సాక్షి, న్యూఢిల్లీ : దేశ సరిహద్దులను రీ మ్యాప్ చేయడానికి కేంద్ర హోం శాఖ ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలనుంచి మాదకద్రవ్యాల స్మగ్లింగ్, అక్రమ చొరబాటుదారులు, ఉగ్రవాదులు ప్రవేశిస్తున్న నేపథ్యంలో హోంమంత్రి అమిత్‌షా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అంతేకాక, ఆయా సరిహద్దులలో రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి జాయింట్ యాక్షన్ దళాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఇతర దేశాల నుంచి స్మగ్లింగ్ పెరుగుతున్న నేపథ్యంలో హోం మంత్రి అమిత్‌షా అక్టోబరులో పారా మిలిటరీ దళాల డీజీ, ఐబీ చీఫ్, రా, సీబీఐ అధికారులతో ప్రత్యేకంగా భేటీ ఆయ్యారని తెలుస్తోంది. హోంశాఖ వర్గాల సమాచారం ప్రకారం.. సరిహద్దు వెంబడి బైక్ మీద లేదా అవసరమైతే కాలినడకన వెళ్లి బలమైన కంచెను ఏర్పాటు చేయాలని ఆదేశాలు వచ్చాయి. సరిహద్దు రాష్ట్రాల భాగస్వామ్యంతో ఐబీ, సీబీఐ, కస్టమ్స్ అధికారులతో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి చట్టవ్యతిరేక కార్యకలాపాలను పూర్తిగా నిరోధించే చర్యకు ప్రభుత్వం ఉపక్రమించింది.
మరోవైపు పంజాబ్‌లోకి పాక్ పెద్దెత్తున మాదకద్రవ్యాలు అక్రమంగా సరఫరా చేస్తుంది. ఐఎస్‌ఐ ప్రేరేపిత ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని స్థానికంగా రెచ్చగొడుతోంది. అంతేకాక, ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఏమాత్రం బాలేదు. ఆ దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, జీహాదీ ఉగ్రవాదం, భయంకర ఆర్థిక ఇబ్బందుల దృష్యా సరిహద్దుల్లోనూ, దేశంలోనూ తీవ్ర అలజడి సృష్టించే అవకాశాలున్నట్టు నిఘా వర్గాలు సమాచారమందించాయి. ఈ నేపథ్యంలో సీబీఐ, రా, ఎన్‌ఏఐ, ఇంటెలిజెన్స్, కౌంటర్ టెర్రరిజం, పంజాబ్ పోలీసులతో స్పెషల్ కౌంటర్ గ్రూపును ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో గతంలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో అక్కడ ఎస్పీజీ కమాండో యూనిట్‌ను నెలకొల్పాలని అమిత్‌షా భావిస్తున్నారు. పాకిస్తాన్లోని నరోవర్ జిల్లాలో సరిహద్దు వెంబడి ఐఎస్‌ఐ ప్రేరేపిత ఉగ్రవాదుల క్యాంపును గుర్తించామని బీఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం కూడా దీనికి కారణం అయ్యింది. ఉగ్రదాడులను ఎస్పీజీ బలగాలు సమర్థంగా ఎదుర్కొంటాయి.
Comments
Please login to add a commentAdd a comment