![Sk Joshi On agriculture affiliates - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/31/SK-JOSHI-3.jpg.webp?itok=gk-jh_nB)
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా వ్యవసాయ, అనుబంధ రంగాల శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి వెల్లడించారు. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) రూపొందించిన 2019–20 తెలంగాణ రాష్ట్ర రుణ విధాన పత్రాన్ని బుధవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒకే రంగానికి చెందిన శాఖలు వేర్వేరుగా కాకుండా ఒకే విభాగం కిందకు వచ్చేలా కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడం అంత సులువు కాదని, అందుకు తగిన విధంగా చర్యలు తీసుకుంటేనే అది సాధ్యపడుతుందన్నారు.
దేశవ్యాప్తంగా సగటున 3 శాతమే వ్యవసాయ వృద్ధి రేటు ఉంటుందని, ఇది ఇలాగే కొనసాగితే 20 ఏళ్లు అయినా కూడా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయలేమన్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో కూడా భారీ మార్పులు రావాల్సి ఉందని జోషి అభిప్రాయపడ్డారు. చిన్న కమతాలు ఉన్నవారందరూ కూడా యంత్రాలు కొనుగోలు చేయడం కాకుండా ఓలా, ఉబర్ తరహా అద్దెకు యంత్రాలు లభించేలా మార్పులు రావాలన్నారు. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ వరి, గోధుమలే పంటలు కాదని, పప్పు, చిరు ధాన్యాలు, కూరగాయల సాగుపై రైతులు దృష్టి సారించేలా ప్రోత్సహించాలన్నారు.
సేంద్రియ సాగుకు పంట రుణాలివ్వాలి
సేంద్రియ పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కల్పించి, రుణాలు అందేలా చూడాలని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. అలాగే పాడికీ, పంటలకు కలిపి ఒకే రుణం కింద ఎందుకు ఇవ్వరాదని, ఈ విషయంపై బ్యాం కులు ఆలోచన చేయాలని సూచించారు. ఈ సమావేశంలో నాబార్డు సీజీఎం విజయ్‌కుమార్, ఆర్‌బీఐ జనరల్ మేనేజర్ సుందరం శంకర్, ఎస్‌ఎల్‌బీసీ జనరల్ మేనేజర్ రమేశ్, ఆంధ్రాబ్యాంకు ఈడీ ఎ.కె.రత్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment