
మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన కృష్ణా బోర్డు సమావేశంలో పాల్గొన్న బోర్డు చైర్మన్ ఆర్‌కే జైన్, తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలకు ఎగువన ఉన్న రెండు వందల టీఎంసీల లభ్యత జలాల్లో ఇరు రాష్ట్రాలు చెరి సగం పంచుకోవాలని కృష్ణాబోర్డు సమక్షంలో నిర్ణయించాయి. చెరో వంద టీఎంసీల నీటిని వచ్చే జూన్ వరకు తాగు, సాగు అవసరాలకు వాడుకోవాలనే అంగీకారానికి వచ్చాయి. మంగళవారం కృష్ణా జలాల నీటి వినియోగం, భవిష్యత్తు అవసరాలు, పంపిణీ తదితరాలపై చర్చించేందుకు కృష్ణా బోర్డు జలసౌధలో భేటీ అయింది. బోర్డు చైర్మన్ ఆర్‌కే జైన్ అధ్యక్షతన జరిగిన భేటీకి సభ్య కార్యదర్శి పరమేశంతో పాటు,తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషితో , ఈఎన్‌సీ మురళీధర్, సీఈలు నరసింహారావు, ఖగేందర్, డీసీఈ నరహరిబాబుతో పాటు ఏపీ జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఇరు రాష్ట్రాలు చేసిన నీటి వినియోగంపై చర్చించారు. మొత్తంగా బేసిన్ పరిధిలో ఇరు రాష్ట్రాలు కలిపి 344,89 టీఎంసీలు వినియోగించుకోగా, ఏపీ 256.07 టీఎంసీ, తెలంగాణ 88.82 టీఎంసీలు వినియోగించుకుంది. నిజానికి ఏపీ, తెలంగాణ 66:34నిష్పత్తిలో నీటిని వినియోగించుకోవాల్సి ఉన్నా, 74.24:25.76నిష్పత్తిలో వాడుకున్నారు. ఏపీ అధికంగా వాడినట్లు బోర్డు భేటీలో తేల్చారు. ఈ దృష్ట్యా ప్రస్తుతం లభ్యతగా ఉన్న 199.39 టీఎంసీల్లో దాన్ని సర్దుబాటు చేస్తూ నీటిని పంచుకోవడానికి బోర్డు ఓకే చెప్పింది. ఈ నీటిని ఏ ప్రాజెక్టు కింద ఎంతెంత వాడుకోవాలన్న దానిపై త్రిసభ్య కమిటీ నిర్ణయించాలని సూచించడంతో ఆ కమిటీ సైతం భేటీయై చర్చించింది.
వచ్చే జూన్ నాటికి 27చోట్ల టెలిమెట్రీ..
ఇక టెలిమెట్రీ అంశాలపైనా బోర్డు భేటీలో చర్చించారు. తొలి దశ టెలిమెట్రీలపై రెండేళ్ల కిందటే నిర్ణయం జరిగినా, ఇంతవరకు వాటిని అమల్లోకి తేకపోవడంపై తెలంగాణ అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ఈ ప్రక్రియను వేగిరపరచాలంది. దీనికి ఏపీ సైతం అంగీకరించింది. మొదటి, రెండో దశ టెలిమెట్రీలు కలిపి మొత్తం 27చోట్ల వచ్చే జూన్ నాటికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాగా ఈ భేటీ అనంతరం బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం నేతృత్వంలో త్రిసభ్య కమిటీ భేటీయై ఇరు రాష్ట్రాల అవసరాలపై చర్చించింది.
విద్యుదుత్పత్తి ఆపాలన్న ఏపీ
భేటీ సమయంలో శ్రీశైలంలో 885 అడుగుల మట్టాలకు గానూ, 855.20 అడుగులకు నీటి నిల్వలు పడిపోయాయని, ఈ దృష్ట్యా తమ ప్రాంతంలో తాగునీటి అవసరాలు, హంద్రీనీవా అవసరాలు దృష్టిలో పెట్టుకొని శ్రీశైలం ద్వారా విద్యుదుత్పత్తి ఆపాలని ఏపీ కోరింది. 847 అడుగుల మట్టం దాటితే హంద్రీనీవా నుంచి నీటి విడుదల కష్టమవుతుందని తెలిపింది. దీనిపై తెలంగాణ సీఎస్ జోషి అభ్యంతరం తెలిపారు. తిత్లీ తుపాను వల్ల రాష్ట్రానికి కరెంట్‌ను తెచ్చే కారిడార్ దెబ్బతిందనీ, దీంతో విద్యుత్ కొరత లేకుండా శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి చేయాల్సి వస్తోందని వివరించారు. అవసరం ఉంటేనే విద్యుదుత్పత్తి చేస్తామని, లేకుంటే నిలిపివేస్తామంది.అయితే హంద్రీనీవా కింద వాస్తవ అవసరాలు ఏమిటో చెబితే విద్యుదుత్పత్తిపై అంచనాకు వద్దామని బోర్డు సూచించింది.