‘ముందస్తు’ వేగం.. సిబ్బంది చాలక ఆగమాగం! | Staff shortage in CEO office | Sakshi
Sakshi News home page

‘ముందస్తు’ వేగం.. సిబ్బంది చాలక ఆగమాగం!

Published Tue, Sep 11 2018 2:26 AM | Last Updated on Tue, Sep 11 2018 9:07 AM

Staff shortage in CEO office - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) కార్యాలయాన్ని సిబ్బంది కొరత వేధిస్తోంది. ముందస్తు ఎన్నికలకు అన్ని జిల్లాల్లోని అధికారులను సన్నద్ధం చేయాల్సిన సీఈవో కార్యాలయంలోనే పూర్తి స్థాయిలో అధికారులు, సిబ్బంది లేని పరిస్థితి నెలకొంది. కొత్త కార్యాలయంలో 78 మంది సిబ్బంది అవసరం ఉందని అనేక సార్లు సీఈవో కార్యాలయం విన్నవించినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. తాజాగా ముందస్తు నేపథ్యంలో పనిభారం ఎక్కువై ప్రస్తుత సిబ్బంది అవస్థలు పడాల్సి వస్తోంది. 

పలుమార్లు విన్నవించినా.. 
2014 సాధారణ ఎన్నికలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగాయి. ఈ ఎన్నికలను ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నిర్వహించింది. ఏపీ పునర్విభజన నేపథ్యంలో అన్ని కార్యాలయాలు, సంస్థలు రెండుగా విడిపోయాయి. కానీ సీఈవో కార్యాలయం విభజనలో జాప్యం జరిగింది. 2016లో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ఏర్పాటైంది. ఉమ్మడి ఏపీలో సీఈవోగా పని చేసిన భన్వర్‌లాల్‌ రెండు రాష్ట్రాలకు పని చేస్తూ వచ్చారు. గతేడాది నవంబర్‌లో బన్వర్‌లాల్‌ పదవీ విరమణ చేయడంతో రెండు రాష్ట్రాలకు ప్రత్యేక సీఈవోలు నియమితులయ్యారు. తెలంగాణ సీఈవోగా రజత్‌కుమార్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 20న బాధ్యతలు చేపట్టారు. అప్పటికి సీఈవోకు పూర్తి స్థాయి కార్యాలయం కూడా లేని పరిస్థితి. ఒక్కొక్కటిగా అన్ని ఏర్పాటవుతూ వస్తున్నాయి. కానీ సీఈవో కార్యాలయానికి అవసరమైన అధికారులు, సిబ్బంది కేటాయింపు మాత్రం ఎంతకీ ముందుకు జరగలేదు. కార్యాలయం నిర్వహణకు అధికారులు, సిబ్బంది కలిపి 78 మంది అవసరమని ప్రభుత్వం నిర్ధారించి ఆమోదం తెలిపినా భర్తీలో జాప్యం చేస్తూ వస్తోంది. నియామకాలపై సీఈవో కార్యాలయం ఎన్ని సార్లు విన్నవించినా భర్తీ జరగడం లేదు. 

ముందస్తు అయినా  
తెలంగాణ సీఈవో కార్యాలయం ఏర్పాటైన రోజు నుంచి సిబ్బంది లేమి వెంటాడుతోంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో సీఈవో, అదనపు సీఈవో, ఇద్దరు జాయింట్‌ సీఈవో, ముగ్గురు డిప్యూటీ సీఈవోలు, 6 సెక్షన్లకు అధికారులతో పాటు సిబ్బంది కలిపి మొత్తంగా 78 పోస్టులు ఉంటాయి. ప్రస్తుతం టీఎస్‌సీఈవో కార్యాలయంలో సీఈవో, అదనపు సీఈవో, ఓ డిప్యూటీ సీఈవో మాత్రమే ఉన్నారు. 6 సెక్షన్లలో రెండింటిలోనే అధికారులున్నారు. ముందస్తు నేపథ్యంలో సిబ్బంది తక్షణ అవసరంపై సీఈవో రజత్‌కుమార్‌ పలుసార్లు ప్రభుత్వ ఉన్నతాధికారులకు నివేదించారు. తాజాగా అసెంబ్లీ రద్దుకు ఒక రోజు ముందు కూడా పోస్టుల మంజూరుపై సీఎస్‌తో రజత్‌కుమార్‌ భేటీ అయ్యారు. తర్వాత ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలిచ్చారు. కానీ వారం రోజులైనా పరిస్థితిలో మార్పు లేదు.  

తాజాగా 16 పోస్టుల్లో.. 
తాజాగా ఓటరు నమోదు జాబితా షెడ్యూల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం మార్పులు చేయడంతో 16 పోస్టుల్లో అధికారులను నియమిస్తూ ఆర్థిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ మిగిలిన పోస్టుల భర్తీ విషయంలో స్పష్టత రావడం లేదు.  అప్పటికప్పుడు ఆ పోస్టుల్లో చేరిన వారు కొత్త విధులకు అలవాటు పడేసరికి కొన్ని రోజులు పడుతుంది. అప్పటివరకు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడున్న అధికారులపైనే ఎక్కువ భారం పడుతోంది.   

అన్ని వివరాలు ఉండాలి: జోషి 
ముందస్తు ఎన్నికల నిర్వహణ పరిస్థితులను అంచనా వేసేందుకు హైదరాబాద్‌ వస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) బృందానికి స మర్పించే నివేదిక విషయంలో కచ్చితత్వం ఉం డాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలను సీఎస్‌ ఎస్‌.కె. జోషి ఆదేశించారు. డీజీపీ మహేందర్‌రెడ్డితో కలసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సీఈసీ బృందం బుధవారం నిర్వహించే సమావేశానికి అన్ని వివరాల తో రావాలని వారికి సూచించారు. ఎన్నికల నియ మావళి ప్రకారం చేసిన అధికారుల బదిలీల వివరాలను సమర్పించాలన్నారు. ఎన్నికల నిర్వహణ లో కలెక్టర్లు, ఎస్పీలు కలసి పని చేయాలని డీజీపీ సూచించారు. ఎన్నికల నియమావళి అమలులో కచ్చితంగా వ్యవహరించాలన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement