
కర్ణాటక అక్రమ ప్రాజెక్టును అడ్డుకోండి
కర్ణాటక అక్రమ ప్రాజెక్టుపై రాష్ర్ట ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. అనుమతులులేని ప్రాజెక్టును ఆపేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది.
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక అక్రమ ప్రాజెక్టుపై రాష్ర్ట ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. అనుమతులులేని ప్రాజెక్టును ఆపేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. కృష్ణా-భీమా నదుల సంగమానికి ఎగువన రాయచూర్ జిల్లా గుర్జాపూర్ వద్ద కర్ణాటక ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టును నిర్మిస్తోందని కేంద్ర జలవనరుల శాఖ, కేంద్ర జల సంఘానికి లేఖలు రాసింది. కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్-2 తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించినా, దాన్ని ధిక్కరించేరీతిలో ప్రాజెక్టు నిర్మిస్తోందని పేర్కొంది.
ఈ మేరకు తెలంగాణ నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి కేంద్ర జలవనరుల శాఖ కమీషనర్, కేంద్ర జలసంఘం చైర్మన్‌కు లేఖలు రాశారు. ‘కర్ణాటక ప్రభుత్వం గుర్జాపూర్ వద్ద రూ.104 కోట్ల ఖర్చుతో 1.17 కిలోమీటర్ల పొడవుతో 194 గేట్లను అమరుస్తూ బ్యారేజీ నిర్మాణం చేపట్టింది. కర్ణాటక ఇప్పటికే తనకు కేటాయించిన నీటి కంటే ఎక్కువ వాడుకునేలా ఇతర ప్రాజెక్టులను కృష్ణా ట్రిబ్యునల్ -2 ముందు ప్రతిపాదించింది. దీనికోసం మాస్టర్‌ప్లాన్‌ను సమర్పించింది. గుర్జాపూర్ బ్యారేజీ గురించి ఆ మాస్టర్‌ప్లాన్‌తో పొందుపర్చలేదు.
ఇక కృష్ణా ట్రిబ్యునల్-2 ఆల్మట్టి ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.24 మీటర్లుకు పెంచుకొని అదనంగా 130 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఇచ్చింది. అయితే ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేయకుండా సుప్రీం స్టే విధించింది.’ అని లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగానే భారీ నిర్మాణాన్ని కర్ణాటక చేపడుతోందని, దీంతో దిగువ జూరాల ప్రాజెక్టుకు, అటు నుంచి కృష్ణా బేసిన్‌లోని ఇతర భారీ ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహాలు రావడం కష్టమని తెలిపారు.
తాజాగా ఆగస్టు రెండోవారంలోనూ జూరాల ప్రాజెక్టుకు నీరు రాలేదని, నిర్మాణం కొనసాగితే భవిష్యత్తులో దిగువకు కష్టాలు తప్పవని వివరించారు. తనకు కేటాయించిన నీటి కంటే అదనంగా జలాలను కర్ణాటక వాడుకునేందుకు యత్నిస్తోందని దీన్ని అడ్డుకోవాలని కోరారు. ఇవే అంశాలను పేర్కొంటూ కర్ణాటక నీటి పారుదల శాఖ కార్యదర్శికి జోషి విడిగా మరో ఉత్తరం రాశారు. బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం కానీ, కేంద్ర జలసంఘం, కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ నుంచి కానీ అనుమతులుంటే వాటిని తమకు అందజేయాలని, అవేమీ లేనిపక్షంలో ప్రాజెక్టు నిర్మాణాన్ని మరింత ముందుకు కొనసాగించకుండా నిలుపుదల చేయాలని అందులో కోరారు.