తాగునీటికి మరో 5 టీఎంసీలు
శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటి విడుదల కోరుతున్న తెలంగాణ, ఏపీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాంతాల తాగునీటి అవసరాల నిమిత్తం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్‌కు మరో దఫా నీటి విడుదలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కసరత్తు ఆరంభించాయి. ఇటీవలి వర్షాలకు శ్రీశైలంలోకి వారం రోజుల్లోనే సుమారు 20 టీఎంసీల మేర నీటి నిల్వలు చేరిన దృష్ట్యా దిగువ సాగర్‌కు కనీసం 5 టీఎంసీల నీటిని విడుదల చేసేలా ఇరు రాష్ట్రాలు ప్రయత్నాలను మొదలుపెట్టాయి.
ఇప్పటికే తమ అవసరాలకు 2.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలంటూ కృష్ణాబోర్డుకు ఏపీ లేఖ రాయ గా, తెలంగాణ సైతం సోమవారం లేఖ రాయనుంది. కృష్ణా బేసిన్ పరిధిలో నీటి నిల్వలు తగ్గడంతో తాగునీటి అవసరాల నిమిత్తం శ్రీశైలం నీటిని విడుదల చేయాలని రెండు రాష్ట్రాలు కోరడంతో గల నెల 24న కృష్ణా వర్కింగ్ గ్రూప్ సమావేశమై శ్రీశైలం నుంచి నీటి విడుదలకు ఓకే చెప్పింది. ఆ భేటీలోనే ఇరు రాష్ట్రాలు చెరో 5 టీఎంసీలు కలిపి మొత్తంగా 10టీఎంసీల నీటి అవసరాలను వర్కింగ్ గ్రూప్ ముందుంచాయి.
అయితే శ్రీశైలంలో వినియోగార్హమైన నీటి లభ్యత కేవలం 8 టీఎంసీలు మాత్రమే ఉండటంతో తొలి విడతగా 4.3 టీఎంసీల విడుదలకు ఇరు రాష్ట్రాలను బోర్డు సభ్యులు ఒప్పించారు. అవసరాన్ని బట్టి పక్షం రోజుల అనంతరం మరోమారు సమావేశమై అప్పటి అవసరాల మేరకు నీటి విడుదలపై నిర్ణయం చేద్దామని సూచించారు. ఆ భేటీ నిర్ణయం మేరకు గత నెల 25న శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేశారు. ఇప్పటివరకు 3.2 టీఎంసీల నీటిని విడుదల చేయగా, ఇందులోనూ కేవలం 2 టీఎంసీలను మాత్రమే ఇరు రాష్ట్రాలు కలిపి వాడుకోగా మిగతా నీరు సాగర్‌లోనే ఉంది.
మరో 5 టీఎంసీలకు వినతి
పక్షం రోజుల అనంతరం మళ్లీ భేటీ కావాలని నిర్ణయించినా ఇంతవరకు వర్కింగ్ గ్రూప్ సమావేశం కాలేదు. ప్రస్తుతం కృష్ణా డెల్టా, కుడి కాల్వ కింద తాగునీటి అవసరాల కోసం ఏపీ..నల్లగొండ, హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం తెలంగాణలు మరింత నీటి విడుదలను కోరుతున్నాయి. హైదరాబాద్‌కు తాగునీటిని అందించే సింగూరులో నిల్వలు పడిపోయిన దృష్ట్యా తమకు కృష్ణా నీళ్లే శరణ్యమని తెలంగాణ చెబుతోంది.
ఇరు రాష్ట్రాలు చెరో 2.5 టీఎంసీల నీటి అవసరాలను పేర్కొంటున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వస్తున్న వరదతో వారం రోజుల్లోనే 20 టీఎంసీల మేర నీరు చేరిందని, ఈ దృష్ట్యా తమ తక్షణ అవసరాలకు నీటిని విడుదల చేయాలని తెలంగాణ విన్నవించింది. సోమవారం తమ నీటి అవసరాలను పేర్కొంటూ బోర్డుకు లేఖ రాయనున్నట్లు తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. అన్నీ కుదిరితే మూడు నాలుగు రోజుల్లోనే వర్కింగ్ గ్రూ ప్ సమావేశమై, రెండో విడతలో శ్రీశైలం నుంచి నీటి విడుదలపై నిర్ణయం చేస్తుం దని అధికార వర్గాలు చెబుతున్నాయి.