సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో డెంగీ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో హైకోర్టు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగీ గురించి వివరణ ఇచ్చే క్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేందర్ కుమార్ జోషి సహా మున్సిపల్ శాఖ కార్యదర్శి గురువారం న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. ఈ క్రమంలో వారి వివరణపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నివారణ చర్యలు తీసుకుంటున్నట్లయితే జనవరిలో 85గా ఉన్న డెంగీ కేసులు.. అక్టోబర్ నాటికి 3,800కి ఎలా పెరిగాయని ప్రశ్నించింది. ఈ సందర్భంగా మూసీ నదిని ఆనుకుని ఉన్న హైకోర్టులోనే దోమలున్నాయని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో సీఎస్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని హైకోర్టు ఆదేశించింది. దోమల నివారణకై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
ఇందులో భాగంగా దోమల నివారణకు 1000 మిషన్లు కొనుగోలు చేయాలని.. వీటికోసం ప్రభుత్వం వెంటనే నిధులను మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై ప్రతి గురువారం కమిటీ కోర్టుకు నివేదిక సమర్పించాలని తెలిపింది. ఒకవేళ డెంగీ వ్యాధి నివారణలో ప్రభుత్వం గనుక విఫలమైతే.. డెంగీ మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. మూసీ నదిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని సీఎస్, అధికారులకు ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ మొదటి వారానికి వాయిదా వేసినట్లు పేర్కొంది.
మీరు ఈ దేశ పౌరులు కాదా?
డెంగీపై వివరణ ఇస్తున్న సందర్భంగా తెలంగాణ ఐఏఎస్‌లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి శిక్షణ ఇచ్చి ఐఏఎస్‌లను చేస్తే.. మీరు సామాన్య ప్రజలకు ఏం సేవ చేస్తున్నారని మండిపడింది. ఈ సందర్భంగా తెలంగాణ ఐఏఎస్‌లు ఈ దేశ పౌరులు కాదా అని న్యాయస్థానం ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను పాటించకుంటే ఐఏఎస్‌లపై సుమోటో కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పౌరులు ఎవరైనా మరణిస్తే అందుకు వారే బాధ్యత వహించాలని పేర్కొంది. అలా మరణించిన కుటుంబానికి ఐఏఎస్‌లు తమ సొంత అకౌంట్ నుంచి రూ. 5 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో హైకోర్టు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సీఎస్ జోషి , ఐఏఎస్‌లు అరవింద్ కుమార్, లోకేష్ కుమార్ , శాంత కుమారి, యోగితా రాణా సైలెంట్‌గా ఉండిపోయినట్లు సమాచారం.
చదవండి: డెంగీకి బలవుతున్నా పట్టించుకోరా?
Comments
Please login to add a commentAdd a comment