బీబీనగర్‌లో ఎయిమ్స్‌కు గ్రీన్‌సిగ్నల్‌  | Green signal for Aims in BB nagar | Sakshi
Sakshi News home page

బీబీనగర్‌లో ఎయిమ్స్‌కు గ్రీన్‌సిగ్నల్‌ 

Published Tue, Dec 18 2018 1:43 AM | Last Updated on Tue, Dec 18 2018 1:43 AM

Green signal for Aims in BB nagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/యాదాద్రి/ న్యూఢిల్లీ: బీబీనగర్‌ ఎయిమ్స్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.1,028 కోట్లతో బీబీనగర్‌లో ఎయిమ్స్‌ను 45 నెలల్లో నెలకొల్పేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో బీబీనగర్‌ ఎయిమ్స్‌తో పాటు, తమిళనాడులోని మధురైలో ఎయిమ్స్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ మొదటి దశ పనులను 10 నెలల్లో పూర్తి చేయాలని, మూడు విడతల్లో పూర్తిస్థాయిలో ఎయిమ్స్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. అవసరమైన నిధులను ప్రధానమంత్రి స్వస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్‌ఎస్‌వై) కింద సమకూర్చుతారు. 2019–20 విద్యా సంవత్సరంలోనే బీబీనగర్‌ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ కోర్సులు నిర్వహించేలా ఇటీవల నోటిఫికేషన్‌ జారీచేసిన సంగతి తెలిసిందే.

తాత్కాలికంగా అద్దె భవనాలు, ఇప్పటికే అక్కడున్న నిమ్స్‌ భవనాల్లో ఎయిమ్స్‌ కార్యకలాపాలు ప్రారంభం అయ్యే అవకాశముంది. బీబీనగర్‌ ఎయిమ్స్‌లో ఏర్పాటు చేసే మెడికల్‌ కాలేజీలో 100 ఎంబీబీఎస్‌ సీట్లు, 60 బీఎస్సీ నర్సింగ్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయి. 15 నుంచి 20 వరకు సూపర్‌ స్పెషాలిటీ డిపార్ట్‌మెంట్‌ సీట్లు వస్తాయి. దీంతోపాటు 750 పడకలతో ఎయిమ్స్‌ ఆసుపత్రి నెలకొల్పుతారు. రోజుకు 1,500 మంది ఔట్‌ పేషెంట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎయిమ్స్‌లో ఏర్పాటు చేసే 750 పడకల్లో ఎమర్జెన్సీ లేదా ట్రామా బెడ్స్, ఆయుష్‌ బెడ్స్, ప్రైవేటు పడకలు, ఐసీయూ, సూపర్‌ స్పెషాలిటీ పడకలు అందుబాటులో ఉంటాయి. మెడికల్‌ కాలేజీ, ఆయుష్‌ బ్లాక్, ఆడిటోరియం, రాత్రి బస, గెస్ట్‌హౌస్, హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ సదుపాయం ఉంటాయి. 

3 వేల మంది సిబ్బంది.. 
బీబీనగర్‌ ఎయిమ్స్‌లో అనేక రకాల స్పెషలిస్టు వైద్యులుంటారు. నిపుణులైన వైద్య సిబ్బంది ఉంటుంది. కేంద్రం పేర్కొన్న ప్రకారం 3 వేల మంది వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర సిబ్బంది ఉంటారు. ఎయిమ్స్‌కు అవసరమైన భవనాలు, స్థలం అన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. ఇప్పటికే అక్కడున్న నిమ్స్‌ భవనాలను అప్పగించేందుకు ఏర్పాట్లు చేసింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్‌కు సీఎస్‌ ఎస్‌కే జోషి గతంలో లేఖ రాశారు. శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత భవనంలో ఓపీ సేవలు ప్రారంభించాలని విన్నవించారు. ఇచ్చిన స్థలంలో భవనాల నిర్మాణం చేపట్టాలన్నారు. బీబీనగర్‌లో ప్రస్తుతమున్న 150 ఎకరాల ప్రాంగణం, ఇంకా అవసరమైన మరో 50 ఎకరాల స్థలాన్ని అంతకుముందు కేంద్ర బృందం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. స్థలానికి సంబంధించి డాక్యుమెంట్లు, ఇతరత్రా సమాచారాన్ని కేంద్రం తీసుకుంది. ఒక అంచనా ప్రకారం వచ్చే వైద్య విద్యా సంవత్సరం నుంచి అక్కడ ఎంబీబీఎస్‌ తరగతులతో ఎయిమ్స్‌ ప్రారంభమయ్యే అవకాశముంది. కాగా, ఎయిమ్స్‌కు కేంద్రం ఆమోదం తెలపడంపై వైద్య, ఆరోగ్యశాఖ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీలు బి.వినోద్‌కుమార్, బూర నరసయ్యగౌడ్, బండారు దత్తాత్రేయ హర్షం వ్యక్తం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement