ఏ జిల్లాలో ఉత్పత్తి అయిన ధాన్యాన్ని అదే జిల్లా ప్రజా పంపిణీ వ్యవస్థ అవసరాలకు వినియోగించాలని నిర్ణయించింది.
సాక్షి, హైదరాబాద్: ధాన్యం సేకరణపై తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. ఏ జిల్లాలో ఉత్పత్తి అయిన ధాన్యాన్ని అదే జిల్లా ప్రజా పంపిణీ వ్యవస్థ అవసరాలకు వినియోగించాలని నిర్ణయించింది. తెలంగాణలో ఇప్పటివరకు కేవలం కొన్ని జిల్లాలకే పరిమితమైన ధాన్యం సేకరణను అన్ని జిల్లాలకు వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం బియ్యాన్ని వికేంద్రీకరణ కింద పౌర సరఫరాల శాఖ సేకరించనుంది.
ఆయా జిల్లాల్లో సేకరించిన ధాన్యాన్ని అక్కడే బియ్యంగా మార్చి ఆ జిల్లా ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) లబ్ధిదారులకు సరఫరా చేస్తారు. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ సి.పార్థసారథి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లో మిల్లు లెవీ లేనందున దానికి మినహాయింపు ఉందని పేర్కొన్నారు. ఇకపై అన్ని జిల్లాల్లో పచ్చిబియ్యాన్ని పౌరసరఫరాల శాఖ సేకరిస్తుందని, పీడీఎస్‌కు అవసరమయ్యే బియ్యాన్ని ఇక్కడి నుంచే వాడుకుంటుందని వెల్లడించారు. భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) కేవలం ఉప్పుడు బియ్యాన్ని సేకరించి తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు సరఫరా చేస్తుందని పేర్కొన్నారు.
కార్పొరేషన్‌కు డెరైక్టర్ల నియామకం: తెలంగాణ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్‌కు డెరైక్టర్లను నియమిస్తూ శుక్రవారం ఆ శాఖ కమిషనర్ ఉత్తర్వులు విడుదల చేశారు. కార్పొరేషన్‌లో డెరైక్టర్లుగా కమిషనర్ సి.పార్థసారథి, ఎండీ అనిల్‌కుమార్,ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ ఎంవీ సాయిప్రసాద్‌లు ఉంటారు.