
సాక్షి, హైదరాబాద్: కొత్త జోనల్ వ్యవస్థ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పోస్టుల వర్గీకరణకు కసరత్తు ప్రారంభమైంది. కొత్త జోనల్ వ్యవస్థ అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఈనెల 3న సాయంత్రం 3 గంటలకు సచివాలయంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేయనున్నారు. కేటగిరీలవారీగా పోస్టులు, ఉద్యోగుల సంఖ్య తదితర వివరాలతో హాజరు కావాలని సాధారణ పరిపాలన శాఖ కోరింది. ఉమ్మడి ఏపీలో ఆరు జోన్లుండగా రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి 4, తెలంగాణకు 2 జోన్లు వచ్చాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత జిల్లాల సంఖ్య 10 నుంచి 31కి పెంచారు. కొత్త రాష్ట్రం, కొత్త జిల్లాల అవసరాలకు అనుగుణంగా తెలంగాణలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్ విధానాన్ని రూపొందించింది.
రాష్ట్రపతి గత ఆగస్టు 29న ఈ ప్రతిపాదనలను ఆమోదించిన విషయం తెలిసిందే. దీనినే ‘ది తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) ఆర్డర్, 2018’ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 29న గెజిట్ ఉత్తర్వులు జారీ చేసింది. 36 నెలల్లోపు ఈ కొత్త జోనల్ వ్యవస్థను రాష్ట్రంలో అమలు చేయాలని రాష్ట్రపతి ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది. ఈ మేరకు కొత్త జోనల్ వ్యవస్థ ఆధారంగా పోస్టులు, ఉద్యోగుల విభజన ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి ఉద్యోగులు, పోస్టుల వివరాలు సేకరించేందుకు ఆరు రకాల నమూనా దరఖాస్తులను రాష్ట్ర ఆర్థిక శాఖ సిద్ధం చేసింది. తెలంగాణ ఆర్థిక శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో శాఖల వారీగా ఉద్యోగులు, పోస్టుల వివరాలను అప్‌లోడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
Comments
Please login to add a commentAdd a comment