
‘ఐఏఎస్ అధికారులను పంపండి మహాప్రభో!’. డిప్యుటేషన్‌పై ఇవ్వాలని పదేపదే రాష్ట్ర ప్రభుత్వం వినతులు. అధికారుల కొరత ఉందని రెండుసార్లు లేఖలు రాసిన సీఎం చంద్రబాబు.. అయినా స్పందించని కేంద్రం.. ఇది కొన్నాళ్ల క్రితం తెలుగుదేశం అధికార మీడియా ‘ఈనాడు’లో ప్రముఖంగా వచ్చిన వార్త.
‘ఏపీ కేడర్‌పై కక్ష.. నాన్ ఏపీ కేడర్‌పై ఆపేక్ష’.. ఐదుగురు ఐఎఎస్, తొమ్మిది మంది ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు ఇవ్వని కూటమి ప్రభుత్వం.. ఇది సాక్షి దినపత్రికలో వచ్చిన కథనం.
ఈ రెండు వార్తలు చదివితే ఏం అర్థమవుతోంది?. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వద్ద ఉన్న సీనియర్ అధికారులను వాడుకోకపోగా.. కొత్తగా అధికారులను కేటాయించాలని కేంద్రాన్ని అడుగుతున్నారూ అని!. అంతేకాదు.. కేంద్రంలో కాని, ఆయా రాష్ట్రాలలో కాని పని చేస్తున్న నాన్ కేడర్ అంటే అఖిల భారత సర్వీస్ కానీ తమ వాళ్లను ఏపీకి తీసుకురావాలని ప్రయత్నించడమే కదా! ఇందులో మతలబు ఏమిటి? ఐఏఎస్, ఐపీఎస్‌లు ఏ ప్రభుత్వం ఉన్నా, విధానాలకు అనుగుణంగా పని చేయవలసి ఉంటుంది. నిబంధనలు, రాజ్యాంగంలోని అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది.
అయితే, ఏపీలో ఎనిమిది నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం భారత రాజ్యాంగానికి బదులు సొంత రెడ్ బుక్ అమలుకే ప్రాధాన్యత ఇస్తోంది. తమపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేసిన అధికారులపై కక్ష తీర్చు కోవడం, ఇష్టం లేని అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధించడం చేస్తోంది. ఒక వైపు ఉన్న అధికారులను వాడుకోకపోగా మరోవైపు కేంద్రం తమకు కావల్సిన అధికారులను ఇవ్వడం లేదని వార్తలు రాయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 239 మంది ఉన్నతాధికారులు అవసరమైతే ప్రస్తుతం 191 మందే ఉన్నారని ఈనాడు కథనం. నలుగురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్, నలుగురు ఐఆర్ఎస్‌లు కలిపి పది మందిని డిప్యుటేషన్‌పై పంపాలని చంద్రబాబు ఇప్పటికీ రెండుసార్లు లేఖలు రాసినా కేంద్రం నుంచి జవాబు రాలేదట. చిత్రం ఏమిటంటే ఏదైనా అనుకూల నిర్ణయం జరిగితే అదంతా చంద్రబాబు విజయం, గొప్పదనం అని డబ్బా కొట్టే ఈనాడు, కేంద్రం డిప్యుటేషన్‌పై అధికారులను పంపకపోవడాన్ని మాత్రం ఉన్నతాధికారుల వైఫల్యమని చెబుతోంది.
ఉన్నతాధికారులను కేటాయించగల స్థాయి ఉన్న వారి వద్దకు అధికారుల కంటే ముఖ్యమంత్రే వెళ్లగలరన్నది అందరికీ తెలిసిన విషయం. అయినా సరే తమ బాబును వెనకేసుకొచ్చేందుకు ఈనాడు ఈ రకమైన కథనాలు రాస్తూంటుంది. నైపుణ్యమున్న అధికారుల కొరత ఉందని ముఖ్యమంత్రి తన లేఖలో పేర్కొన్నారు. ఈ నైపుణ్యం తమ సామాజిక వర్గం వారు లేదా రాజకీయంగా తమకు ఉపయోగపడగలిగే వారు అని సీఎం అర్థం?. ఈ నియామకాలు ప్రతిభ ఆధారంగా జరుగుతాయా అని ప్రశ్నిస్తే.. ఎక్కువ సందర్భాలలో వ్యక్తిగత ఇష్టాఇష్టాలపైనే జరుగుతుంటాయన్నది వాస్తవం.
ఏపీలో కూటమి సర్కార్ తీరు మరీ ఘోరం. గత టర్మ్‌లో ఆదాయపన్ను శాఖలో పనిచేసే ఒక అధికారిని డిప్యుటేషన్‌పై తెచ్చుకుని ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డులో నియమించుకున్నారు. దానికి కారణం ఆయనలో ఉన్న నైపుణ్యం కంటే, ఐటి శాఖలో ఉన్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌ను ఇబ్బంది పెట్టే నివేదికలు తయారు చేశారన్న అభిమానమే కారణమని అప్పట్లో చెప్పుకునేవారు. అలాగే ఇదే సంస్థలో ఒక మాజీ ఐఏఎస్ అధికారి కుమార్తెను కూడా భారీ జీతానికి నియమించుకున్నారని వార్తలు వచ్చాయి. ఇది 2014 టర్మ్‌లో జరిగిన సంగతి. తాజాగా జరిగిన ఒక డిప్యుటేషన్‌ను పరిశీలిద్దాం.
గత టర్మ్‌లో డిప్యుటేషన్‌పై వచ్చి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసిన వెంకయ్య చౌదరి అనే అధికారిని ఈసారి ప్రభుత్వం రావడంతోనే టీటీడీ అదనపు ఈవోగా నియమించారు. గనుల శాఖ నైపుణ్యానికి, టీటీడీలో అవసరమైన నైపుణ్యానికి సంబంధం ఉంటుందా అంటే ఎవరూ చెప్పలేరు. జగన్ ప్రభుత్వం ధర్మారెడ్డి అనే రక్షణ శాఖ అధికారిని డిప్యుటేషన్‌పై టీటీడీకి తెచ్చి నియమిస్తే ఇదే తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు చేసేది. మరి ఇప్పుడు వెంకన్న చౌదరిని ఎందుకు పెట్టుకున్నారు? తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి సుబ్బరాయుడును తిరుపతి జిల్లా ఎస్పీగా చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన ఘటన నేపథ్యంలో వీరిద్దరిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. సుబ్బరాయుడిని మాత్రం బదిలీ చేసినట్లు చేసి, తిరిగి తిరుపతిలోనే ఎర్ర చందనం టాస్క్‌ఫోర్స్ అధికారిగా నియమించారు. ఈయనను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరో సిట్‌లో కూడా సభ్యుడిని చేశారు.
అంటే ప్రభుత్వ పెద్దలు కోరినట్లుగా రెడ్ బుక్ అమలు బాధ్యతను పెడుతున్నారన్నమాట. తిరుమలలో పెత్తనం చేయడానికి వెంకయ్యకు పోస్టింగ్ ఇచ్చారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. యూపీ కేడర్ ఐఏఎస్ అధికారి రాజమౌళిని తెచ్చుకుని సీఎంవోలో పెట్టుకున్నారట. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే ఏపీలో శ్రీలక్ష్మి, మురళీధర్ రెడ్డి, ముత్యాల రాజు, నీలకంఠా రెడ్డి, మాధవీలత వంటి ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లే ఇవ్వకపోవడం. ఇష్టం లేని అధికారులు అనుకుంటే వారికి ప్రాధాన్యంలేని పోస్టులు ఇస్తుంటారు. వీరికి మాత్రం ఏ పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. అలాగే ఐపీఎస్ అధికారులు నలుగురిని కొన్ని పిచ్చి కేసులలో సస్పెండ్ చేశారు. స్కిల్ స్కామ్ కేసు, మార్గదర్శి డిపాజిట్లు, ఇతర అక్రమాల కేసులను దర్యాప్తు చేసి పలు అంశాలను వెలుగులోకి తెచ్చారన్న కోపంతో మరికొందరు ఐపీఎస్‌లకు పోస్టింగ్స్ ఇవ్వలేదు.
వీరిలో కొల్లి రఘురామిరెడ్డి, రిషాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, సునీల్ కుమార్, జాషువా అనేవారు ఉన్నారు. అక్కడితో ఆగలేదు. ఈ ఐపీఎస్‌లు రోజూ డీజీపీ ఆఫీస్‌కు వెళ్లి అటెండెన్స్ వేసుకుని, సాయంత్రం వరకు అక్కడే ఖాళీగా కూర్చోవాలట. బహుశా గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం ఇంత అధ్వాన్నంగా పాలన నడపలేదు. ఒకవైపు ఇలా సీనియర్ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా, లేదా వారిపై స్పష్టమైన అభియోగాలు మోపకుండా చేస్తున్న తీరు సహజంగానే కేంద్రం దృష్టికి కూడా వెళ్లే అవకాశం ఉంది. మరి అడ్డగోలుగా రాజకీయ పాలనే కేంద్ర ప్రభుత్వంలో కూడా జరుగుతున్న సందర్భాలలో చంద్రబాబు వంటివారు ఏం అడిగితే అది ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాకాకుండా నిబంధనల ప్రకారం రాష్ట్రంలో పాలన ఉంటే ఎలాంటి లేఖలు వచ్చినా స్పందించకుండా ఉంటారా?.
అయినా కేంద్రంలో తమ పార్టీ ఎంపీల సంఖ్యతోనే చక్రం తిప్పుతున్నామని టీడీపీ చెబుతుంది. చంద్రబాబుకు ఉన్న పరపతిపై ఈనాడు మీడియా హోరెత్తిస్తుంటుంది. అయినా చంద్రబాబు రెండు లేఖలు రాసినా ఆయన కోరిన విధంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేంద్రం పంపించలేదంటే, డిప్యుటేషన్లు ఇవ్వలేదంటే ఏమనుకోవాలి?. చంద్రబాబు ప్రభుత్వం మరీ అధ్వాన్నంగా పాలన సాగిస్తుందని పరోక్షంగా చెప్పడమే అవుతుంది!. అయినా ఏదో రకంగా ప్రధాని మోదీనో, హోం మంత్రి అమిత్ షానో పట్టుకుని తమకు కావాల్సిన వారిని ఏపీకి తెచ్చుకుంటారేమో చూడాలి. కానీ, ఉన్న అధికారులను వాడుకోకుండా వేరే వారిని పంపించాలని అనడంలో హేతుబద్దత ఏమిటో తెలియదు. అదీకాక ఇప్పుడు రెడ్ బుక్ అంటూ సీనియర్ అధికారులను వేటాడుతున్న తీరు ఐఏఎస్, ఐపీఎస్ సర్కిల్స్‌లో తెలియకుండా ఉండదు.
గత ప్రభుత్వంలో పని చేసిన కొంతమంది తిరిగి డిప్యుటేషన్‌ను రద్దు చేసుకుని వెళ్లిపోతామంటే కూడా ఏదో రకంగా కూటమి ప్రభుత్వం అడ్డుపడుతోంది. ఎవరైనా డిప్యుటేషన్ పూర్తి చేసుకుని వెళ్లిపోతుంటే వారిపై కూడా కక్ష పూరితంగా ఆటంకాలు సృష్టిస్తోందట. అదే సమయంలో పలు అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై ఒక పోలీసు అధికారిని జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేస్తే, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆయనకు ఒక కార్పొరేషన్ పదవి కూడా కట్టబెట్టింది. మరోవైపు తమ అవినీతి కేసులలో తప్పుడు సాక్ష్యాలు ఇవ్వకపోతే రెడ్ బుక్ ప్రయోగిస్తామన్న హెచ్చరికలు పంపిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇంకో మాట చెప్పాలి. కూటమి ప్రభుత్వం రావడంతోనే ఈనాడు, ఆంధ్రజ్యోతి మరింతగా చెలరేగిపోతూ అధికారులు అందరిపై తమదే పెత్తనం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. వారు ఎవరి మీద ఆరోపణలు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలట.
తెలుగుదేశం ప్రభుత్వం కక్షతో పాటు ఈ మీడియా కక్ష కూడా అధికంగానే ఉంటున్నట్లుగా కనిపిస్తుంది. ఈనాడు పెత్తనం ఏ స్థాయికి వెళ్లిదంటే చివరికి ఒక జిల్లా కలెక్టర్, ఒక ఎస్పీనే ఈనాడు విలేకరిపై మండిపడాల్సినంతగా పరిస్థితి ఏర్పడింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఈనాడు ఏదో కథనం వండి వార్చుతోంది. దానిపై ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఒక కమిటీని నియమించుకుంది. ఆ కమిటీ అధికారులు విచారణకు వెళితే ఈనాడు విలేకరి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారులకు చికాకు తెప్పించారు. దానిపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తే, తెల్లవారేసరికల్లా ఆ కలెక్టర్, ఎస్పీలపై మొదటి పేజీలో పెద్ద వార్త రాసేశారు. ఒకప్పుడు మీడియాకు స్వీయ నియంత్రణ ఉండేది. ఇప్పుడేమో స్వీయ బ్లాక్ మెయిలింగ్‌తో మీడియా అధికార యంత్రాంగాన్ని తానే నడపాలని ప్రయత్నిస్తోంది. ఎంతో సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వం ఎంత అధ్వాన్నంగా పాలన సాగిస్తున్నది చెప్పడానికి ఇవన్ని ఉదాహరణలే అవుతాయి.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment