- సర్కారు పిల్లిమొగ్గలు
- పెట్రోలు, డీజిల్‌పై 5 శాతం వ్యాట్ పెంపు
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- రెండు గంటల్లోనే ఉపసంహరణ
సాక్షి, హైదరాబాద్: పెట్రోలు.. డీజిల్‌పై వ్యాట్ పెంపు విషయంలో తెలంగాణ సర్కారు పిల్లి మొగ్గలేసింది. రెండు నెలలు తిరక్కముందే వీటి ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచే ప్రయత్నం చేసింది. ఆదాయాన్ని పెంచుకోవటమే లక్ష్యంగా.. అడ్డగోలు భారం మోపేందుకు ఫైళ్లు కదిపింది. పెట్రోలు, డీజిల్‌పై 5 శాతం వ్యాట్‌ను పెంచుతూ వాణిజ్య పన్నుల విభాగం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఏపీ వ్యాట్-2005’ నిబంధనలను తెలంగాణకు యథాతథంగా స్వీకరిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
చివరి పేజీలో జారీ చేసిన నోటిఫికేషన్‌లో పెట్రోలుపై 4.80 శాతం, డీజిల్‌పై 5 శాతం వ్యాట్ పెంచుతున్నట్లు అందులో పేర్కొంది. ఇలా ప్రస్తుతం పెట్రోలుపై 35.2 శాతం ఉన్న వ్యాట్‌ను 40 శాతానికి... డీజిల్‌పై 27 శాతం ఉన్న వ్యాట్‌ను 32 శాతానికి పెంచినట్లు అందులో స్పష్టం చేసింది. ఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్‌పై అత్యధిక వ్యాట్ వసూలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ తొలి స్థానంలో ఉంది. అదేమీ పట్టించుకోకుండా అమాంతం మరో 5 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయటం హాట్ టాపిక్‌గా మారింది.
విమర్శలు వెల్లువెత్తడంతో: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతుంటే.. రాష్ట్రంలో పెంచుతున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగితే అన్ని వర్గాలపై రూ.కోట్లాదిగా అదనపు భారం పడుతుందనే ఆందోళన వ్యక్తమైంది. ప్రసార సాధనాల్లో ఈ వార్తలు రావటంతో.. ప్రభుత్వం అప్పటికే జారీ చేసిన జీవో నం.31లో చివరి పేజీని తొలగించింది.
పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్ పెంచాలనే ప్రతిపాదనలున్నాయని.. ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. పొరపాటు వల్ల ఉత్తర్వులు వెలువడ్డాయని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ధ్రువీకరించారు. గత నెలలోనే పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్ పెంచామని... అప్పటి రేట్లే ఇప్పటికీ అమల్లో ఉన్నాయని.. సీఎం కార్యాలయం ప్రకటన జారీ చేసింది. కొత్తగా వ్యాట్‌ను పెంచే ప్రతిపాదనలు లేవని స్పష్టం చేసింది.
ఇదో హెచ్చరికా..?: ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు రూ. 68,35, డీజిల్ రూ. 56.24 ధరకు లభ్యమవుతోంది. 5 శాతం వ్యాట్ పెంచితే కనీసం రూ. 2 నుంచి రూ.3 వరకు ధరలు పెరిగే ప్రమాదముంది.
ఈ నేపథ్యంలో వ్యాట్ పెంపునకు జీవో జారీ.. వెను వెంటనే ఉపసంహరణ పరిణామాలు సామాన్యులకు సైతం ఆశ్చర్యంగొలిపాయి. ఆదాయ పెంపును లక్ష్యంగా ఎంచుకున్న ప్రభుత్వం.. పన్నుపోటుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోందని... అందులో భాగంగానే ఈ ఉత్తర్వులు బయటకు పొక్కినట్లు స్పష్టమవుతోంది. తాత్కాలికంగా సర్కారు వెనక్కి తగ్గినా... పెట్రోలు, డీజిల్ ధరలు పెంచేందుకు సర్కారు ప్రయత్నిస్తోందనే హెచ్చరికలు జారీ అయ్యాయి.