ఝంఝార్‌పూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరోసారి అధికారం ఇవ్వకుంటే బిహార్‌లోని సరిహద్దులకు సమీపంలోని ప్రాంతాలు అక్రమ చొరబాటుదార్లతో నిండిపోతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించారు. బిహార్‌లో ఝంఝార్‌పూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
బిహార్‌లోని ఈ ప్రాంతం నేపాల్, బంగ్లాదేశ్‌ల సరిహద్దులకు సమీపంలో ఉంటుంది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దుతోపాటు వచ్చే ఏడాది జనవరికల్లా అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తి చేయనున్న ప్రధాని మోదీపై ఆయన ప్రశంసలు కురిపించారు.
లాలూ– నితీశ్ ద్వయం మళ్లీ అధికారంలోకి వచ్చినా, ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టలేకపోయినా ఈ ప్రాంతం మొత్తం అక్రమ చొరబాటుదార్లతో కిక్కిరిసి పోవడం ఖాయమన్నారు. ఫలితంగా బిహార్‌ను అనేక సమస్యలు చుట్టుముడతాయని ఆయన హెచ్చరించారు. చొరబాటుదార్లతో ఈ ప్రాంతం నిండిపోవాలని మీరు అనుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగానే 2024 లోనూ బిహార్‌లోని మొత్తం 40 సీట్లను బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
యూపీఏ బదులు..ఇండియా ఎందుకంటే..
యూపీఏ హయాంలో 12 లక్షల కోట్ల కుంభకోణంతో సంబంధాలున్నాయి కాబట్టే అప్పటి పార్టీలన్నీ కలిసి ఈసారి ఇండియా అనే కొత్త పేరు పెట్టుకున్నాయని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఆ కూటమి నేతలు సనాతన ధర్మాన్ని చులకన చేసి మాట్లాడటాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రధాని పీఠంపై ఆశలు పెట్టుకున్న నితీశ్ కుమార్ గతంలో లాలూ ప్రసాద్ పాల్పడిన కుంభకోణాలను చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారని ఆరోపించారు. అయితే, ప్రధాని పదవి ఖాళీగా లేదన్న విషయం నితీశ్ గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.
లాలూతో నితీశ్ పొత్తు నీళ్లు, చమురు కలయిక చందంగా ఉంటుందన్నారు. నీళ్లతో చమురు కలియకపోగా నీళ్లన్నిటినీ కలుషితం చేస్తుందని అమిత్ షా వ్యాఖ్యానించారు. ప్రధాని కావడమెలాగని నితీశ్ ఆలోచిస్తుండగా లాలూ మాత్రం తన కొడుకు, డిప్యూటీ సీఎం తేజస్వీని సీఎంగా చూడాలని ప్రణాళికలు వేస్తున్నారని చెప్పారు. సీఎం నితీశ్ కుమార్, ఆర్‌జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ కలిసి ప్రభుత్వ స్కూళ్లకు సెలవులు తగ్గించడం వంటి బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నా రని ఆరోపించారు.
రాష్ట్రంలోని సంకీర్ణ కూటమిలోని కాంగ్రెస్ కూడా ఇదే వైఖరితో ఉందన్నారు. కృష్ణాష్టమి, రక్షాబంధన్ సందర్భంగా సెలవులను రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వును రద్దు చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చిన బిహార్ ప్రజలకు అమిత్ షా అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులు సమ్మె చేయడంతో ఏడాదిలో అవసరమైనన్ని రోజులు తరగతులు నిర్వహించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన కొత్త క్యాలెండర్‌ను విద్యాశాఖ ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment