
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. 5 రోజుల క్రితం ముగ్గురిని బదిలీ చేసిన ప్రభుత్వం మంగళవారం మరో 11 మంది ఐఏఎస్‌లకు స్థానచలనం కల్పించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా సిద్ధిపేట కలెక్టర్‌గా పని చేస్తున్న పి.వెంకట్రామిరెడ్డి.. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్య జిల్లా రాజన్నసిరిసిల్ల కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా పని చేస్తున్న డి.కృష్ణభాస్కర్‌ను సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలిని బదిలీ చేసిన ప్రభుత్వం కొత్తగా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావును హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా నియమించారు.
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణాకు ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. భూ పరిపాలన(సీసీఎల్‌ఏ) డైరెక్టర్ వాకాటి కరుణ ప్రస్తుతం అదనపు బాధ్యతలో ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. వాకాటి కరుణకు మరో అదనపు బాధ్యతగా ఉన్న రిజిస్ట్రేషన్, స్టాంప్స్ కమిషనర్ పోస్టులో సైతం ప్రభుత్వం ఇటీవలే పూర్తి స్థాయి అధికారిని నియమించింది. ఆగస్టు 31లోపు మరికొందరు ఐఎస్‌ఎస్‌ల బదిలీలు ఉంటాయని తెలుస్తోంది. మరికొంత మంది కలెక్టర్లతోపాటు, వివిధ శాఖల కమిషనర్లు, ముఖ్యకార్యదర్శుల పేర్లు తదుపరి బదిలీల జాబితాలో ఉండనున్నాయి.
ఎన్నికల ప్రక్రియ వల్లే...
2019 సాధారణ ఎన్నికల ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలోనే కలెక్టర్ల బదిలీలు అనివార్యమయ్యాయి. సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్రియ చేపట్టింది. సెప్టెంబర్ 1న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించనుంది. అనంతరం అభ్యంతరాలు, ప్రతిపాదనల స్వీకరణ, పరిష్కారాల ప్రక్రియ ఉంటుంది. సాధారణంగా జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. ఓటర్ల జాబితా అభ్యంతరాలు, స్వీకరణ ప్రక్రియలో నిమగ్నమైన అధికారులను సెప్టెంబర్ 1 తర్వాత బదిలీ చేయడం కుదరదు. తప్పనిసరి పరిస్థితుల్లో బదిలీ చేయాలంటే కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను బదిలీ చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment