c.Parthasarathy
-
రైతుబంధుకు రూ. 5,100 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రైతుబంధుకు రూ.5,100 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా, ఆ నిధుల విడుదలకు పరిపాలనా అనుమతులిస్తూ వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు. రబీలో రైతులకు పెట్టుబడి సాయం కింద నగదు అందించేందుకు ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది. 2019–20 వార్షిక బడ్జెట్లో రైతుబంధు కోసం రూ. 12,862 కోట్లు కేటాయించగా.. ఖరీఫ్‌లో రూ.6,862 కోట్లు మంజూరు చేశారు. రూ.5,100 కోట్లను రబీలో అందించేందుకు రంగం సిద్ధం చేశారు. నిధుల మం జూరుకు సంబంధించిన పరిపాలనా అనుమతులు రావడంతో వ్యవసాయ శాఖ రైతుల వివరాలను ఆర్థికశాఖకు అందించనుంది. కాగా, రైతుబంధుకు నిధులు విడుదల చేయడం పట్ల మంత్రి నిరంజన్‌రెడ్డి ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. -
ఒకే గొడుగు కిందకు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వ్యవసాయ, అనుబంధ రంగాల శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి వెల్లడించారు. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) రూపొందించిన 2019–20 తెలంగాణ రాష్ట్ర రుణ విధాన పత్రాన్ని బుధవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒకే రంగానికి చెందిన శాఖలు వేర్వేరుగా కాకుండా ఒకే విభాగం కిందకు వచ్చేలా కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడం అంత సులువు కాదని, అందుకు తగిన విధంగా చర్యలు తీసుకుంటేనే అది సాధ్యపడుతుందన్నారు. దేశవ్యాప్తంగా సగటున 3 శాతమే వ్యవసాయ వృద్ధి రేటు ఉంటుందని, ఇది ఇలాగే కొనసాగితే 20 ఏళ్లు అయినా కూడా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయలేమన్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో కూడా భారీ మార్పులు రావాల్సి ఉందని జోషి అభిప్రాయపడ్డారు. చిన్న కమతాలు ఉన్నవారందరూ కూడా యంత్రాలు కొనుగోలు చేయడం కాకుండా ఓలా, ఉబర్ తరహా అద్దెకు యంత్రాలు లభించేలా మార్పులు రావాలన్నారు. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ వరి, గోధుమలే పంటలు కాదని, పప్పు, చిరు ధాన్యాలు, కూరగాయల సాగుపై రైతులు దృష్టి సారించేలా ప్రోత్సహించాలన్నారు. సేంద్రియ సాగుకు పంట రుణాలివ్వాలి సేంద్రియ పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కల్పించి, రుణాలు అందేలా చూడాలని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. అలాగే పాడికీ, పంటలకు కలిపి ఒకే రుణం కింద ఎందుకు ఇవ్వరాదని, ఈ విషయంపై బ్యాం కులు ఆలోచన చేయాలని సూచించారు. ఈ సమావేశంలో నాబార్డు సీజీఎం విజయ్‌కుమార్, ఆర్బీఐ జనరల్ మేనేజర్ సుందరం శంకర్, ఎస్ఎల్బీసీ జనరల్ మేనేజర్ రమేశ్, ఆంధ్రాబ్యాంకు ఈడీ ఎ.కె.రత్, తదితరులు పాల్గొన్నారు. -
ఇకపై అన్ని జిల్లాల్లో ధాన్యం సేకరణ
సాక్షి, హైదరాబాద్: ధాన్యం సేకరణపై తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. ఏ జిల్లాలో ఉత్పత్తి అయిన ధాన్యాన్ని అదే జిల్లా ప్రజా పంపిణీ వ్యవస్థ అవసరాలకు వినియోగించాలని నిర్ణయించింది. తెలంగాణలో ఇప్పటివరకు కేవలం కొన్ని జిల్లాలకే పరిమితమైన ధాన్యం సేకరణను అన్ని జిల్లాలకు వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం బియ్యాన్ని వికేంద్రీకరణ కింద పౌర సరఫరాల శాఖ సేకరించనుంది. ఆయా జిల్లాల్లో సేకరించిన ధాన్యాన్ని అక్కడే బియ్యంగా మార్చి ఆ జిల్లా ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) లబ్ధిదారులకు సరఫరా చేస్తారు. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ సి.పార్థసారథి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లో మిల్లు లెవీ లేనందున దానికి మినహాయింపు ఉందని పేర్కొన్నారు. ఇకపై అన్ని జిల్లాల్లో పచ్చిబియ్యాన్ని పౌరసరఫరాల శాఖ సేకరిస్తుందని, పీడీఎస్‌కు అవసరమయ్యే బియ్యాన్ని ఇక్కడి నుంచే వాడుకుంటుందని వెల్లడించారు. భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) కేవలం ఉప్పుడు బియ్యాన్ని సేకరించి తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు సరఫరా చేస్తుందని పేర్కొన్నారు. కార్పొరేషన్‌కు డెరైక్టర్ల నియామకం: తెలంగాణ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్‌కు డెరైక్టర్లను నియమిస్తూ శుక్రవారం ఆ శాఖ కమిషనర్ ఉత్తర్వులు విడుదల చేశారు. కార్పొరేషన్లో డెరైక్టర్లుగా కమిషనర్ సి.పార్థసారథి, ఎండీ అనిల్‌కుమార్,ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ ఎంవీ సాయిప్రసాద్‌లు ఉంటారు.