
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ఆగమనానికి సంబంధించి అన్ని శాఖలు అప్రమత్తంగా ఉం డాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఆదేశించారు. వాతావరణ పరిస్థితులపై బుధవారం ఆయన సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వడగాడ్పు లు ఇంకా కొనసాగితే వ్యవసాయ శాఖ అందుకు సన్నద్ధంగా ఉండాలని, రైతులకు అవసరమైన హెచ్చరికలు పంపాలని ఆదేశించారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాలు అండమాన్‌లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని, తెలంగాణలో జూన్ 10 లేదా 11న చేరుకునే అవకాశం ఉంద న్నారు.
అధిక వర్షపాత హెచ్చరికలు ఎప్పటికప్పుడు పంపించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కంట్రోల్ రూంల ద్వారా శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వాతావరణ శాఖ ద్వారా ప్రాంతాల వారీగా వర్షం వచ్చే వివరాలను ఇవ్వాలని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి వర్షాకాలం ప్రారంభానికి ముందే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నదీ పరీవాహక ప్రాంతాలతోపాటు, పట్టణాలలో అత్యధిక వర్షాలు కురిసే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచనలు ఇచ్చారు. వివిధ శాఖల కంట్రోల్ రూంలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
రైతులకు అవసరమైన విత్తనాలు, పశుగ్రాసం అందుబాటులో ఉంచడంతోపాటు పౌరసరఫరాల శాఖ ద్వారా నిత్యవసర వస్తువులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వర్షపాత వివరాలు రోజువారీగా జిల్లాలకు పంపిస్తామని, జిల్లా కలెక్టర్లతో నిరంతరం సమీక్షించడానికి చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తెలిపారు. రైల్వే, ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్, ఫైర్, మున్సిపల్, పంచాయతీ రాజ్ తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని చెప్పారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నామని, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి తెలిపారు. మలేరియా, డయేరియా లాంటి వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించామని.. వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశామని చెప్పారు.
195 బృందాల ఏర్పాటు..
వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని జీహెచ్‌ఎంసీ పరిధిలో 195 సంచార బృందాలను ఏర్పాటు చేశామని సంస్థ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సహకారంతో ఫ్లడ్ మ్యాప్స్ రూపొందిస్తున్నామని, విపత్తుల నిర్వహణ బృందాలు 24 గంటలు పనిచేస్తాయని చెప్పారు. నాలాల పూడికతీతను జూన్ 6 నాటికి పూర్తి చేస్తామని, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తున్నామని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని, ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా చూస్తామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.
పట్టణ, గ్రామీణ రోడ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, కూలిన చెట్ల తొలగింపునకు చర్యలతోపాటు అవసరమైన హెలీప్యాడ్‌ల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ తెలిపారు. గోదావరి నది పరీవాహక పరిధిలో ముంపు గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు కరకట్టలను పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌రావు తెలిపారు.