సరిహద్దులో పెట్రోల్‌కు డిమాండ్
ఏపీలో వ్యాట్ విధించడంతో కర్ణాటకకు వస్తున్న వాహనాలు
బళ్లారి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ విధించడం కర్ణాటక రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాల పెట్రోల్ బంకుల యజమానులకు వరంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గిపోతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగినంతగా తగ్గించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వ్యాట్ రూపంలో ఆంధ్రాలో మరింత భారాన్ని రుద్దడంతో ఈ రెండు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో భారీగా వ్యత్యాసం ఏర్పడింది. దీంతో ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక సరిహద్దుకు పెట్రోలు, డీజిల్ కోసం భారీగా వాహనాలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాట్ ప్రభావంతో పెట్రోల్ లీటరుకు రూ.4 పెరిగింది.
గత పరిస్థితులకు భిన్నం
ఆంధ్రప్రదేశ్‌లో మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ లేదు. దీంతో ధరలు కర్ణాటక కంటే ఆంధ్రప్రదేశ్‌లో లీటరుకు నాలుగు రూపాయలు తక్కువ ఉండేది. దీంతో పదేళ్లపాటు ప్రతి నిత్యం ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని పెట్రోల్ బంకులకు కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు వెళ్లేవి. ప్రస్తుతం ప్రతి లీటరుకు నాలుగు రూపాయలు ఎక్కువగా ఉండడంతో ఏపీలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని జీవనం సాగించే వారు క్యాన్‌లలో పెట్రోల్ తీసుకెళ్లుతున్నారు. రైతులు ట్రాక్టర్లలో వచ్చి పెట్రోల్, డీజిల్ తీసుకెళ్లుతున్నారు.