సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1, గ్రూప్–2 సహా ఆర్థిక శాఖ అనుమతిచ్చిన పలు పోస్టులకు సంబంధించి కొత్త జోన్ల ప్రకారం ఆయా శాఖల నుంచి ఇండెంట్లు వచ్చాకే నోటిఫికేషన్లు జారీ చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. కేంద్రం ఇటీవల రాష్ట్రంలో కొత్త జోన్లకు ఆమోదం తెలిపినందున వాటి ప్రకారం పోస్టులను పునర్విభజన చేయాల్సి ఉంటుందని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి, ఆయా శాఖలకు కమిషన్ లేఖలు రాసినట్లు సమాచారం. కొత్త జోన్ల ప్రకారం రోస్టర్ వివరాలిస్తే నోటిఫికేషన్లు జారీ చేస్తామని పేర్కొన్నట్లు సమాచారం.
అసెంబ్లీ రద్దు అంశం నోటిఫికేషన్ల జారీకి అడ్డుకాదని, ఆర్థిక శాఖ ఆమోదం తెలిపితే, వివిధ దశల్లో ఉన్న పోస్టుల భర్తీ యథావిధిగా కొనసాగుతుందని టీఎస్‌పీఎస్సీ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా గ్రూప్–1 పోస్టులను రాష్ట్ర కేడర్ నుంచి మల్టీ జోన్‌కు మార్పు చేయడం, కొన్ని జోనల్ కేడర్‌లో పోస్టులను మార్పు చేసినందున కొత్త జోన్ల ప్రకారం వాటన్నింటినీ పునర్విభజన చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 140 వరకు ఉన్న గ్రూప్–1 పోస్టులు ఏ మల్టీ జోన్‌లో ఎన్ని పోస్టులు వస్తాయి.. వాటిని జనాభా ప్రాతిపదికన విభజించాలా.. మరేదైనా ఉందా.. అన్న విషయాన్ని ప్రభుత్వం, ఆయా శాఖలు తేల్చుకొని విభజించాల్సి ఉంటుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
జోనల్ పోస్టులను కూడా కొత్త జోన్ల ప్రకారం ఎలా విభజించాలన్నది నిర్ణయించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, ఆయా శాఖలు నిర్ణయించి కొత్త జోన్ల ప్రకారం రోస్టర్, పోస్టుల కేటాయింపుతో కూడిన ఇండెంట్లు ఇచ్చాకే నోటిఫికేషన్లు జారీ చేయొచ్చని టీఎస్‌పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ పునర్విభజన ప్రక్రియను ప్రభుత్వం, ఆయా శాఖలు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాయో.. ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్ని జిల్లా పోస్టులకు మాత్రం పెద్దగా ఇబ్బంది లేకపోయినా జిల్లాల వారీగా రోస్టర్ ఇస్తే వాటి భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేసే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
ఇండెంట్లు వచ్చాక నోటిఫికేషన్లు
Published Sat, Sep 8 2018 1:35 AM | Last Updated on Sat, Sep 8 2018 1:35 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment