సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నీటి మట్టాలపై కృష్ణా బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టాలకు దిగువకు నీటి మట్టాలు పడిపోగా, నీటి వినియోగం సైతం పెరుగుతోంది.ఈ దృష్ట్యా తాగు నీటి అవసరాలకు కేవలం సాగర్‌పైనే ఆధారపడాల్సి ఉంటుందని, అక్కడ నిల్వ కేవలం 71 టీఎంసీ మేర మాత్రమే ఉన్నందున జాగ్రత్త పడాలని సూచించింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల నీటి పారుదలశాఖ ఈఎన్‌సీలకు కృష్ణాబోర్డు లేఖలు రాసింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టం 834 అడుగులకు దిగువకు వెళ్లి నీటి వినియోగం చేయడంతో నిల్వ 830.40 అడుగులకు పడిపోయిందని, కనీస మట్టానికి దిగువన 3.93 టీఎంసీ నీటి వినియోగం సైతం చేశారని బోర్డు లేఖలో వెల్లడించింది. సాగర్‌లో కనీస నీటి మట్టం 854 అడుగులకు ఎగువన కేవలం 71.33 టీఎంసీలు మాత్రమే లభ్యత నీరుందని, ఈ నీటితోనే ఇరు రాష్ట్రాలు జూలై ఆఖరు వరకు నెట్టుకు రావాల్సి ఉంటుందని వెల్లడించింది. వర్షాకాలం వరకు ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాలు తీరాలంటే ఈ నీటినే జాగ్రత్తగా వాడాల్సి ఉంటుందని, ఈ దృష్ట్యా ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment