సాక్షి, అమరావతి: తన మనిషి సీఎం కుర్చీలో లేడన్న అక్కసుతో నిత్యం అబద్ధాలనే అచ్చేస్తూ ప్రజలెనుకున్న ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువును తీస్తూ అసత్య కథనాలు ప్రచురిస్తున్న ఈనాడు పత్రిక గాంధీ జయంతి రోజున కూడా నిస్సిగ్గుగా నిజాలకు పాతరేసింది. ఫైబర్‌నెట్ స్కాంలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడిని కాపాడేందుకు రామోజీరావు ‘‘వైర్లు పీకేశారు.. గుండెలు బాదుకుంటున్నారు’’ అంటూ విషం కక్కారు.
ఉపయోగంలేని చోట్ల ఉన్న ఫైబర్ కేబుల్‌ను తొలగించి వాటిని ఇతర అవసరాలకు వినియోగిస్తే అదో పెద్ద నేరం అంటూ గగ్గోలు పెడుతున్నారు. 2019 నవంబర్‌లో జరిగిన మెయిల్స్‌ను చూపిస్తూ వైర్లు పీకేశారంటూ అసత్యాలతో కూడిన కథనాన్ని ప్రచురించారు. ఇదంతా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ ఎండీగా నియమించిన ఐఏఎస్ అధికారి ఎ. సుమిత్‌కుమార్ ఆధ్వర్యంలో టెరాసాఫ్ట్‌కు అనుబంధంగా పనిచేసిన నెటాప్స్ సంస్థలే ఈ తొలగింపు ప్రక్రియలో పాల్గొన్న విషయాన్ని వ్యూహాత్మకంగా ఎక్కడా పేర్కొనలేదు.
చోరీ జరగక్కుండా ఉండేందుకు తొలగిస్తే..
ఫైబర్‌గ్రిడ్ ఫేజ్–1 ప్రాజెక్టు కింద అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్ కేబుల్ కాంట్రాక్టును టెరాసాఫ్ట్ సంస్థ కాంట్రాక్టు దక్కించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల్లో 24,000 కి.మీ మేర 24ఎఫ్ ఫైబర్ కేబుల్, దానికి కావాల్సిన స్తంభాలు ఇతర పరికరాలతో సమకూర్చారు. అందులోని 524 కి.మీ పరిధిలో సబ్‌స్రై్కబర్స్ లేకపోవడంవల్ల అక్కడ కేబుల్‌ను చోరీచేసే అవకాశం ఉండటంతో వీటిని ఇతర అవసరాలకు వినియోగించుకోవాలని ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ నిర్ణయించింది.
12 జిల్లాల్లో ఉపయోగంలేని చోట్ల మొత్తం 524 కి.మీ పరిధిలోని కేబుల్‌ను ఇతరచోట్ల బిగించుకునేందుకు వీలుగా తొలగించాలని ఏపీఎఎస్‌ఎఫ్‌ఎల్ ఉద్యోగి రాజేశ్‌రాయ్ తన ఈ–మెయిల్స్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాదు.. అప్పటి ప్రభుత్వంలో ఫైబర్‌నెట్ కేబుల్ బిగించడంలో పాలుపంచుకున్న నెటాప్స్ సంస్థకే ఈ తొలగింపు కాంట్రాకును ఇచ్చారు. దీంతో ఆ సంస్థ మీటరుకు రూ.12 ఇవ్వాలని కోరగా ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ రూ.8 మాత్రమే చెల్లించింది. మొత్తం 1,25,677 మీటర్ల 24ఎఫ్ ఫైబర్ కేబుల్‌ను తొలగించినందుకు రూ.11,86,391 చెల్లించారు. ఈ తొలగించిన కేబుల్‌ను వైర్లు కట్ అయ్యి ప్రసారాలు ఆగిపోయిన చోట్ల తిరిగి బిగించడానికి వినియోగిస్తున్నారు.
వక్రీకరించి విషప్రచారం..
ఇలా వృధాగా ఉన్న విలువైన వైరును తిరిగి ఉపయోగిస్తుంటే దాన్ని అభినందించాల్సిందిపోయి చంద్రబాబు తప్పేం చేయలేదు.. వీళ్లే కేబుల్స్ తొలగించి గుండెలు బాదేసుకుంటున్నారంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈనాడు వక్రీకరించి విషప్రచారం చేయడాన్ని అధికారులు ఖండిస్తున్నారు. అసలు ఫైబర్‌నెట్ కుంభకోణానికి ఈ వైర్ల తొలగింపునకు ఎలాంటి సంబంధం లేకపోయినా బోడిగుండుకు మోకాలుకు ముడిపెడుతూ చంద్రబాబుని ఈ కుంభకోణం నుంచి తప్పించడానికి రామోజీ పడుతున్న పాట్లు చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment