‘భవిష్యత్తులో ప్రత్యామ్నాయ కూటమికి అవకాశం’ | KTR Speech In Times Now Action Plan 2020 At Delhi | Sakshi
Sakshi News home page

‘రాష్ట్రాలను శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదు’

Published Thu, Feb 13 2020 2:27 PM | Last Updated on Thu, Feb 13 2020 2:34 PM

KTR Speech In Times Now Action Plan 2020 At Delhi - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ఉన్న పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీలే అని.. దేశవ్యాప్తంగా ఉనికి, యంత్రాంగం ఉన్న జాతీయ పార్టీలంటూ ఏవి లేవని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు సైతం పెద్దసైజు ప్రాంతీయ పార్టీలని కేటిఆర్‌ తెలిపారు. ఢిల్లీలో టైమ్స్‌ నౌ యాక్షన్ ప్లాన్ - 2020 సమ్మిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘దేశ నిర్మాణంలో రాష్ట్రాల పాత్ర’ అనే అంశంపై చర్చా గోష్టిలో గురువారం ఆయన  పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య మాత్రమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.  బలమైన రాష్ట్రాలు ఉన్నప్పుడే బలమైన దేశం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎన్ని ఉన్నా.. వాటి ఆచరణ అంతా రాష్ట్రాల్లోనే  ఉందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల అమలును సైతం రాష్ట్ర ప్రభుత్వాలే చేయాల్సి ఉంటుందని వివరించారు. ‘మేకిన్ ఇండియా’  లాంటి కార్యక్రమాల్లోనూ రాష్ట్రాల అనుమతులు, రాష్ట్ర ప్రభుత్వ శాఖల సహకారం వంటి అంశాలు కీలకంగా ఉంటాయని ఆయన చెప్పారు. ( పెట్టుబడులతో మరిన్ని కంపెనీలొస్తున్నాయి)

కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలకు తమ సొంత నిధులు  ఇస్తున్నామన్న ఆలోచన మంచిది కాదని కేటీఆర్‌ పేర్కొన్నారు.  రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి నిధులు సమకూరుస్తున్న విషయాన్ని మరువకూడదని హితవు పలికారు. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల 72 వేల కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నుల రూపంలో ఇస్తే.. తిరిగి రాష్ట్రానికి కేంద్రం లక్షా 12 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ లాంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు కేంద్రానికి చెల్లిస్తున్న పన్నులతో పోల్చుకుంటే.. కేంద్రం  అన్ని నిధులను రాష్ట్రానికి తిరిగి ఇవ్వలేదని గుర్తుంచుకోవాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను శత్రువులుగా భావించడం లేదన్నారు.  కేవలం రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే భావించి ఎన్నికల్లో పోరాటం చేస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు.  తమ వాదన, భావాజాలనికి వ్యతిరేకంగా నిలిచి ఉన్నంత మాత్రాన కేంద్రంలో ఉన్న ప్రభుత్వం.. రాష్ట్రాలను, ఇతర పార్టీలను శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యలను అంశాల వారీగా మద్దతిచ్చిన తాము ప్రజా వ్యతిరేకమైన అసంబద్ధమైన చర్యలను అదేవిధంగా వ్యతిరేకించామని కేటీఆర్‌ గుర్తు చేశారు. 

డిమానిటైజేషన్ ద్వారా దేశానికి మంచి జరుగుతుందని.. సంపూర్ణ క్రాంతి వస్తుందని అన్న ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం మాటలను నమ్మి మద్దతు ఇచ్చామని కేటీఆర్‌ వెల్లడించారు. కానీ డిమానిటైజేషన్ ద్వారా దేశానికి నష్టం జరిగిన విషయం తేలిసిన తర్వాత తమ నిర్ణయం తప్పని తేలిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పరస్పరం.. టిఆర్ఎస్ మరో పార్టీకి టీం అని విమర్శిస్తున్నాయి. కానీ తమది తెలంగాణ ప్రజల పార్టీ అని స్పష్టం చేశారు. గత కొంత కాలంగా జరుగుతున్న ప్రతి ఎన్నికల్లోనూ ప్రాంతీయ పార్టీలే బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతూ వస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. రానున్న భవిష్యత్తులో కచ్చితంగా ప్రత్యామ్నాయ కూటమికి అవకాశాలు ఏర్పడుతున్నాయని ఆయన తెలిపారు.

రెండు జాతీయ పార్టీలు దేశాన్ని ఇప్పటికే నిరాశ పరిచాయని.. ఆర్థిక అభివృద్ధి, మౌలిక వసతుల సదుపాయాల కల్పన, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన వంటి అంశాల్లో దేశ ప్రజల ఆకాంక్షలను అందుకోలేకపోయాయని అన్నారు.  ఈ విషయాన్ని దేశ ప్రజలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారని ఆయన చెప్పారు.  సీఏఏను పార్లమెంట్‌లో తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందని కేటీఆర్‌ చెప్పారు.  కేంద్ర ప్రభుత్వానికి ఇలాంటి వివాదాస్పద చట్టాల బదులు దృష్టి పెట్టాల్సిన అతి ప్రాధాన్యత కలిగిన  ఇతర అంశాలు ఉన్నాయని గుర్తు చేశారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఉండటమే తమ పార్టీ అభిప్రాయని ఆయన స్పష్టం చేశారు. గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరాన్ని జీవించడానికి అవకాశం ఉన్న అత్యుత్తమ నగరాల్లో అగ్ర స్థానం కల్పిస్తూ వస్తుందని కేటీఆర్‌ చెప్పారు. భారతదేశానికి రెండవ జాతీయ రాజధానిగా ప్రకటించాల్సి వస్తే.. హైదరాబాద్ ప్రజలు అంగీకరిస్తారో లేదో అనే విషయంలో తనకు అనుమానం ఉందన్నారు.

కోపరేటివ్ ఫెడరలిజం, టీమ్ ఇండియా వంటి మాటలు చెప్పే ప్రధానమంత్రి.. ఆ భావనల స్ఫూర్తి ఆధారంగా పని చేయాలని కోరుకుంటున్నామని కేటీఆర్‌ అన్నారు. నీతి అయోగ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా సహకరించాలని అనేక సూచనలు చేసినా.. ఇప్పటి దాకా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాలేశ్వరం ప్రాజెక్టు వంటి వాటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు, ఎఫ్ఆర్బీఎం పరిమితులు వంటి అంశాల్లో మరింత లిబరల్‌గా ఉండాల్సిన అవసరం ఉందని కేటీఆర్‌ గుర్తు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement