న్యూఢిల్లీ: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) తీసుకొచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందని హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. అయితే, అన్ని రకాల ప్రజాస్వామిర ప్రక్రియలను అనురించడంతోపాటు సంప్రదింపుల తర్వాతే తీసుకొస్తామని తేల్చిచెప్పారు. ఆయన గురువారం ఢిల్లీలో ‘టైమ్స్ నౌ’ సదస్సులో ప్రసంగించారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీడీ) ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కులతత్వం, వారసత్వం, బుజ్జగింపు వంటి జాడ్యాల నుంచి దేశ రాజకీయాలకు విముక్తి కలిగించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని అమిత్ షా ప్రశంసల వర్షం కురిపించారు. కేవలం పుట్టుక, కులం, ఇతరులను బుజ్జగించే తత్వం ఆధారంగా ఎన్నికల్లో నెగ్గే రోజులు పోయాయని స్పష్టం చేశారు.
మతం ఆధారంగా చట్టాలా?
బీజేపీ భారతీయ జనసంఘ్‌గా ఉన్నప్పటి నుంచే ఉమ్మడి పౌరస్మృతిపై దేశ ప్రజలకు హామీ ఇచ్చిందని అమిత్ షా గుర్తుచేశారు. బీజేపీ మాత్రమే కాదు రాజ్యాంగ సభ కూడా సరైన సమయంలో యూసీసీని తీసుకురావాలని పార్లమెంట్‌కు, రాష్ట్రాలకు సూచించిందని వెల్లడించారు. ప్రజాస్వామ్య దేశంలో చట్టాలు అనేవి మతం ఆధారంగా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ లేదా రాష్ట్రాల అసెంబ్లీలో ఆమోదించిన ఒకే ఒక ఉమ్మడి చట్టం ఉండాలని చాలామంది కోరుకుంటున్నారని చెప్పారు. దేశంలో బీజేపీ తప్ప ఇతర పార్టీలేవీ ఉమ్మడి పౌరస్మృతి పట్ల అనుకూలంగా లేవని అమిత్ షా పేర్కొన్నారు. దానిపై కనీసం మాట్లాడడం లేదన్నారు. మాట్లాడే ధైర్యం లేకపోతే వ్యతిరేకించవద్దని హితవు పలికారు. ‘మీరు అమలు చేస్తే మేము మీ వెంటనే ఉంటాం’ అని కూడా ప్రతిపక్షాలు చెప్పడం లేదని ఆక్షేపించారు. ఉమ్మడి పౌరస్మృతిపై ఆరోగ్యకరమైన, బహిరంగ చర్చ జరగాలని ఆయన అన్నారు.
ఉమ్మడి పౌరస్మృతి అంటే..
ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) గురించి భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో ప్రస్తావించారు. ఈ పౌరస్మృతిపై చట్టాలు చేసే అధికారం రాష్ట్రాల శాసన సభలకు కూడా ఉంది. ప్రస్తుతం గోవాలో యూసీసీ అమలవుతోంది. యూసీసీకి మరో అర్థం.. ఒకే దేశం, ఒకే చట్టం. మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలు, వ్యక్తిగత నమ్మకాలు, విశ్వాసాలతో సంబంధం లేకుండా దేశంలోని పౌరులందరికీ సమానంగా వర్తించే ఒకే చట్టమే ఉమ్మడి పౌరస్మృతి. భారత్‌లో వేర్వేరు మతస్తులకు, జాతులకు వారి మతగ్రంథాలు, అందులోని బోధనల ఆధారంగా వేర్వేరు వ్యక్తిగత(పర్సనల్) చట్టాలు అమల్లో ఉన్నాయి. ఉదాహరణకు ఓ వర్గం పురుషులు ఒక్కరి కంటే ఎక్కువ మంది మహిళలను వివాహం చేసుకోవచ్చు. అందుకు వారి ‘పర్సనల్ లా’ అనుమతిస్తుంది. మరో మతంలో అలాంటి వివాహాలకు అనుమతి లేదు. ఉమ్మడి పౌరస్మృతిపై దేశంలో కొన్ని దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. ప్రధానంగా వామపక్షాలు, ఇస్లామిక్ సంస్థలు, కొన్ని జాతులు, తెగలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
Times Now Sumit 2022: ఉమ్మడి పౌరస్మృతికి కట్టుబడి ఉన్నాం
Published Fri, Nov 25 2022 5:11 AM | Last Updated on Fri, Nov 25 2022 5:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment