
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వెబ్‌సైట్లలో సమా చారాన్ని ఎప్పటికప్పుడు ఆధునీకరించడంతో పాటు వాటి నిర్వహణకు ప్రత్యేక నిబంధనలు రూపొందిస్తున్నట్లు సీఎస్ ఎస్‌కే జోషి తెలిపారు. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలకు సంబంధించి 265 వెబ్‌సైట్లు ఉన్నాయన్నారు. వీటిని మొబైల్ ఫ్రెండ్లీగా మార్చడంతో పాటు సోషల్ మీడియాతో అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనికోసం ఐటీ శాఖ ద్వారా ‘టీవెబ్’ను ఆవిష్కరిస్తామన్నారు. సోమవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. టీవెబ్ రూపకల్పనపై ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. ప్రతీ శాఖ వెబ్‌సైట్‌ను సమీక్షించడంతో పాటు రేటింగ్, ఆడిట్ అవార్డులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఆయా శాఖలకు సంబంధించి రియల్ టైమ్ డేటాని డాష్‌బోర్డు ద్వారా తెలుసుకునేలా చర్యలు చేపడుతున్నట్లు అధికారులకు తెలిపారు.
రాష్ట్రంలో రెవెన్యూ రికార్డుల అప్‌డేషన్ ప్రక్రియ పూర్తిచేసినందుకు రెవెన్యూ యంత్రాంగాన్ని అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ, దేవాదాయ, వక్ఫ్, పట్టణ భూముల వివరాలను ప్రక్షాళన చేయాలని ఆదేశించారు. ధరణి వెబ్‌సైట్ ద్వారా భూముల వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్వర్ తివారి పట్టాదారు పాస్ పుస్తకాల ప్రింటింగ్‌కు సంబంధించి తీసుకుంటున్న చర్యలను వివరించారు.
రైతు బంధు పథకానికి సంబంధించి చెక్కుల ముద్రణ వివరాలను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు అధికారులకు తెలిపారు. డాష్‌బోర్డు రూపకల్పనకు తీసుకున్న చర్యలపై జీఏడీ ముఖ్యకార్యదర్శి అధర్‌సిన్హా అధికారులకు వివరించారు. వివిధ శాఖలకు సంబంధించి అవసరమైన అంశాలపై ప్రతి మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు సీఎస్ తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రాజేశ్వర్ తివారి, అజయ్‌మిశ్రా, ముఖ్య కార్యదర్శులు సోమేశ్‌కుమార్, శాంతి కుమారి, శాలినీ మిశ్రా, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment