సాక్షి, హైదరాబాద్: పరిపాలనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వేగంగా, పారదర్శకంగా పాలన సాగించేందుకు అనుగుణంగా ఎలక్ట్రానిక్ డిజిటల్ (ఈడీ) పరిపాలనను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అన్ని ప్రభుత్వ వ్యవహారాలను ఆన్‌లైన్‌లో అనుసంధానించడం ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. ప్రజల ఫిర్యాదులను స్వీకరించే ప్రజావాణి నుంచి ప్రాజెక్టుల నిర్మాణ పనుల పురోగతి వరకు అన్నింటినీ హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి పరిశీలించి అవసరమైన సూచనలు చేసేలా కొత్త వ్యవస్థ ఏర్పాటు కానుంది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి సూచనలకు అనుగుణంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఈ పనులు చేస్తోంది. ఫైబర్ గ్రిడ్ వ్యవస్థ రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి రాగానే గ్రామస్థాయి నుంచి ప్రత్యక్షంగా అన్ని పర్యవేక్షించే వీలు కలుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు క్షేత్రస్థాయి స్థితిగతులను హైదరాబాద్ నుంచి ప్రత్యక్షంగా పరిశీలించేలా సచివాలయంలో, ప్రగతిభవన్‌లో కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో కొత్త వ్యవస్థను అమల్లోకి తెస్తున్నారు. అధికారిక కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ జరిగినా ముఖ్యమంత్రి, సీఎస్ కార్యాలయాల్లో ప్రత్యక్షంగా చూసేలా డిజిటల్ స్క్రీన్లు ఉంటాయి. హైదరాబాద్‌లోని కార్యాలయాల నుంచే అవసరమైన సూచనలు చేయొచ్చు.
వీడియో కాన్ఫరెన్స్‌కు మించి..
వేగంగా నిర్ణయాలను అమలు చేసేందుకు వీలుగా ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థను అధికారిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. అన్ని జిల్లాల కలెక్టరేట్లు, ఆర్డీవో, తహసీల్దారు కార్యాలయాల్లో వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థ ఇప్పటికే ఉంది. ఎలక్ట్రానిక్ డిజిటల్ వ్యవస్థ దీని కంటే ఇంకా మెరుగ్గా ఉండనుంది. ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థ ఉన్న ప్రదేశం నుంచే మాట్లాడుకునే అవకాశముంది. అయితే ఈడీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తారు. దీని సాయంతో అధికారులు ఎక్కడున్నా శాటిలైట్ వీడియో నెట్‌వర్క్‌ను వినియోగించొచ్చు.
ప్రతి అధికారికి ప్రభుత్వం మొబైల్ నంబర్‌ను కేటాయిస్తుంది. అధికారులు స్మార్ట్ ఫోన్ సాయంతో వీడియో కాల్ మాట్లాడుకునే అవకాశం కల్పిస్తారు. దీనిపై అధికారులు, ఉద్యోగులకు అవగాహన కల్పిస్తారు. జిల్లాల అభివృద్ధిపై కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు నిర్వహించే సమీక్షలను ఉన్నతస్థాయి అధికారులు నేరుగా పరిశీలించి వెంటనే నిర్ణయాలు తీసుకునేలా ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు.
రాష్ట్రంలో అత్యాధునిక పాలన!
Published Tue, Aug 7 2018 3:26 AM | Last Updated on Tue, Aug 7 2018 3:26 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment