
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన ఆరు మాసాల్లోనే అత్యుత్తమైన టీఎస్–ఐపాస్ విధానానికి రూపకల్పన చేసి సింగిల్‌విండో విధానంలో పరిశ్రమలకు సత్వర అనుమతులు జారీ చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి తెలిపారు. రూ.1,30,216 కోట్ల పెట్టుబడి విలువగల 7,337 పరిశ్రమలకు అనుమతులిచ్చామని, 6 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ఇప్ప టికే 4,884 పరిశ్రమలు ప్రారంభమయ్యాయని తెలిపారు.
భారతదేశంలోని రాష్ట్రాలను విదేశాల్లో ప్రమోట్ చేయడంలో భాగంగా భారత రాయబారుల బృందం రాష్ట్రాల పర్యటన చేపట్టింది. ఈ క్రమంలో ఆ బృందం బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సచివాలయంలో సమావేశమైంది. సీఎస్ మాట్లాడు తూ సులభతర వాణిజ్యంలో మొదటి స్ధానంలో నిలుస్తున్నామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, తగినంత భూమి అందుబాటులో ఉందని, పలు సబ్సిడీలు అందిస్తున్నామని పేర్కొన్నా రు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ తక్కువ వ్యయంతో పరిశ్రమలు స్థాపించవచ్చని పేర్కొన్నారు.
18.25 లక్షల మెట్రిక్ టన్నుల సామ ర్థ్యంగల గోడౌన్స్ నిర్మించామని, యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నామని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి వివరించారు. మిషన్ కాకతీయ ద్వారా 27,742 చెరువుల్లో పూడికతీత, అభివృద్ధి పనులు చేపట్టామని, 8.25 టీఎంసీల అదనపు నిల్వ సామర్థ్యాన్ని సృష్టించామని నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ తెలిపారు. ఫిన్‌లాండ్‌లో భారత రాయబారి వాణీరావు, పెరూలో భారత రాయబారి ఎం.సుబ్బారాయుడు, సిషెల్స్ భారత రాయబారి ఔసఫ్ సయీద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.