన్ని రెండువందల శాతం, ఇంకొన్ని మూడువందలశాతంపైగా కూడా సాగయ్యాయి. జిల్లాలో ఈ ఏడాది సోయాబీన్ పంట ఎక్కువ విస్తీర్ణంలో సాగై రికార్డు సృష్టించింది. జిల్లాలో ఖరీఫ్ పంటల సాధారణ విస్తీర్ణం 91991 హెక్టార్లు ఉండగా ఖరీఫ్ ముగిసే ఆక్టోబర్ 15వ తేదీ నాటికి జిల్లాలో 1,10,514 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్ పంటలు సాగు చేశారు. సాధారం కంటే ఈ ఏడాది 18,523 హెక్టార్లలో అధికంగా పంటలు సాగై 120.14 శాతం నమోదైంది. దీంతోపాటు ఈ క్రాపు, ఈకేవైసీ నమోదులోనూ రాష్ట్రంలోనే వైఎస్సార్‌జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది.
అత్యధికంగా సాగైన సోయాబీన్
ఈ ఏడాది జిల్లాలో సోయాబీన్ పంటను అత్యధికంగా సాగు చేశారు. పొద్దుటూరు, పులివెందుల, పెద్దముడియం, జమ్మలమడుగు, వేముల, వేంపల్లి, వీఎన్‌పల్లెతో పాటుపలు మండలాల్లో ఈ పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. జిల్లాలో సోయాబీన్ సాధారణ సాగు 63 హెక్టార్లు కాగా ఈ ఏడాది 3,753 హెక్టార్లలో సాగు చేశారు. గతంలో మెట్టప్రాంతంలో ఏ పంటను సాగు చేయకుండా ఏగిలి పెట్టుకుని రబీ ప్రారంభం కాగానే శనగ సాగు చేసుకునేవారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవడం, పంటదిగుబడి కాలం 70 నుంచి 80 రోజులు కావడంతో ఎక్కువ మంది సోయాబీన్ ఖరీఫ్‌లో సాగు చేసుకున్నారు.
తగ్గిన వరి విస్తీర్ణం
జిల్లాలో ఈ ఏడాది వరి సాగు తగ్గింది. సాధారణం కంటే కూడా తక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేశారు. జిల్లాలో వరి సాధారణ సాగు 32,741 హెక్టార్లు ఉండగా ఈ ఏడాది 27,058 ఎకరాల్లో మాత్రమే సాగైంది. నీటి వసతి సమృద్ధిగా ఉన్నా చాలా మంది ఆరుతడి పంటలవైపే మొగ్గుచూపారు. వరి సాగుకు ఖర్చులు పెరగడం, తెగుళ్లు ఎక్కువగా ఉండటం, పంట దిగుబడి సమయానికి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఏడాది చాలా మంది రైతులు సాగు తగ్గించారు.కొందరు రెండోపంటగా వరి సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనివల్ల కూడా సాగు విస్తీర్ణం తగ్గిందనే చెప్పాలి. రెండో పంట దిగుబడి సమయానికి తుపాన్లు, ప్రకృతి వైపరీత్యాల బెడద తగ్గుతుంది.అందువల్ల రైతులు ఆ ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
తగ్గిన వేరుశనగ..పెరిగిన మినుము సాగు విస్తీర్ణం...
జిల్లాలో ఈ ఏడాది వేరుశనగ సాగు విస్తీర్ణం కూడా బాగా తగ్గింది. సాధారణ సాగు 7,454 హెక్టార్లు ఉండగా ఈ ఏడాది 3,787 హెక్టార్లలో మాత్రమే సాగైంది. గత ఖరీఫ్‌లో జిల్లాలో 22,503 హెక్టార్లలో సాగైంది. మినుముకు సంబంధించి 1268 హెక్టార్లో సాధారణ సాగు ఉండగా 3838 హెక్టార్లలో సాగైంది.
ఇతర పంటల సాగు వివరాలు ఇలా...
జిల్లాలో పత్తి 17,303 హెక్టార్లలోసాగు చేయాల్సి ఉండగా 46,263 హెక్టార్లలో సాగై 267.37 శాతంగా నమోదైంది కుసుమ పంట 4 ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా 11 ఎకరాల్లో సాగైంది. పొద్దుతిరుగుడు పంట 874 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 1870 హెక్టార్లలో సాగై 206.75 శాతం, టమాటా 1246 హెక్టార్లకుగాను 2041 హెక్టార్లలోసాగై 136 శాతం, ఉల్లి 3603 హెక్టార్లకుగాను 3690 హెక్టార్లలో సాగై 109.91 శాతం, రాగి 4 ఎకరాలకుగాను 7 ఎకరాల్లో సాగై 175 శాతం, ఆముదం 534 హెక్టార్లకుగాను 1031 ఎకరాల్లోసాగై 193.07 శాతం సాగయ్యాయి. çసజ్జలు, మొక్కజొన్న, కందులు, మిరప పంటలు సాధారణం కంటే తక్కువ హెక్టార్లలో సాగయ్యాయి.
పంటల సాగు విస్తీర్ణం పెరిగింది
ఈ ఏడాది ప్రాజక్టుల్లో నీరు సమృద్ధిగా ఉండటంతో ఖరీఫ్ సీజన్‌లో పంటలసాగు ఆశాజనకంగా ఉంది. సాధారణం కంటే అధికంగా సాగైంది. ఈ ఏడాది ఈ క్రాపు, ఈకే వైసీని కూడా వందశానికి మించి చేసి రాష్ట్రంలోనే వైఎస్సార్ జిల్లా ప్రథమస్థానంలో నిలిపాం. చాలా సంతోషంగా ఉంది.
– అయితా నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయాధికారి
Comments
Please login to add a commentAdd a comment