Times Now program
-
కొలీజియం పరాయి వ్యవస్థ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం ఉద్దేశించిన కొలీజియం వ్యవస్థపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు మరోసారి విమర్శలు గుప్పించారు. అది మన రాజ్యాంగానికి పరాయి వ్యవస్థ అన్నారు. 1991 కంటే ముందు న్యాయమూర్తులను ప్రభుత్వమే నియమించేదని గుర్తుచేశారు. కొలీజియం వ్యవస్థను తీర్పు ద్వారా సుప్రీంకోర్టే సృష్టించుకుందని శుక్రవారం ఢిల్లీలో ‘టైమ్స్ నౌ’ సదస్సులో ఆయనన్నారు. రాజ్యాంగం దేశంలో అందరికీ, ముఖ్యంగా ప్రభుత్వానికి మత గ్రంథం వంటిదే. కోర్టులు, కొందరు న్యాయమూర్తులు తీసుకున్న నిర్ణయానికి మొత్తం దేశం మద్దతున్నట్టు ఎలా భావిస్తాం? కొలీజియం వ్యవస్థను ఏ నియమం కింద నిర్వచిస్తారో చెప్పాలి. అయితే జడ్జీల నియామకానికి మరో ఉత్తమ వ్యవస్థ అందుబాటులోకి వచ్చేదాకా కొలీజియంను ప్రభుత్వం గౌరవిస్తూనే ఉంటుంది’’ అన్నారు. ఆ ఉత్తమమైన వ్యవస్థ ఏమిటన్న దానిపై తాను చర్చించలేనన్నారు. -
Times Now Sumit 2022: ఉమ్మడి పౌరస్మృతికి కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) తీసుకొచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందని హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. అయితే, అన్ని రకాల ప్రజాస్వామిర ప్రక్రియలను అనురించడంతోపాటు సంప్రదింపుల తర్వాతే తీసుకొస్తామని తేల్చిచెప్పారు. ఆయన గురువారం ఢిల్లీలో ‘టైమ్స్ నౌ’ సదస్సులో ప్రసంగించారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీడీ) ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కులతత్వం, వారసత్వం, బుజ్జగింపు వంటి జాడ్యాల నుంచి దేశ రాజకీయాలకు విముక్తి కలిగించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని అమిత్ షా ప్రశంసల వర్షం కురిపించారు. కేవలం పుట్టుక, కులం, ఇతరులను బుజ్జగించే తత్వం ఆధారంగా ఎన్నికల్లో నెగ్గే రోజులు పోయాయని స్పష్టం చేశారు. మతం ఆధారంగా చట్టాలా? బీజేపీ భారతీయ జనసంఘ్‌గా ఉన్నప్పటి నుంచే ఉమ్మడి పౌరస్మృతిపై దేశ ప్రజలకు హామీ ఇచ్చిందని అమిత్ షా గుర్తుచేశారు. బీజేపీ మాత్రమే కాదు రాజ్యాంగ సభ కూడా సరైన సమయంలో యూసీసీని తీసుకురావాలని పార్లమెంట్‌కు, రాష్ట్రాలకు సూచించిందని వెల్లడించారు. ప్రజాస్వామ్య దేశంలో చట్టాలు అనేవి మతం ఆధారంగా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ లేదా రాష్ట్రాల అసెంబ్లీలో ఆమోదించిన ఒకే ఒక ఉమ్మడి చట్టం ఉండాలని చాలామంది కోరుకుంటున్నారని చెప్పారు. దేశంలో బీజేపీ తప్ప ఇతర పార్టీలేవీ ఉమ్మడి పౌరస్మృతి పట్ల అనుకూలంగా లేవని అమిత్ షా పేర్కొన్నారు. దానిపై కనీసం మాట్లాడడం లేదన్నారు. మాట్లాడే ధైర్యం లేకపోతే వ్యతిరేకించవద్దని హితవు పలికారు. ‘మీరు అమలు చేస్తే మేము మీ వెంటనే ఉంటాం’ అని కూడా ప్రతిపక్షాలు చెప్పడం లేదని ఆక్షేపించారు. ఉమ్మడి పౌరస్మృతిపై ఆరోగ్యకరమైన, బహిరంగ చర్చ జరగాలని ఆయన అన్నారు. ఉమ్మడి పౌరస్మృతి అంటే.. ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) గురించి భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో ప్రస్తావించారు. ఈ పౌరస్మృతిపై చట్టాలు చేసే అధికారం రాష్ట్రాల శాసన సభలకు కూడా ఉంది. ప్రస్తుతం గోవాలో యూసీసీ అమలవుతోంది. యూసీసీకి మరో అర్థం.. ఒకే దేశం, ఒకే చట్టం. మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలు, వ్యక్తిగత నమ్మకాలు, విశ్వాసాలతో సంబంధం లేకుండా దేశంలోని పౌరులందరికీ సమానంగా వర్తించే ఒకే చట్టమే ఉమ్మడి పౌరస్మృతి. భారత్‌లో వేర్వేరు మతస్తులకు, జాతులకు వారి మతగ్రంథాలు, అందులోని బోధనల ఆధారంగా వేర్వేరు వ్యక్తిగత(పర్సనల్) చట్టాలు అమల్లో ఉన్నాయి. ఉదాహరణకు ఓ వర్గం పురుషులు ఒక్కరి కంటే ఎక్కువ మంది మహిళలను వివాహం చేసుకోవచ్చు. అందుకు వారి ‘పర్సనల్ లా’ అనుమతిస్తుంది. మరో మతంలో అలాంటి వివాహాలకు అనుమతి లేదు. ఉమ్మడి పౌరస్మృతిపై దేశంలో కొన్ని దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. ప్రధానంగా వామపక్షాలు, ఇస్లామిక్ సంస్థలు, కొన్ని జాతులు, తెగలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. -
‘భవిష్యత్తులో ప్రత్యామ్నాయ కూటమికి అవకాశం’
న్యూఢిల్లీ: దేశంలో ఉన్న పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీలే అని.. దేశవ్యాప్తంగా ఉనికి, యంత్రాంగం ఉన్న జాతీయ పార్టీలంటూ ఏవి లేవని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు సైతం పెద్దసైజు ప్రాంతీయ పార్టీలని కేటిఆర్ తెలిపారు. ఢిల్లీలో టైమ్స్ నౌ యాక్షన్ ప్లాన్ - 2020 సమ్మిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘దేశ నిర్మాణంలో రాష్ట్రాల పాత్ర’ అనే అంశంపై చర్చా గోష్టిలో గురువారం ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య మాత్రమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. బలమైన రాష్ట్రాలు ఉన్నప్పుడే బలమైన దేశం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎన్ని ఉన్నా.. వాటి ఆచరణ అంతా రాష్ట్రాల్లోనే ఉందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల అమలును సైతం రాష్ట్ర ప్రభుత్వాలే చేయాల్సి ఉంటుందని వివరించారు. ‘మేకిన్ ఇండియా’ లాంటి కార్యక్రమాల్లోనూ రాష్ట్రాల అనుమతులు, రాష్ట్ర ప్రభుత్వ శాఖల సహకారం వంటి అంశాలు కీలకంగా ఉంటాయని ఆయన చెప్పారు. ( పెట్టుబడులతో మరిన్ని కంపెనీలొస్తున్నాయి) కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలకు తమ సొంత నిధులు ఇస్తున్నామన్న ఆలోచన మంచిది కాదని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి నిధులు సమకూరుస్తున్న విషయాన్ని మరువకూడదని హితవు పలికారు. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల 72 వేల కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నుల రూపంలో ఇస్తే.. తిరిగి రాష్ట్రానికి కేంద్రం లక్షా 12 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ లాంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు కేంద్రానికి చెల్లిస్తున్న పన్నులతో పోల్చుకుంటే.. కేంద్రం అన్ని నిధులను రాష్ట్రానికి తిరిగి ఇవ్వలేదని గుర్తుంచుకోవాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను శత్రువులుగా భావించడం లేదన్నారు. కేవలం రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే భావించి ఎన్నికల్లో పోరాటం చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. తమ వాదన, భావాజాలనికి వ్యతిరేకంగా నిలిచి ఉన్నంత మాత్రాన కేంద్రంలో ఉన్న ప్రభుత్వం.. రాష్ట్రాలను, ఇతర పార్టీలను శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యలను అంశాల వారీగా మద్దతిచ్చిన తాము ప్రజా వ్యతిరేకమైన అసంబద్ధమైన చర్యలను అదేవిధంగా వ్యతిరేకించామని కేటీఆర్ గుర్తు చేశారు. డిమానిటైజేషన్ ద్వారా దేశానికి మంచి జరుగుతుందని.. సంపూర్ణ క్రాంతి వస్తుందని అన్న ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం మాటలను నమ్మి మద్దతు ఇచ్చామని కేటీఆర్ వెల్లడించారు. కానీ డిమానిటైజేషన్ ద్వారా దేశానికి నష్టం జరిగిన విషయం తేలిసిన తర్వాత తమ నిర్ణయం తప్పని తేలిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం.. టిఆర్ఎస్ మరో పార్టీకి టీం అని విమర్శిస్తున్నాయి. కానీ తమది తెలంగాణ ప్రజల పార్టీ అని స్పష్టం చేశారు. గత కొంత కాలంగా జరుగుతున్న ప్రతి ఎన్నికల్లోనూ ప్రాంతీయ పార్టీలే బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతూ వస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. రానున్న భవిష్యత్తులో కచ్చితంగా ప్రత్యామ్నాయ కూటమికి అవకాశాలు ఏర్పడుతున్నాయని ఆయన తెలిపారు. రెండు జాతీయ పార్టీలు దేశాన్ని ఇప్పటికే నిరాశ పరిచాయని.. ఆర్థిక అభివృద్ధి, మౌలిక వసతుల సదుపాయాల కల్పన, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన వంటి అంశాల్లో దేశ ప్రజల ఆకాంక్షలను అందుకోలేకపోయాయని అన్నారు. ఈ విషయాన్ని దేశ ప్రజలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారని ఆయన చెప్పారు. సీఏఏను పార్లమెంట్లో తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందని కేటీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి ఇలాంటి వివాదాస్పద చట్టాల బదులు దృష్టి పెట్టాల్సిన అతి ప్రాధాన్యత కలిగిన ఇతర అంశాలు ఉన్నాయని గుర్తు చేశారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఉండటమే తమ పార్టీ అభిప్రాయని ఆయన స్పష్టం చేశారు. గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరాన్ని జీవించడానికి అవకాశం ఉన్న అత్యుత్తమ నగరాల్లో అగ్ర స్థానం కల్పిస్తూ వస్తుందని కేటీఆర్ చెప్పారు. భారతదేశానికి రెండవ జాతీయ రాజధానిగా ప్రకటించాల్సి వస్తే.. హైదరాబాద్ ప్రజలు అంగీకరిస్తారో లేదో అనే విషయంలో తనకు అనుమానం ఉందన్నారు. కోపరేటివ్ ఫెడరలిజం, టీమ్ ఇండియా వంటి మాటలు చెప్పే ప్రధానమంత్రి.. ఆ భావనల స్ఫూర్తి ఆధారంగా పని చేయాలని కోరుకుంటున్నామని కేటీఆర్ అన్నారు. నీతి అయోగ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా సహకరించాలని అనేక సూచనలు చేసినా.. ఇప్పటి దాకా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాలేశ్వరం ప్రాజెక్టు వంటి వాటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు, ఎఫ్ఆర్బీఎం పరిమితులు వంటి అంశాల్లో మరింత లిబరల్గా ఉండాల్సిన అవసరం ఉందని కేటీఆర్ గుర్తు చేశారు. -
చరిత్రను మార్చేది వారే
‘టైమ్స్‌నౌ’ కార్యక్రమంలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: రాజకుటుంబాలకు, పాలకులకు ప్రత్యేక శ్రద్ధ చూపటం పట్ల ప్రధాని మోదీ విచారం వ్యక్తంచేశారు. అది దేశాన్ని బానిస సంకెళ్లలో ఉంచేందుకు జరుగుతున్న ఉద్దేశపూర్వక కుట్రగా అభివర్ణించారు. చిన్న వారుగా పరిగణించే వాళ్లు సైతం చరిత్రను మార్చగలరన్నారు. కష్టాలు, సవాళ్లను అధిగమించి సమాజానికి ప్రత్యేక సేవ చేసిన వారికి ప్రధాని మోదీ గురువారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘టైమ్స్ నౌ’ వార్తా చానల్ ‘అద్భుత ఇండియన్లు’ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డులు పొందిన వారిలో ఎవరెస్టును అధిరోహించిన తెలుగమ్మాయి మలావత్ పూర్ణ ఉన్నారు. మోదీ మాట్లాడుతూ.. ‘‘గొప్ప పనులు చేయాలంటే అందుకు అనుకూలమైన వాతావరణం ఉంటేనే చేయగలమని కొందరు భావిస్తుంటే.. పట్టుదల గల వాళ్లు ఎన్నో కష్టాలను అధిగమించి గొప్ప పనులు సాధిస్తారు. గత 200-250 ఏళ్లుగా రాజకుటుంబాలు, పాలకులపై ప్రత్యేక శ్రద్ధ చూపటం మన దేశ దురదృష్టం. వారికి సంబంధించిన అంశాల గురించి మాత్రమే మాట్లాడటం, రాయటం జరిగింది. దేశం స్వాతంత్య్రం సాధించిన తర్వాతా అటువంటి పరిస్థితి కొనసాగింది. చిన్న వాళ్లు చరిత్రను మార్చగలరు. దీనిని సమాజం అర్థం చేసుకోవాలి. ఇది ఇతరులకు ఒక స్ఫూర్తి’’ అని పేర్కొన్నారు. ఎందరి జీవితాలనో రూపుదిద్దే ఏ ఉపాధ్యాయుడు / ఉపాధ్యాయురాలి పేరునూ ఏ వీధికి గానీ, కూడలికి గానీ పెట్టలేదని.. కానీ ఒక కార్పొరేటర్ పేరును సైతం పెట్టేస్తుంటారని వ్యాఖ్యానించారు. తక్కువ వాళ్లుగా పరిగణించే వాళ్లు సమాజానికి ఎక్కువ సేవ చేస్తుంటారని.. దానిని మరచిపోరాదని పేర్కొన్నారు.