వాటిపై వ్యాట్‌ను తగ్గించాలి | To Reduce VAT on them | Sakshi
Sakshi News home page

వాటిపై వ్యాట్‌ను తగ్గించాలి

Published Fri, Oct 2 2015 2:32 AM | Last Updated on Sun, Sep 3 2017 10:18 AM

వాటిపై వ్యాట్‌ను తగ్గించాలి

వాటిపై వ్యాట్‌ను తగ్గించాలి

- వైఎస్సార్‌సీపీ డిమాండ్
- ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఏపీలో పెట్రోలు ధరలు

సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్‌పై పెంచిన 4 రూపాయల వ్యాట్‌ను తగ్గించాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఏపీలో పెట్రోలు, డీజిల్ ధరలున్నాయన్నారు. ఏపీలో లీటరు డీజిల్ ధర రూ.53.97గా ఉంటే భువనేశ్వర్, బెంగళూరులో రూ.47, చెన్నైలో రూ.46గా ఉందన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తక్కువగా ఉన్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికంగా పన్నులు వేసిందని, మరోవైపు రాష్ట్రప్రభుత్వం లీటరుపై రూ.4 చొప్పున వ్యాట్‌ను పెంచిందని ఆయన విమర్శించారు.  
 
రైతులపై లాఠీచార్జీయా?: గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులపై జరిగిన లాఠీచార్జిని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోందని, ఈ ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని కోరుతోందని బొత్స అన్నారు. చంద్రబాబు పాలనలో రైతులపై దాడులు, లాఠీచార్జిలు, రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఇబ్బందుల్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలన్నింటికీ ఆర్థిక పరిపుష్టి చేకూర్చి బాగా నడిచేలా చేస్తామని హామీఇచ్చారని, అధికారంలోకొచ్చాక  ప్రభుత్వ విధానాల్లో మార్పులు చేసి వాటన్నింటినీ లాభాల్లోకి వచ్చేలా చూశారని గుర్తుచేశారు. సహకార షుగర్ ఫ్యాక్టరీల్ని నష్టాలొస్తున్నాయన్న సాకుచూపి కొన్నింటిని తన వందిమాగధులకు చంద్రబాబు గతంలో అమ్మేశారని, ఇపుడూ అలానే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
 
జగన్ దీక్షపై ప్రధాని స్పందిస్తారని ఆశిస్తున్నాం
రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరులో తలపెట్టిన నిరవధిక నిరాహారదీక్ష ఈ నెల ఏడోతేదీ ఉదయం ప్రారంభమవుతుందని బొత్స తెలిపారు. ఈ నెల 22న రాష్ట్రానికొస్తున్న ప్రధాని నరేంద్రమోదీ.. తమ పార్టీ అధినేత చేసే దీక్షకు స్పందించి ప్రత్యేక హోదాను ప్రకటిస్తారని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement