సాక్షి, హైదరాబాద్: మానసిక అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో దీర్ఘకాలం చికిత్స పొంది ఆరోగ్యవంతులైన వారికి పునరావాసం కల్పించడానికి హాఫ్ వే హోంల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనికోసం అవసరమైన ప్రణాళికను 15 రోజుల్లోగా తయారు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె జోషి అధికారులను ఆదేశించారు. మానసిక రుగ్మతలతో దీర్ఘకాలం చికిత్స పొంది ఆరోగ్యవంతులైనప్పటికీ ఆసుపత్రిలోనే మగ్గుతున్న వారి కోసం హాఫ్ వే హోంలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. హాఫ్ వే హోంల ఏర్పాటుపై మంగళవారం ఆయన సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
మానసిక ఆరోగ్యం కుదుటపడిన వారిని వీటిల్లో చేర్చి, వారికి నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను ఇవ్వనున్నామన్నారు. హాఫ్‌వే హోంలకు సంబంధించి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఎర్రగడ్డ మానసిక వైద్య చికిత్సాలయాన్ని సందర్శించి నిర్మాణ నమూనాను రూపొందించడంతో పాటు నిర్మాణానికి, నిర్వహణకు అవసరమైన నిధుల అంచనాలను సమర్పించాలన్నారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి శిక్షణను ఇవ్వడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు.
మానసిక సమస్యలకు సంబంధించి జీవన శైలి, ఒత్తిడిని తట్టుకోవడం తదితర అంశాలన్నీ శిక్షణలో ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు సైక్రియాటిస్టుల మ్యాపింగ్‌ను చేపట్టాలని, ప్రైవేటు సైక్రియాటిస్టుల సేవలను కూడా వినియోగించుకోవాలన్నారు. జిల్లాల్లో మెంటల్ హెల్త్ బోర్డుల ఏర్పాటుకు అనుమతి కోసం హైకోర్టు రిజిస్ట్రార్‌కు లేఖ రాయాలని, మెంటల్ హెల్త్‌కు సంబంధించిన ఔషధాలు అందుబాటులో ఉంచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. దీన్‌దయాళ్ డిజెబుల్డ్ రిహాబిలిటేషన్ పథకం నుండి నిధులు పొందేలా ప్రతిపాదనలు రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీని ఏర్పాటు చేశామని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలియజేశారు.
నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా వైద్య, పారామెడికల్ సిబ్బంది శిక్షణకు సంబంధించి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అనుసరిస్తున్న తరహాలో కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని, మెంటల్ హెల్త్ స్క్రీనింగ్‌కు సంబంధించి నిర్దిష్ట విధానాన్ని రూపొందించి వైద్య సేవలు అందిస్తామని ఆమె వివరించారు. ఈ రంగంలో సేవలు అందిస్తున్న ఎన్జీవోలకు శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈ సమావేశంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి జగదీశ్వర్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ యోగితారాణా, వికలాంగ సంక్షేమశాఖ కమిషనర్ శైలజ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మానసిక రోగులకు హాఫ్‌వే హోంలు!
Published Wed, Jul 17 2019 1:37 AM | Last Updated on Wed, Jul 17 2019 1:37 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment