కృష్ణాబోర్డుకు తెలంగాణ లేఖ
రాష్ట్రానికి అత్యవసర తాగునీటి అవసరాలు ఉన్నాయని వివరణ
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాశయంలో నిల్వ ఉన్న 15.23 టీఎంసీల జలాలను అత్యవసర తాగు నీటి అవసరాల కోసం తెలంగాణకు ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తీవ్ర కరువు పరిస్థితి ఉన్నా కూడా శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ 51 టీఎంసీలను ఆ రాష్ట్రంలోని కృష్ణా బేసిన్ వెలుపలి ప్రాంతాలకు తరలించిందని పేర్కొంది.
ఇతర నదీ బేసిన్లకు కృష్ణా జలాలను తరలించేందుకు కృష్ణా ట్రిబ్యునల్–1 అనుమతి లేదని గుర్తు చేసింది. ఇకపై శ్రీశైలం జలాశయం నుంచి నీళ్లు తీసుకోకుండా ఏపీని నిలువరించాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తాజాగా కృష్ణాబోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు.
తాగునీటి అవసరాలు ముఖ్యం
తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలం జలాశయంలోని నీటి నిల్వలను తాగు అవసరాలకు కేటాయించడానికే ప్రాధాన్యత ఇవ్వాలని ఈ లేఖలో కోరారు. గత ఏడాది అక్టోబర్ 6న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో కూడా ఈ నిర్ణయం తీసుకు న్నట్టు గుర్తు చేశారు. అయినా ఏపీ ప్రభుత్వం సాగు అవసరాలకు సైతం నీటిని తరలించుకుందని ఆరో పించారు.
కృష్ణా బేసిన్ పరిధిలో తెలంగాణ జనాభా 2 కోట్ల మంది అయితే.. ఏపీ జనాభా 78లక్షల మంది మాత్రమేనని తెలిపారు. 2011 నాటి లెక్కల ప్రకారమే.. తెలంగాణ తాగునీటి అవసరాలకు 46.4 టీఎంసీలు, ఏపీ తాగునీటి అవసరాలకు 18 టీఎంసీలు అవసరమని వివరించారు. కృష్ణా ట్రిబ్యునల్–2కు సమర్పించిన ప్రాజెక్టుల డీపీఆర్‌ల ప్రకారం చూస్తే.. తాగునీటి అవసరాల కోసం ఏపీకి 8.85 టీఎంసీలు, తెలంగాణకి 40 టీఎంసీలు అవసరమని స్పష్టం చేశారు.
గత వానాకాలంలో తెలంగాణ వాడుకోకుండా మిగిల్చిన 18.7 టీఎంసీలను ఈ ఏడాది వాడుకోవడానికి అనుమతి ఇవ్వాలని కృష్ణా బోర్డును కోరారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలను పణంగా పెట్టి శ్రీశైలం నుంచి చెన్నై తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలను కేటాయించాలన్న నిబంధనేదీ లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment