డెంగీ మహమ్మారిని మట్టుబెట్టలేరా? | High Court Serious On Telangana Government Over Dengue | Sakshi
Sakshi News home page

డెంగీ మహమ్మారిని మట్టుబెట్టలేరా?

Published Thu, Sep 26 2019 2:12 AM | Last Updated on Thu, Sep 26 2019 2:12 AM

High Court Serious On Telangana Government Over Dengue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : డెంగీ విజృంభించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది. నెలరోజుల్లోగా డెంగీని అదుపు చేయలేకపోతే వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి సమన్లు జారీ చేయాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది. వైద్య, ఆరోగ్య శాఖ, జీహెచ్‌ఎంసీలు దాఖలు చేసిన కౌంటర్లల్లోని విషయాలు పరిశీలించిన ధర్మాసనం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ‘డెంగీ, చికున్‌ గున్యా, స్వైన్‌ఫ్లూ వంటి విష జ్వరాలు వచ్చాక మందులు వేయడం కంటే ప్రాథమిక దశలోనే వాటి నివారణకు చర్యలు తీసుకోవాలి. కోటి మందికిపైగా జనాభా ఉన్న నగరంలో 150 పోర్టబుల్‌ ఫాగింగ్‌ మిషన్లు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం అవుతోంది’.. అని వ్యాఖ్యానించింది.

డెంగీ వంటి విషజ్వరాలతో జనం అల్లాడుతున్నారని, ఆశించిన స్థాయిలో వైద్య సేవలు అందడం లేదని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ ఎం.కరుణ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం తోపాటు, హైకోర్టుకు న్యాయవాది రాపోలు భాస్కర్‌ రాసిన లేఖను కూడా పిల్‌గా పరిగణించిన హైకో ర్టు బుధవారం మరోసారి విచారించింది. కౌంటర్‌ వ్యాజ్యా ల్లోని అంశాలను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం.. డెంగీ అదుపుకాకపోగా కేసుల సంఖ్య పెరిగినట్లుగా ప్రభుత్వం కౌంటర్‌లో పేర్కొనడంపై ఆందోళన వ్యక్తం చేసింది.  ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ 5,914 కేసులు నమోదు అయ్యాయి. సెప్టెంబర్‌ తొలి వారంలో 138 కేసులు నమోదైతే 23వ తేదీ నాటికి ఆ సంఖ్య 309కి పెరిగింది. 22 రోజుల్లో రోగుల పెరుగుదల అక్షరాలా 200 శాతం... అని ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.  ‘ఏజీ చెప్పిన లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం 22 బ్లడ్‌ బ్యాంక్‌లున్నాయి. ఇదేమైనా  కేంద్రపాలిత ప్రాంతమా? బ్లడ్‌ బ్యాంక్‌ల సంఖ్య పెంపు అంశంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి’అని పేర్కొంది. 

లార్వా దశలోనే అంతం చేయాలి.. 
ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నందున మురికివాడల్లో దోమలవ్యాప్తి మరింత పెరగకుండా ఫాగింగ్‌ ఎక్కువగా చేయాలి. డ్రోన్‌ల సహాయంతో దోమల్ని లార్వా దశలోనే అంతం చేస్తే బాగుంటుందేమో ఆలోచన చేయం డి. రాపిడ్‌ డయోగ్నస్టిక్‌ టెస్ట్‌ కిట్స్‌ ద్వారా 80% మేరకు ఫలితాలున్నాయని చెబుతున్నారు. ఎలీసా  పరీక్షలకు ప్రైవేట్‌ లేబరేటరీల్లో రూ. 3,500 వరకూ ఖర్చు అవుతుంది. ఈ పరీక్ష కోసం ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే ఆలోచన చేయాలి. పత్రికల్లో వస్తున్న వార్తల ప్రకారం చూస్తే రోగులకు సరైన వైద్యం అందడం లేదనిపిస్తోంది’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదిస్తూ.. విషజ్వరాలపై ప్రజల్లో అవగాహన కోసం రోడ్ల కూడళ్లల్లో ప్లెక్సీలు ఏర్పాటు చేశామని తెలిపారు. తదు పరి విచారణ అక్టోబర్‌ 23కి వాయిదా పడింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement