సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణా బోర్డుకు అప్పగింతపై తెలంగాణ రాష్ట్రం మళ్లీ అడ్డం తిరిగింది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఈనెల 17న ఢిల్లీలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో కృష్ణా బోర్డుకు ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించేందుకు అంగీకరించిన తెలంగాణ నీటిపారుదల శాఖాధికారులు.. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకోగానే ప్లేటు ఫిరాయించి ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతకు తాము అంగీకరించలేదని బుకాయించారు.
బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చేవరకూ ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించబోమని తెలంగాణ సర్కార్ చెబుతోంది. కానీ.. ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించినట్లు సమావేశపు మినిట్స్‌లో స్పష్టంగా ఉంది. ఈ మినిట్స్‌పై ఏపీ అధికారులతోపాటు తెలంగాణ అధికారులు కూడా సంతకాలు చేశారు.
అప్పుడూ ఇలాగే ప్లేటు ఫిరాయింపు..
గతంలో కృష్ణా బోర్డు 16వ సర్వసభ్య సమావేశంలో ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించిన తెలంగాణ అధికారులు.. ఆ మరుసటి రోజే అడ్డం తిరిగారు. ఇప్పుడూ అదే రీతిలో అడ్డం తిరగడంతో కేంద్ర జల్‌శక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది. మరోవైపు.. ఉన్నతస్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈనెల 24లోగా త్రిసభ్య కమిటీ సమావేశమై ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింత విధానాన్ని ఖరారు చేయాలి. ఈ సమావేశంలో తెలంగాణ తరఫున హాజరయ్యే నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ స్పందనను బట్టి చర్యలు తీసుకోవడానికి కేంద్ర జల్‌శక్తి శాఖ సిద్ధమైనట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఏపీలో ఆరు.. తెలంగాణలో తొమ్మిది ఔట్‌లెట్లు..
నిజానికి.. విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు కేంద్రం కృష్ణాబోర్డును ఏర్పాటుచేసింది. ఈ బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021, జూలై 15న గెజిట్ నోటిఫికేషన్ జారీచేసిన కేంద్రం.. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని నిర్దేశించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఏపీ భూభాగంలోని ఆరు, తెలంగాణ భూభాగంలోని తొమ్మిది అవుట్‌లెట్లను స్వాధీనం చేయాలని 16వ సర్వసభ్య సమావేశంలో రెండు రాష్ట్రాలను బోర్డు కోరింది. ఇందుకు రెండు రాష్ట్రాలు తొలుత అంగీకరించాయి.
తెలంగాణ భూభాగంలోని అవుట్‌లెట్లను స్వాధీనం చేసుకుంటే.. తమ భూభాగంలోని అవుట్‌లెట్లను అప్పగిస్తామని ఏపీ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తంచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కానీ.. తెలంగాణ సర్కార్ తన భూభాగంలోని అవుట్‌లెట్లను బోర్డుకు అప్పగించబోమని అడ్డం తిరిగింది. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడానికి మన భూభాగంలోని సాగర్ స్పిల్ వే సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను జలవనరుల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తమ నిర్వహణలో ఉన్న సాగర్‌ను ఏపీ అధికారులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారంటూ కేంద్రానికి తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది. ఈ వివాదాన్ని పరిష్కరించడమే అజెండాగా ఈనెల 17న ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment