సోమవారం సీఈసీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఈవో రజత్‌కుమార్, సోమేశ్ కుమార్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే లోక్‌సభ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి తెలిపారు. శాసనసభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని, అదే స్పూర్తితో పార్లమెంటు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్ల సన్నద్ధతపై భారత ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) సునీల్ ఆరోరా సోమవారం ఢిల్లీ నుంచి పలు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, సీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తామని ఈ సందర్భంగా సీఎస్ జోషి చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో వికలాంగులకు వసతుల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ పనితీరుతో అవార్డు పొందిందని వివరించారు. రాష్ట్రంలోని ఓటర్ల జాబితాను ఫిబ్రవరి 22న ప్రచురిస్తామని సీఈసీకి చెప్పారు. సరిహద్దు రాష్ట్రాల అధికారులతో వచ్చే నెల 5న సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిధులను కేటాయిస్తామన్నారు.
సరిహద్దు రాష్ట్రాలతో ప్రత్యేక కార్యాచరణ
అసెంబ్లీ ఎన్నికలను ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా, ప్రశాంతంగా నిర్వహించామని డీజీపీ మహేందర్‌రెడ్డి సీఈసీకి చెప్పారు. పంచాయతీ ఎన్నికలు రెండు దశలు పూర్తయ్యాయని, ఈ నెల 30న మూడో దశ ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. పార్లమెంటు ఎన్నికలను సైతం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నక్సల్స్ ప్రభావంపై ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాల యంత్రాంగంతో కలసి ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తామని వివరించారు. అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల ఏర్పాటు చేస్తామన్నారు. గత ఎన్నికల కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, సమాచార మార్పిడి చర్యలు తీసుకుంటామని వివ రించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు పొరుగు రాష్ట్రాల నుంచి 19 వేల మంది, కేంద్రం నుంచి 276 కంపెనీల పోలీసు సిబ్బందిని కేటాయించారని.. లోక్‌సభ ఎన్నికలకూ అదే స్థాయిలో కేటాయించాలని డీజీపీ కోరారు. గత ఎన్నికల సందర్భంగా రూ.97 కోట్లు స్వాధీనం చేసుకున్నామని, కేసులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఈ ఎన్నికల్లో నూ మద్యం, డబ్బు ప్రభావాన్ని నిరోధించడానికి ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు.
16 లక్షల అభ్యంతరాలు: రజత్‌కుమార్
ఎన్నికల సంఘం రాష్ట్ర విభాగంలో అవసరమైన సిబ్బంది, ఆర్‌వోలు, ఏఆర్వోలు ఉన్నారని సీఈఓ రజత్‌కుమార్ సీఈసీకి తెలిపారు. ఎన్నికల అంశాలపై ఫిర్యాదు కోసం అన్ని జిల్లాల్లో టోల్ ఫ్రీ (1950) ప్రారంభించామన్నారు. సిబ్బందికి శిక్షణ కూడా పూర్తయిందని వెల్లడించారు. ఓటర్ల నమోదుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని 16 లక్షల అభ్యంతరాలు వచ్చాయని చెప్పారు. పంచాయతీ ఎన్నికలున్నందున ఈ గడువును ఫిబ్రవరి 4 వరకు పొడిగించామన్నారు. లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించడానికి త్వరలోనే రాష్ట్రాల్లో పర్యటిస్తామని సీఈసీ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య కార్యదర్శులు సోమేశ్‌కుమార్, రాజీవ్ త్రివేది, అడిషనల్ డీజీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలకు 350 కోట్లు అవసరం
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు రూ.350 కోట్లు అవసరమవుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్‌కుమార్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించింది. శాంతి భద్రతల విషయంలో కొన్ని సూచనలు చేశాం. రాష్ట్రంలోని పరిస్థితులను కేంద్ర ఎన్నికల అధికారులకు వివరించాం. ఎన్నికల నిర్వహణకు రూ.350 కోట్లు అవుతుంది. ఎన్నికల నిర్వహణలో ఉండే 2.5 లక్షల మందికి అలవెన్సులు ఇవ్వాల్సి ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఓటరు నమోదు అభ్యంతరాలపై టోల్ ఫ్రీ నంబరుకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. వారి నుంచి అన్ని వివరాలను అడిగి తెలుసుకుంటున్నాం. ఇప్పటివరకు ఐదుగురు పోలింగ్ పిటిషన్‌లు వేశారు. పోలింగ్ నిర్వహణపై 28 మందిని శిక్షణకు పంపిస్తున్నాం. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మంచిగా ఉంది. అవసరం మేరకు పోలీస్ బలగాలను వినియోగించుకుంటాం..’అని సీఈఓ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment