ఆశ వర్కర్ల సమ్మెకు తాత్కాలిక విరమణ
సాక్షి, హైదరాబాద్: గత 106 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ‘ఆశ’ వర్కర్ల సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు తెలంగాణ వాలంటరీ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూని యన్ తీర్మానించింది. రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డితో ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు బుధవారం జరిగిన చర్చలలో సమ్మె విరమిస్తే తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు యూని యన్ నాయకులు ఇందిరాపార్కు వద్ద జరిగిన సభలో బుధవారం ప్రకటించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి రెండు, మూడు నెలల గడువు ఇస్తామని అప్పటికీ స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతంగా నిర్వహిస్తామని హెచ్చరించారు.
కాగా ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన వంద కిలోమీటర్ల పాదయాత్ర ముగింపు సందర్భంగా బుధవారం ఇందిరాపార్కు వద్ద సభ నిర్వహించారు. సభలో రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ రాష్ర్ట ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించకపోతే ఈ అంశంపై రాష్ట్ర హైకోర్టులో గాని, సుప్రీంకోర్టులో గాని కేసు వేసి న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. 3 నెలలుగా సమ్మె చేస్తున్న ఆశా వర్కర్లు ఎలా బతుకుతున్నారనే సోయి ప్రభుత్వానికి లేకుండా పోయిందన్నారు. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ నాగేశ్వర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చమని ఆశా వర్కర్లు సమ్మె చేస్తుంటే సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారన్నారు.
ఈ సమస్య కేం ద్రానికి సంబంధించినదని ప్రభుత్వం తప్పిం చుకుంటోందని, ఉపాధి హామీ, మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీ పథకాలు కేంద్రానివి కావా? అని ప్రశ్నించారు. సీపీఐ నేత రవీంద్రకుమార్ మాట్లాడుతూ శీతాకాల, బడ్జెట్ సమావేశాల్లో అన్ని ప్రతిపక్ష పార్టీల సభ్యులను కలుపుకుని ఆశా వర్కర్ల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వ మెడలు వంచుతామన్నారు. సభలో తెలంగాణ వాలంటరీ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జయలక్ష్మి, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబా తదితరులు పాల్గొని మాట్లాడారు.
నిరాశతో ‘ఆశ’ల సమ్మె విరమణ
106 రోజుల ‘ఆశ’ కార్యకర్తల సమ్మెకు తెరపడింది. సర్కారు ఎలాంటి హామీ ఇవ్వకపోయినా తప్పని పరిస్థితుల్లో సమ్మె విరమిం చారు. ఆశ కార్యకర్తలంతా పేదలు కావడం... ఎక్కువ రోజులు సమ్మె చేసిన కారణంగా ఆర్థికంగా చితికిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆశ కార్యకర్తలు చెబుతున్నారు. ‘సమ్మె విరమిస్తే సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినందున విరమణకు నిర్ణయం తీసుకున్నామని... ఇది తాత్కాలికమేన’ని తెలంగాణ వాలంటరీ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి ‘సాక్షి’కి చెప్పారు. వంద రోజులుగా చేసిన విన్నపాలకు, పోరాటానికి విలువ లేకుండా పోయింది. ప్రభుత్వం మొండి వైఖరి అవలంభించిందని నేతలు మండిపడుతున్నారు. అనేకసార్లు మంత్రికి, అధికారులకు విన్నపాలు చేశారు. జిల్లాల్లో ధర్నాలు చేశారు. పాదయాత్రలు నిర్వహించారు. ఇది తమ పరిధిలోనిది కాదని... కేంద్రం పరిధిలోనిదని ప్రభుత్వం తప్పించుకుందన్న విమర్శలూ ఉన్నాయి.