చరిత్రను మార్చేది వారే
‘టైమ్స్‌నౌ’ కార్యక్రమంలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: రాజకుటుంబాలకు, పాలకులకు ప్రత్యేక శ్రద్ధ చూపటం పట్ల ప్రధాని మోదీ విచారం వ్యక్తంచేశారు. అది దేశాన్ని బానిస సంకెళ్లలో ఉంచేందుకు జరుగుతున్న ఉద్దేశపూర్వక కుట్రగా అభివర్ణించారు. చిన్న వారుగా పరిగణించే వాళ్లు సైతం చరిత్రను మార్చగలరన్నారు. కష్టాలు, సవాళ్లను అధిగమించి సమాజానికి ప్రత్యేక సేవ చేసిన వారికి ప్రధాని మోదీ గురువారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘టైమ్స్ నౌ’ వార్తా చానల్ ‘అద్భుత ఇండియన్లు’ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డులు పొందిన వారిలో ఎవరెస్టును అధిరోహించిన తెలుగమ్మాయి మలావత్ పూర్ణ ఉన్నారు.
మోదీ మాట్లాడుతూ.. ‘‘గొప్ప పనులు చేయాలంటే అందుకు అనుకూలమైన వాతావరణం ఉంటేనే చేయగలమని కొందరు భావిస్తుంటే.. పట్టుదల గల వాళ్లు ఎన్నో కష్టాలను అధిగమించి గొప్ప పనులు సాధిస్తారు. గత 200-250 ఏళ్లుగా రాజకుటుంబాలు, పాలకులపై ప్రత్యేక శ్రద్ధ చూపటం మన దేశ దురదృష్టం. వారికి సంబంధించిన అంశాల గురించి మాత్రమే మాట్లాడటం, రాయటం జరిగింది. దేశం స్వాతంత్య్రం సాధించిన తర్వాతా అటువంటి పరిస్థితి కొనసాగింది. చిన్న వాళ్లు చరిత్రను మార్చగలరు.
దీనిని సమాజం అర్థం చేసుకోవాలి. ఇది ఇతరులకు ఒక స్ఫూర్తి’’ అని పేర్కొన్నారు. ఎందరి జీవితాలనో రూపుదిద్దే ఏ ఉపాధ్యాయుడు / ఉపాధ్యాయురాలి పేరునూ ఏ వీధికి గానీ, కూడలికి గానీ పెట్టలేదని.. కానీ ఒక కార్పొరేటర్ పేరును సైతం పెట్టేస్తుంటారని వ్యాఖ్యానించారు. తక్కువ వాళ్లుగా పరిగణించే వాళ్లు సమాజానికి ఎక్కువ సేవ చేస్తుంటారని.. దానిని మరచిపోరాదని పేర్కొన్నారు.