ప్రయాణికులతో కిటకిటలాడుతున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్
సాక్షి, హైదరాబాద్/ చౌటుప్పల్ /కట్టంగూర్: సంక్రాంతి సంబరాల కోసం నగరం పల్లెబాట పట్టింది. లక్షలాది మంది నగరవాసులు సొంతూళ్లకు తరలి వెళ్లారు. దీంతో సొంత ఊళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో బస్సులు, రైళ్లు, ప్రైవేట్ వాహనాలు కిక్కిరిసిపోతున్నాయి. శనివారం నుంచే సెలవులు ప్రారంభం కావడంతో.. ప్రయాణికుల రద్దీ మరింత ఎక్కువైంది. దీనికి అనుగుణంగా ఆర్టీసీ శనివారం ఒక్క రోజే సుమారు 1,500 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రెగ్యులర్‌గా వెళ్లే రైళ్లతో పాటు, సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్, జనసాధారణ రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. మరోవైపు ప్రైవేట్ బస్సుల్లో టికెట్ దోపిడీ తారస్థాయికి చేరింది. రోజురోజుకూ ప్రయాణికుల రద్దీ, డిమాండ్ భారీగా పెరిగిపోతుండటంతో సాధారణ చార్జీలను రెండు రెట్లు పెంచేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో 50% అదనంగా వసూలు చేస్తున్నారు. మొదట్లో దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో మాత్రమే అదనపు చార్జీలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. ప్రయాణికుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో అన్ని ప్రత్యేక బస్సుల్లోనూ ఈ పెంపు అమలవుతుందని అధికారులు స్పష్టం చేశారు. అటు, బస్సులు, ట్రావెల్స్, ప్రైవేటు వాహనాలతో టోల్‌ప్లాజాల వద్ద తీవ్రమైన రద్దీ నెలకొంది.
ప్రయాణంలోనే సంబరాల ఆవిరి
నగరవాసుల సంక్రాంతి సంబరాల ఆశలన్నీ ఈ పెరిగిన ధరలతో ప్రయాణంలోనే ఆవిరవు తున్నాయి. చార్జీల రూపంలోనే వేల రూపాయల్లో సమర్పించుకోవాల్సి వస్తోంది. బస్సులు, రైళ్లే కాకుండా టాటా ఏస్, తూఫాన్‌లు, వ్యాన్‌లు, తదితర అన్ని రకాల వాహనాల్లోనూ జనం తరలి వెళుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 20 లక్షల మంది సొంత ఊళ్లకు వెళ్లినట్లు అంచనా. ఆది, సోమవారాల్లోనూ ఈ రద్దీ భారీగా ఉండే అవకాశం ఉంది. ఆ రెండ్రోజుల్లో మరో 10 లక్షల మంది ఊళ్లకు తరలే అవకాశం ఉంది. మరోవైపు పల్లెబాట పట్టిన వాహనాలతో హైవేలు కిక్కిరిశాయి. సంక్రాంతి రద్దీతో నగర శివారు కూడళ్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. సొంతూళ్లకు వెళ్తున్న బస్సులు, వ్యక్తిగత వాహనాలతో రహదారులు స్తంభించాయి.ఉప్పల్, ఎల్‌బీ నగర్, మెహిదీపట్నం, జేబీఎస్, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు, ఏఎస్ రావునగర్, ఈసీఐఎల్, తదితర ప్రాంతాల్లో ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల కోసం భారీ సంఖ్యలో ప్రయాణికులు పడిగాపులు కాశారు. మరోవైపు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సొంతూరికి వెళ్లే వ్యక్తిగత వాహనాలతో.. సిటీ రోడ్లపైన భారీ ట్రాఫిక్ రద్దీ నెలకొంది. రైల్వేస్టేషన్‌లకు, బస్‌స్టేషన్‌లకు తరలివెళ్లే ప్రయాణికులతో మెట్రోరైళ్లు సైతం కిటకిటలాడాయి. మియాపూర్–ఎల్‌బీనగర్, నాగోల్–అమీర్‌పేట్– మియాపూర్ మార్గంలో సుమారు 2.6 లక్షల మందికి పైగా పయనించినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు వెల్లడించారు. సంక్రాంతి సందర్భంగా 5,252 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేసిన ఆర్టీసీ ఇప్పటి వరకు సుమారు 3 వేల బస్సులను నడిపింది. అలాగే ప్రతి రోజూ సుమారు 1,000 ప్రైవేట్ బస్సులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి.
ఎల్‌బీనగర్‌లో..
ఒంటికాలిపై రైలు ప్రయాణం
ఏసీ, నాన్ ఏసీ రిజర్వేషన్ బెర్తులకు అవకాశం లేక పోవడంతో ప్రయాణికులు జనరల్ బోగీలపైనే ఆధా రపడాల్సి వచ్చింది. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌ల నుంచి బయలుదేరిన అన్ని రైళ్లలోనూ సాధారణ బోగీలన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీ దృష్ట్యా 60 జనసాధారణ రైళ్లను కూడా ఏర్పాటు చేసిన ప్పటికీ ప్రయాణికుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వయోధికులు తీవ్ర ఇబ్బందు లకు గురయ్యారు. బోగీల్లో ఒంటికాలిపైన గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వచ్చింది.
ప్రచారం లేక ఫాస్టాగ్ ఫెయిల్
హైవేలపై గంటలతరబడి టోల్ ఛార్జీ చెల్లింపుల కోసం వేచి చూడకుండా సులువుగా వెళ్లగలిగే ఎన్‌హెచ్‌ఏఐ ఎలక్ట్రానికి టోల్ కలెక్టింగ్ సిస్టమ్ (ఈటీసీ)ని ప్రవేశపెట్టింది. ఇందులోభాగంగా ఫాస్టాగ్ అనే పరికరాన్ని కారు లేదా వాహనం ముందు వరుసలో అమరుస్తారు. ఇందులో ఆన్‌లైన్‌లో కొంతమొత్తాన్ని రీచార్జ్ చేసుకునేందుకు వీలు ఉంది. ఇవి టోల్‌గేట్ వద్దకు రాగానే పరికరంలోని రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా రుసుము దానికదే కట్ అయి, గేట్లు పైకి లేస్తాయి. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఏఐ ప్రధాన టోల్‌గేట్ల వద్ద ఈ పరికరాలను విక్రయానికి అందుబాటులో ఉంచింది. కానీ సరైన ప్రచారం కల్పించలేకపోయింది. సంక్రాంతి సమయంలో రద్దీ కారణంగా టోల్‌గేట్లకు సమస్యలు తప్పవని సాక్షి ముందే హెచ్చరించింది. ఫాస్టాగ్ కార్డుల ప్రాధాన్యాన్ని కూడా వివరిస్తూ ఈనెల 10న కథనం కూడా ప్రచురితమైంది. కానీ, వీటిపై వాహనదారులు అంతగా ఆసక్తి చూపక పోవడంతో వీటి కొనుగోలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు.
రవాణాశాఖ అధికారులు ఎక్కడ?
తెలంగాణ రవాణా శాఖ గణాం కాల ప్రకారం.. రాష్ట్రంలో దాదాపు 8,000కుపైగా ప్రైవేటు బస్సులు ఉన్నాయి. వీటిలో చాలామటుకు కాంట్రాక్టు కారియర్‌గా అనుమతులు తీసుకుని, స్టేజీ కేరియర్‌గా తిప్పుతున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. వీటి కారణంగా ఆర్టీసీకి రోజుకు కోటి రూపాయల నష్టం వాటిల్లుతోంది. సంక్రాంతి, దసరా సందర్భంగా ఈ నష్టం రోజుకు రూ.2 కోట్లకుపైనే. ఇంత నష్టం జరుగుతున్నా.. రవాణాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పండుగ నేపథ్యంలో అక్రమాలకు పాల్పడుతున్న బస్సులను తనిఖీలను చేపట్టాలని రవాణాశాఖ నిపుణులు, ఆర్టీసీ కార్మిక యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.
టోల్‌ప్లాజా వద్ద భారీ క్యూ..
శుక్రవారం అర్ధరాత్రి నుంచి 65వ నంబర్ జాతీయ రహదారిపై విజయవాడ వైపు వెళ్లే మార్గంలో వాహనాలు వేలాదిగా తరలివెళ్తున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే రెండింతలకు పైగా వాహనాలు వెళ్తుండటంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి, నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని కొర్లపహాడ్ టోల్‌ప్లాజాల వద్ద భారీగా రద్దీ నెలకొంది. పంతంగి టోల్‌ప్లాజా నుంచి లింగోజిగూడెం గ్రామం వరకు వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ నుంచి బయలుదేరిన వాహనాలు గంట సేపట్లో పంతంగి టోల్‌ప్లాజాను దాటాల్సి ఉన్నా రద్దీ నేపథ్యంలో మూడు గంటలకు పైగా సమయం పట్టింది. జాతీయ రహదారిపై వాహనాలు స్తంభించకుండా సివిల్, ట్రాఫిక్ పోలీసులతో పాటు జీఎమ్మార్ సిబ్బంది తగుచర్యలు తీసుకున్నారు. టోల్‌ప్లాజా వద్ద మొత్తం 16 ద్వారాలు ఉండగా.. విజయవాడ వైపు వెళ్లే మార్గంలో 12 ద్వారాలు తెరిచారు. కొర్లపహాడ్ ప్లాజా వద్ద పది ద్వారాలు తెరిచారు. సాధారణంగా.. విజయవాడ మార్గంలో 15–18వేల వాహనాలు పయ ణిస్తుండగా శనివారం ఒక్కరోజే సుమారు 40వేల వాహనాలు ప్రయాణించినట్లు జీఎమ్మార్ సిబ్బంది వెల్లడించారు. టోల్‌ప్లాజా వద్ద టోల్ రుసుము చెల్లింపులో ఆలస్యం కాకుండా సిబ్బందే నేరుగా వాహనదారుల వద్దకు వెళ్లి టోల్ సొమ్ము స్వీకరించారు.
ట్రావెల్స్ దారి దోపిడీ
పరిస్థితి చూస్తుంటే.. ప్రయాణికుల కన్నా.. ప్రైవేటు ట్రావెల్స్‌కే అసలైన సంక్రాంతి పండుగ వచ్చినట్లుంది. పండుగ రద్దీని సొమ్ము చేసుకుని.. ఇష్టానుసారంగా వ్యవ హరిస్తు న్నాయి. మోటారు వాహన చట్టాన్ని తుంగలో తొక్కినా.. భద్రతా నిబంధనలను గాలి కొదిలేసినా అధికారులు పట్టిం చుకోవడం లేదు. ఆర్టీసీ చార్జీల కన్నా 4 రెట్లు ఎక్కువగా వసూలుచేస్తున్నా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. పండుగ సమయం..ఎలాగైనా సొంతూరికి వెళ్లాలన్న సామాన్యుడి ఆత్రుత వీరికి వరంగా మారింది. తెలంగాణ ఆర్టీసీ 1,500, ఏపీఎస్‌ఆర్టీసీ దాదాపు 2వేల బస్సులను ఏర్పాటు చేసింది. 150 వరకు ప్రత్యేక రైళ్లు కూడా నడుస్తున్నాయి. అయితే, ఇవేవీ ఈ రద్దీకి సరిపోవడం లేదు.
ఆకాశంలో ధరలు..
వాస్తవానికి టీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్‌ఆర్టీసీలు టికెట్ చార్జీలపై 50% అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. కానీ, ప్రైవేటు ట్రావెల్స్ మాత్రం ఏకంగా టికెట్ ధరలను 400%పైగా పెంచేశాయి. ఇందులో స్లీపర్, ఏసీ ధరలైతే.. ఏకంగా రూ.4000 దాటుతుండటం గమనార్హం. వీటికి టోల్‌ట్యాక్స్, జీఎస్టీ కలిపితే 4,400 వరకు ప్రయాణికుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అదే ముందస్తుగా బుక్ చేసుకుంటే విమాన చార్జీలు కూడా రూ.2వేల లోపే ఉండటం గమనార్హం. అసలింత పెంపుపై ఓ విధానం అంటూ లేకుండా పోయిందని స్వయంగా ఆర్టీఏ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, దీనిపై చర్యలకు ఉపక్రమించకపోవడం గమనార్హం.
టోల్‌గేట్ల వసూళ్ల రద్దు
ఈ నెల 13, 16 తేదీల్లో అమలులో ఉంటుందని సీఎస్ ప్రకటన
సంక్రాంతి సెలవుల సందర్భంగా జాతీయ రహదారులపై టోల్‌గేట్ల వసూళ్లను రద్దు చేస్తున్నట్టు సీఎస్ ఎస్‌కే జోషి తెలిపారు. ఈ మేరకు శనివారం రాత్రి ఆయన ప్రక టన విడుదల చేశారు. సంక్రాంతి పండుగకు ఒకరోజు ముందు, పండుగ తర్వాతి రోజు (జనవరి 13, 16)న ఇది అమల్లో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్– విజయవాడ (నం.07192/07193) ప్రత్యేక రైలు 13న సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి అదే రోజు సాయంత్రం 7.30కి విజయవాడ చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో అదే రోజు రాత్రి 8.25కి విజయవాడ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 3 గంటలకు హైదరాబాద్ చేరు కుంటుంది. సికింద్రాబాద్– విజయవాడ (నం.07194/07195) ప్రత్యేక రైలు 13న రాత్రి 11.30కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడ నుంచి ఉదయం 8.35కి బయల్దేరి అదే రోజు సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. కాకినాడ టౌన్– తిరుపతి (నం.07191) ప్రత్యేక రైలు కాకినాడ టౌన్ నుంచి 13న సాయంత్రం 6.45కి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.45కి తిరుపతి చేరుకుంటుంది. విజయవాడ– విజయనగరం (నం.07184/07185) ప్రత్యేక రైలు 13న రాత్రి 09.10కి విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.20కి విజయనగరం చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ఉదయం 7.45కి బయల్దేరి అదే రోజు సాయంత్రం 4.30కి విజయవాడ చేరుకుంటుంది. కాగా, ఈ ప్రత్యేక రైళ్లల్లో చార్జీలు ఒక్కొక్కరికి సికింద్రాబాద్– విజయవాడ రూ. 130, విజయవాడ– హైదరాబాద్ రూ. 135, తిరుపతి– కాకినాడ టౌన్ రూ. 175, విజయనగరం– విజయవాడ రూ. 145గా నిర్ధారించినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment