మా నీళ్లనే వాడుకుంటాం | AP Govt has made it clear to Krishna Board on Rayalaseema lift irrigation scheme | Sakshi
Sakshi News home page

మా నీళ్లనే వాడుకుంటాం

Published Tue, May 19 2020 4:00 AM | Last Updated on Tue, May 19 2020 4:00 AM

AP Govt has made it clear to Krishna Board on Rayalaseema lift irrigation scheme - Sakshi

సోమవారం కృష్ణా బోర్డుతో సమావేశానికి హాజరైన ఏపీ అధికారులు ఆదిత్యనాథ్‌ దాస్, నారాయణరెడ్డి

సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల నుంచి నీటిని తరలించి తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు తాగు, సాగునీటి అవసరాలను తీర్చేందుకే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని  చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)కు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన జలాలను మాత్రమే ఈ ఎత్తిపోతల ద్వారా తరలిస్తామని, దీనివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఏమాత్రం విఘాతం కలగదని తేల్చి చెప్పింది. 2016 సెప్టెంబరు 21న ఢిల్లీలో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో తమకు కేటాయించిన నీటిని వినియోగించుకోవడానికే పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను చేపట్టామని తెలంగాణ సర్కార్‌ చెప్పిన విషయాన్ని కృష్ణా బోర్డుకు గుర్తు చేస్తూ రాయలసీమ ఎత్తిపోతలనూ అదే తరహాలో చేపట్టామని స్పష్టం చేసింది. సోమవారం హైదరాబాద్‌లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌తో రాష్ట్ర జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి సమావేశమయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు సమావేశం వివరాలివీ..

అదనంగా 178.93 టీఎంసీల తరలింపు
► అనుమతి లేకుండా కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు ద్వారా తెలంగాణ సర్కార్‌ అదనంగా 178.93 టీఎంసీల కృష్ణా మిగులు జలాలను తరలిస్తోంది. దీని ప్రభావం ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తాగు, సాగునీటి అవసరాలను తీర్చేందుకు చేపట్టిన నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై తీవ్రంగా ఉంటుంది. దీనిపై కృష్ణా బోర్డుకు, సీడబ్ల్యూసీకి, కేంద్ర జల్‌ శక్తి శాఖకు, అపెక్స్‌ కౌన్సిల్‌కు, కేంద్రానికి ఫిర్యాదు చేశాం. వాటిపై ఏ చర్యలు తీసుకున్నారు?
► పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలపై సుప్రీం కోర్టులో కేసు విచారణలో ఉన్నా పనులను ఆపడం లేదు. 

కేటాయించిన నీటిని వినియోగించుకోలేకపోతున్నాం
శ్రీశైలం జలాశయంలో 881 అడుగుల్లో నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌(పీహెచ్‌పీ) ద్వారా కాలువకు నీరు చేరుతుంది. ఆ స్థాయిలో నీటి మట్టం ఏడాదిలో సగటున 10 నుంచి 15 రోజులు కూడా ఉండదు. 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే పీహెచ్‌పీ ద్వారా కేవలం ఏడు వేల క్యూసెక్కులు మాత్రమే చేరుతాయి. అంతకంటే తగ్గితే నీరు చేరదు. మరోవైపు శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీటిని తరలించడానికి తెలంగాణ సర్కార్‌ పలు ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకుంది. 796 అడుగుల నుంచి ఎడమ గట్టు కేంద్రం ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ రోజుకు 42 వేల క్యూసెక్కులను తెలంగాణ తరలించగలదు. దీనివల్ల శ్రీశైలంలో నీటి మట్టం రోజురోజుకు తగ్గుతుంది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీటిని తరలించలేని దుస్థితి నెలకొంది. కృష్ణా బోర్డు నీటిని కేటాయించినా సరే.. శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగుల కంటే ఎక్కువ స్థాయిలో నిల్వ లేకపోవడం వల్ల రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు నీటిని తరలించలేని పరిస్థితి నెలకొంది. అందువల్లే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టాం. కేటాయించిన నీటిని వినియోగించుకుంటాం. అంతకంటే అదనంగా ఒక్క చుక్క నీటిని కూడా వినియోగించుకోం. 

దిగువ రాష్ట్రం ప్రయోజనాలను పరిరక్షించాలి
గోదావరి బోర్డును మరోసారి కోరిన రాష్ట్ర ప్రభుత్వం
గోదావరిపై శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు దిగువన, పోలవరం ఎగువన అనుమతి లేకుండా తెలంగాణ సర్కార్‌ చేపట్టిన ప్రాజెక్టులు నదీ పరీవాహక ప్రాంతంలో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బ తీస్తాయని, వాటిని తక్షణమే నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలని గోదావరి బోర్డు(జీఆర్‌ఎంబీ)కు రాష్ట్ర ప్రభుత్వం వి/æ్ఞప్తి చేసింది. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టుల వల్ల ఏపీలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతుందని, గోదావరి డెల్టాకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై కేంద్ర జలసంఘం, గోదావరి బోర్డు, జల్‌శక్తి శాఖ, కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు ఫిర్యాదు చేశామని, మరోసారి ఈ అంశాన్ని బోర్డు దృష్టికి తెస్తున్నామని పేర్కొంది. సోమవారం హైదరాబాద్‌లోని జల్‌సౌధలో గోదావరి బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌తో రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి సమావేశమయ్యారు. గోదావరి నుంచి 450.31 టీఎంసీలను తరలించేలా తెలంగాణ ప్రభుత్వం పనులు చేపట్టిందని బోర్డుకు అధికారులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement