Malavath purna
-
అవకాశాలు కల్పిస్తే ఏదైనా సాధిస్తాం
మాదాపూర్(హైదరాబాద్): అవకాశాలు కల్పిస్తే మహిళలు ఏదైనా సాధించగలరని, అందుకు తానే చక్కటి ఉదాహరణ అని మాలావత్ పూర్ణ అన్నారు. తాజాగా నార్త్ అమెరికాలోని మౌంట్ డెనాలి ఆరోహించి.. ఏడు శిఖరాలను అధిరోహించిన అతి చిన్న వయసు భారతీయ మహిళగా, తొలి దక్షిణ భారతీయురాలిగా పూర్ణ రికార్డులు సృష్టించారు.ఈ సందర్భంగా మాదాపూర్‌లోని హోటల్ ఆవాసాలో అమె మీడియాతో ముచ్చటించారు. 35–40 కేజీల బరువుతో... ‘‘ఏడు పర్వతాలు అధిరోహించడం ఆనందంగా ఉంది. నార్త్ అమెరికాలోని డెనాలి పర్వత (6,190 మీటర్ల ఎత్తు గల) శిఖరాన్ని చేరుకోవడానికి ఎంతో కసరత్తు చేయాల్సి వచ్చింది. మిగిలిన పర్వతాలకు సహాయకులు, గైడ్లు, పోర్టర్లు అందుబాటులో ఉంటారు. కానీ ఈపర్వతానికి అలాంటి అవకాశం లేదు. దాదాపు 35 నుంచి 40 కేజీల జరువుగల 25 రోజులకు సరిపడా ఆహారాన్ని, సామగ్రిని మేమే తీసుకెళ్లాం. జూన్ 5వ తేదీన డెనాలి పర్వతాన్ని అధిరోహించాం. ‘ట్రాన్సెండ్ అడ్వెంచర్స్’ ద్వారా 7–సమ్మిట్స్ పూర్తి చేశాను. ఈ యాత్రకు ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ వాళ్లు స్పాన్సర్ చేశారు. కోచ్ శేఖర్‌బాబు, ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ చైర్మన్ వైవీ గోపాల కృష్ణమూర్తి, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బూక్యా శోభన్‌బాబుల ప్రోత్సాహం మరువలేనిది’’ అని పూర్ణ తెలిపారు. 7–సమ్మిట్స్ పూర్తి చేసి హైదరాబాద్ వచ్చిన పూర్ణను ఏస్ ఇంజనీరింగ్ అకాడమీవారు సన్మానించారు. అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ వైవీ గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ పిల్లల విజయాలకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరమన్నారు. ఓయూలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న పూర్ణ మరిన్ని శిఖరాలను అధిరోహించాలని, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. -
చరిత్ర సృష్టించిన మాలావత్ పూర్ణ.. మౌంట్ డెనాలి ఎక్కి ప్రపంచ రికార్డు
సాక్షి, నిజామాబాద్: మాలావత్ పూర్ణ అరుదైన ఘనత సాధించి మరోసారి చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో 7 ఎత్తైన శిఖరాలను అధిరోహించి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసింది. ఈ నెల 5న ఉత్తర అమెరికాలోని డెనాలి పర్వత శిఖరం (6,190 మీటర్లు/20,310 అడుగులు) అధిరోహించడంతో ప్రపంచస్థాయి 7–సమ్మిట్ చాలెంజ్‌ను పూర్తి చేసింది. ఈ ఘనత సాధించిన ‘యంగెస్ట్ ఫిమేల్ ఇన్ ఇండియా’గా రికార్డు సృష్టించింది. పూర్ణ మే 18న ఇండియా నుంచి బయల్దేరి, మే 19న అలస్కాలోని ఎంకరేజ్ నగరానికి చేరుకుంది. ఈ పర్వతారోహణలో పూర్ణతోపాటు మనదేశం నుంచి మరో నలుగురు సభ్యులున్నారు. మే 23న బేస్ క్యాంప్‌కు చేరుకున్నవారు శిఖర అధిరోహణ ప్రారంభించి, ఈనెల 5న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆమె కోచ్ శేఖర్ బాబు ధ్రువీకరించారు. శిఖరం నుంచి కిందికి వస్తూ పూర్ణ శాటిలైట్ ఫోన్ ద్వారా ఈ సమాచారాన్ని పంచుకుంది. ఈ యాత్రకు స్పాన్సర్ చేసిన ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ వైవీ గోపాలకృష్ణమూర్తి, తన గురువు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఐపీఎస్(వీఆర్ఎస్), సహకరించిన హైదరాబాద్ బీఎస్బీ ఫౌండేషన్ చైర్మన్ భూక్యా శోభన్‌బాబులకు పూర్ణ కృతజ్ఞతలు తెలిపింది. పూర్ణ సాహస యాత్రకు హైదరాబాద్‌కు చెందిన ‘ట్రాన్సెండ్ అడ్వెంచర్స్’ సంస్థ తోడ్పాటునందించింది. ప్రపంచవ్యాప్తంగా ఆమె సాహస యాత్రలను నిర్వహించేందుకు అవసరమైన లైసెన్స్‌లు ఇప్పించి, 7–సమ్మిట్స్ చాలెంజ్‌ను పూర్తి చేయడంలోనూ కీలకపాత్ర పోషించింది. దెనాలి పర్వతారోహణలో పూర్ణతోపాటు అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో పద్మశ్రీ అవార్డు గ్రహీత అజీత్ బజాజ్, ఆయన కుమార్తె దియా బజాజ్, విశాఖపట్నానికి చెందిన అన్మిష్ వర్మ కూడా ఉన్నారు. దక్షిణభారత దేశం నుంచి తొలి యువతి.. కాగా, ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న పూర్ణ 2014లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ‘ప్రపంచంలోని అతి పిన్న వయస్కురాలు’గా చరిత్ర సృష్టించింది. ఆమె ఇప్పటివరకు ఎవరెస్ట్, ఆఫ్రికాలోని కిలిమంజారో, యూరప్‌లోని ఎల్బ్రస్, దక్షిణ అమెరికాలోని అకోన్‌కాగస్, ఓసెనియాలోని కార్టెన్జ్ పిరమిడ్, అంటార్కిటికాలోని విన్సన్, తాజాగా ఉత్తర అమెరికాలోని దెనాలి శిఖరాలను అధిరోహించింది. దక్షిణ భారతదేశం నుంచి ఈ 7–సమ్మిట్ ఘనతను సాధించిన మొదటి యువతి పూర్ణ కావడం విశేషం. పూర్ణ అధిరోహించిన పర్వతాలు: 1. ఎవరెస్టు (ఆసియా) 2. మౌంట్ కిలిమంజారో (ఆఫ్రికా) 3. మౌంట్ ఎల్బ్రస్ (యూరప్) 4. మౌంట్ అకోన్‌కగువా (దక్షిణ అమెరికా) 5. మౌంట్ కార్టెన్జ్ (ఓషియానియా) 6. మౌంట్ విన్సన్ (అంటార్కిటికా) 7. మౌంట్ డెనాలి (ఉత్తర అమెరికా) -
నా పాఠాన్ని నేనే చదివాను: మలావత్ పూర్ణ
ఆమె సంకల్పబలం శిఖరసమానం. ఆత్మవిశ్వాసంలో ఆమె ఎవరెస్ట్.. లక్ష్యసాధనలో ఆమెకు లేదు రెస్ట్. అందుకే ఆమె ది బెస్ట్.. సరిగ్గా ఐదడుగులు కూడా లేని ఆమె ముందు ప్రపంచంలోనే ఎత్తైన 29,028 అడుగుల పర్వతం తలవంచింది. ఆమె ఘనతను చూసి మహిళాలోకం సగర్వంగా తలెత్తుకొంది. ఆమే మలావత్ పూర్ణ. ఆమె పేరు మారుమూల పాకాల నుంచి ప్రపంచం నలుమూలలకూ పాకింది. ఆమె ప్రతిష్ట హిమాలయమంత ఎత్తు కు ఎదిగింది. యువతకు ఆమె ఇప్పుడు సం‘పూర్ణ’ప్రేరణ. సంకల్పబలముంటే సాధారణ మనిషైనా ఎంతో ఎత్తుకు ఎదగొచ్చని సాధికారికంగా నిరూపించిన ‘పూర్ణ’అంతరంగాన్ని ‘సాక్షి’మరోసారి ఆవిష్కరించింది. ఇక చదవండి. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ‘‘ఎవరెస్ట్ అధిరోహించిన తర్వాత నా గురించి ఒకటి, రెండు పేరాలు పదో తరగతి, ఇంటర్, డిగ్రీల్లో పాఠ్యాంశాలుగా చేర్చారు.. నా గురించి ఉన్న ఈ పాఠ్యాంశాలను నేనే చదువుకోవడం చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి అనుభూతి చాలా అరుదుగా ఎదురవుతుంది.. నా అచీవ్మెంట్పై తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో పుస్తకాలు వచ్చాయి.. తాజాగా మలయాళంలోనూ ఓ పుస్తకం వెలువడింది. నా గురించి ఏకంగా ఓ సినిమానే వచ్చింది.. ఈ సినిమా చూసి ఏ ఒక్క ఆడపిల్ల అయినా నన్ను ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేస్తే నాకు అదే సంతోషం’’అంటున్నారు ప్రపంచంలోనే అత్యం త ఎత్తైన శిఖరం ‘ఎవరెస్ట్’ను అధిరోహించిన అతిపిన్న వయస్కురాలిగా వరల్డ్ రికార్డు సాధించిన మలావత్ పూర్ణ. అమెరికాలో విద్యాభ్యాసం తర్వాత తన స్వగ్రామం పాకాల చేరుకున్న సందర్భంగా పూర్ణను ‘సాక్షి’ పలకరించింది. కుటుంబంతో మలావత్ పూర్ణ సాక్షి: ఎవరెస్ట్ అధిరోహించక ముందు ఎలా ఉండేవారు? మీ లక్ష్యాన్ని సాధించాక ఎలా ఉన్నారు? పూర్ణ: ‘‘రైట్ గైడెన్స్ ఫ్రం రైట్ పర్సన్’’ తొమ్మిదో తరగతిలో నేను ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన.. అంతకు ముందు ఇదే గ్రామం(పాకాల)లో బడికి పోతుండే.. పొలం పనుల్లో నాన్నకు సహాయం చేస్తుండే.. నాట్లు వేసేటప్పుడు వరినారు అందిస్తుండే.. అడవిలోకి వెళ్లి ఇప్పపువ్వు ఏరుతుంటిని.. మొర్రిపండ్లు సేకరిస్తుంటిమి.. అందరు పిల్లల్లాగే చదువుకోవడం, ఆడుకోవడం.. ఎవరెస్ట్ శిఖరం ఎక్కేటప్పుడు నా వయస్సు 13 సంవత్సరాల పదినెలలు. అతిపిన్న వయస్సులో ఈ శిఖరం ఎక్కిన రికార్డు నాకు దక్కింది. అంతకు ముందు 16 సంవత్సరాల వ్యక్తి పేరిట ఈ రికార్డు ఉంది. ఇది సాధించాక చాలా మార్పులు వచ్చాయి.. ప్రపం చం నావైపు చూసినట్లపించింది. అమెరికాలో చదువుకునే అవకాశం లభించింది. ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ సార్ మార్గదర్శకత్వంలో ముందడుగు వేశాను. రైట్ గైడెన్స్ ఫ్రం రైట్ పర్సన్.. ఉంటే ప్రతి ఆడపిల్లా ఉన్నతశిఖరాలను అందుకోవచ్చనేది నిరూపితమైనట్లు భావిస్తున్నా. సాక్షి: అమెరికాలో ఏం చదువుకున్నారు? పూర్ణ: ‘‘2017లో అమెరికా వెళ్లాను. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు యూఎస్ వెళ్లేందుకు అవకాశం వచ్చింది. యూఎస్ కాన్సలేట్ జనరల్ క్యాథరిన్ హెడ్డాను కలిసినప్పుడు అమెరికా రావాలని సూచించారు. అక్కడ ‘‘వరల్డ్ లెర్నింగ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం, ఎక్స్పీరియెన్షనల్ ఎడ్యుకేషన్’’ అనే కోర్సులు రెండు సెమిస్టర్లు చదివేందుకు వెళ్లాను. సంవత్సరంపాటు అమెరికాలో ఉన్నా.. లాక్డౌన్ సమయంలోనే అక్కడి నుంచి వచ్చాను. ప్రస్తుతం డిగ్రీ(బీఏ)లో రాయకుండా మిగిలిపోయిన పరీక్షలు రాస్తున్నాను. సాక్షి: మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటీ? పూర్ణ: ఇకపై పర్వతారోహణను నా జీవితంలో ఒక భాగం చేసుకుంటాను.. ప్రస్తుతం నా డిగ్రీ పూర్తవుతోంది. పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేద్దామని అనుకుంటున్నాను. ఐపీఎస్ సాధించి వేలాదిమందికి సేవ చేయాలని నిర్ణయించుకున్నా.. పీజీ అమెరికాలో చేయాలనే భావిస్తున్నా.. రెండెకరాలున్న వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. బీపీఎల్ కుటుంబం.. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఆర్థికసహాయం అందింది. ఇందల్వాయిలో ఐదెకరాల భూమి కేటాయించారు.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ట్రిపుల్ బెడ్రూం ఇంటి స్థలం కేటాయించారు.. ఇన్ఫోసిస్ అధినేత్రి సుధామూర్తి ఆర్థికంగా చేయూతనిచ్చారు. సాక్షి: పర్వతారోహణ విశేషాలు చెబుతారా? పూర్ణ: ‘‘లక్ష్యాన్ని చేరుకున్నాక.. నా ఆనందానికి అవధుల్లేవు.. కానీ, నా కాళ్లలో సత్తువ లేదు’’ఐదో తరగతి వరకు ఇదే గ్రామం (పాకాల)లో చదువుకున్నా.. తర్వాత తాడ్వాయి(కామారెడ్డి జిల్లా) సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకునేటప్పుడు పర్వతారోహణకు అవకాశం వచ్చింది. రాక్ కైయిమింగ్ శిక్షణ కోసం మొదట భువనగిరికి తీసుకెళ్లారు. ఆ కొండను చూస్తే భయమేసింది. మనిషన్నవారు ఈ కొండను ఎక్కగలరా అని తొలి అడుగు వేసేటప్పుడు అనిపించింది.. అక్కడ ఐదురోజులు శిక్షణ తీసుకున్న తర్వాత డార్జిలింగ్‌కు పంపారు. బేసిక్స్ అండ్ అడ్వాన్స్ మౌంటెనింగ్‌లో 25 రోజులపాటు శిక్షణ ఇచ్చారు. చుట్టూ కనుచూపు మేరల్లో అంతా మంచు. డార్జిలింగ్‌కు వెళ్లాక ఇదే కొత్త లోకం అని అనిపించింది.. ఆ పరిస్థితులు చూస్తే ఎలాగైనా ఎవరెస్ట్ ఎక్కాలని నిర్ణయించుకున్నాను. కఠినమైన శిక్షణ ఇచ్చారు. ఎవరెస్ట్ ఎక్కేందుకు ఇంత కఠోర శిక్షణ అవసరమా అని ప్రవీణ్ సార్‌ను అడిగాను.. కానీ, ఎవరెస్ట్ సమీపంలోకి వెళ్లేటప్పుడు అనిపించింది. అంత కంటే ఇంకా కఠోర శిక్షణ అవసరమని.. మరికొద్ది సమయంలోనే లక్ష్యాన్ని చేరుకుంటున్న తరుణంలో పర్వతాల్లో శవాలు కనిపించాయి.. వాటిని చూసి భయపడి వెనక్కి వెళితే.. ఇన్ని రోజులు పడిన శ్రమ అంతా వృథా అవుతుందనిపించింది.. ఎలాగైనా లక్ష్యమే నా కళ్ల ముందు మెదిలింది.. శక్తినంతా కూడగట్టుకుని లక్ష్యాన్ని చేరుకున్నా.. ఇక నా ఆనందానికి అవధుల్లేవు.. ఎగిరి గంతేయాలనిపించింది.. కానీ నా కాళ్లలో సత్తువ లేదు.. కూలబడిపోయాను.. కొన్ని నీళ్లు తాగాక.. వెళ్లి ఫొటోలు దిగాను’’ పాకాల.. చుట్టూ అడవి.. గుట్టల మధ్య కుగ్రామం.. ఇదో అత్యంత మారుమూల ప్రాంతం.. సిరికొండ మండలంలో ఉన్న ఈ గ్రామం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆర్టీసీ బస్సు కూడా రోజుకు ఒకటీ రెండు ట్రిప్పులకు మించి వెళ్లదు.. గ్రామంలో గిరిజనులే అధికం. గుట్టలకు ఆనుకుని నివాసాలు నిర్మించుకున్నారు.. అది చుట్టూ పచ్చని పొలాల మధ్య ఉంటుంది. విద్యార్థులకు చెబుతుంటాను ‘‘పాకాల బడిలో విద్యా వలంటీర్‌గా పనిచేస్తున్నా.. పాఠాలు చెబుతున్నప్పుడు పిల్లలకు తరచూ చెబుతుంటాను.. ‘మీరు మాలావత్ పూర్ణలాగా ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంతోపాటు, ఆ లక్ష్యసాధన కోసం కష్టపడాలని’ పూర్ణ చిన్నప్పుడు అందరు పిల్లల్లాగే ఆడుకునేది. ఆటల్లో కాస్త ఎక్కువ ఆసక్తి కనబరిచేది. కళ్ల ముందు తిరిగిన అమ్మాయి ఉన్నతస్థానానికి వెళ్లడం ఆనందంగా ఉంది’’ – కళావతి, ఉపాధ్యాయురాలు సరదాగా ఆడుకునేవాళ్లం ఐదో తరగతి వరకు కలసి ఇదే గ్రామం(పాకాల)లో చదువుకున్నాం.. అప్పుడు ఎంతో సరదాగా ఆడుకునేవాళ్లం.. పాఠశాలకు రెగ్యులర్‌గా వెళ్లేవాళ్లం.. మా స్నేహితురాలు ఎవరెస్ట్ ఎక్కిందని టీవీల్లో చూసినప్పుడు ఎంతో సంతోషంగా అనిపించింది. ఇప్పడు కూడా పూర్ణ మాతో ఎంతో స్నేహంగా ఉంటుంది. – స్రవంతి, పూర్ణక్లాస్ మేట్ కుటుంబంతో మలావత్ పూర్ణ -
తెలంగాణ శిఖరం
-
‘విన్సన్’ పర్వతాన్ని అధిరోహించిన పూర్ణ
సాక్షి, హైదరాబాద్: అంటార్కిటికా ఖండంలో ఎత్తయిన విన్సన్ మసిఫ్ పర్వతాన్ని తెలంగాణకు చెందిన పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణ ఈ నెల 26న అధిరోహించింది. ప్రపంచంలోనే ఎత్తయిన ఏడు పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంతో రంగంలోకి దిగిన పూర్ణ.. ఎవరెస్ట్, కిలిమంజారో, ఎల్బ్రస్, అకోన్కాగ్వా, కార్ట్స్నెజ్ పర్వతాలను ఎక్కింది. తాజాగా విన్సన్ మసిఫ్ పర్వతాన్ని అధిరోహించింది. ఇప్పటివరకు మొత్తం ఆరు ఎత్తయిన పర్వతాలను ఎక్కింది. ఉత్తర అమెరికాలోని దెనాలి పర్వతాన్ని అధిరోహించడమే మిగిలి ఉందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిరుపేద గిరిజన కుటుంబం నుంచి వచ్చిన తనకు తెలంగాణ ప్రభుత్వం అందించిన సహకారంతోనే ఈ స్థాయికి వచ్చినట్లు పేర్కొంది. తనకు సహకారం అందించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు, గురుకుల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌కు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. -
పరిపూర్ణ విజయగాథ
20 ఆగస్ట్ 2013: ‘నల్లగా, సన్నగా ఉన్న పూర్ణ మలావత్’– కామారెడ్డి జిల్లాలో ఉన్న తాడ్వాయి మండలపు సాంఘిక సంక్షేమ పాఠశాలలో వాలీబాల్ ఆడుతుండగా, అపర్ణ తోట రాసిన ‘పూర్ణ’ మొదలవుతుంది. పూర్ణ తండ్రి దేవీదాస్ ‘తన పిల్లల చదువులపై పెట్టుబడి పెట్టిన’ వ్యక్తి. ఆయన పూర్వీకులు రాజస్తాన్ నుండి వలస వచ్చి, పాకాల కుగ్రామంలో స్థిరపడిన బంజారాలు. పూర్ణ టీచర్‌కు బోనగిరి గుట్టలెక్కేందుకు ఇద్దరు విద్యార్థులను పంపమన్న మెయిల్ వచ్చినప్పుడు, ఆమె పూర్ణ పేరు పంపుతారు. బడిపిల్లల కోసమని పర్వతారోహణ శిబిరాలను నిర్వహించే శేఖర్ బాబు, పరమేశ్ ఆధ్వర్యంలో బోనగిరి బండను చూస్తూ, ‘దాదాపు నిలువుగా ఉన్న రాతినెవరు ఎక్కగలరు?’ అని మొదట్లో అనుకున్న పూర్ణ, ‘కొత్త నైపుణ్యం నేర్చుకుంటున్నప్పుడు వచ్చే అడ్డంకులను అధిగమించేవరకూ ఆగేది కాదు’. ‘రాతితో స్నేహం చెయ్యి’ అన్న పరమేశ్ సలహా పాటిస్తూ, జై హనుమాన్ అని జపించుకుంటూ కొండ ఎక్కేస్తుంది. ‘స్వేరోస్’ మొదలుపెట్టిన గురుకుల పాఠశాలల సెక్రెటరీ అయిన ఐపీఎస్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌ను అక్కడ చూస్తుంది. ‘నువ్వు ఎవరెస్టును లక్ష్యంగా చేసుకోవాలి’ అని పూర్ణతో చెప్పిన ప్రవీణ్, ‘అపరిమితమైన శిల, నాజూకైన అమ్మాయి’ అనుకుంటారు. పూర్ణ మొదటి రైలు ప్రయాణం డార్జిలింగుకు. ఖమ్మంలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఆనంద్ కూడా ఆ బృందంలో ఉంటాడు. ‘పోలీసు విభాగంలో విజయం సాధించినప్పటికీ, ‘నేను సాధిస్తున్నదేమిటి! పేరూ గౌరవమూనేనా?’ అనుకుంటూ, అసంతృప్తి చెందే’ ప్రవీణ్ అక్కడకు వెళ్ళి, ‘ప్రియమైన మౌంట్ ఎవరెస్ట్, త్వరలోనే నా స్వేరోలు నీ వద్దకు వస్తారు’ అన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తారు. హైదరాబాదులో నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పిల్లలను అభినందించినప్పుడు, ‘నా చిట్టి అంబేడ్కర్లు కళ్ళు కలపగలుగుతున్నారు, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్నారు’ అనుకుంటారు. శిక్షణలో భాగంగా జరిగిన పిల్లల తదుపరి ప్రయాణం లేహ్‌కు. ఎవరెస్ట్ ఎక్కడానికి పూర్ణ, ఆనంద్ ఎంపికవుతారు. పిల్లలిద్దర్నీ శేఖర్ బాబు తీసుకెళ్తారు. చైనా వైపు నుండి ఎక్కుదామని నిర్ణయించుకుంటారు. ‘ఇక్కడివరకూ రాగలిగానంటే తప్పక శిఖరాగ్రానికి చేరుకుంటాను’ అని పూర్ణ తీర్మానించుకుంటుంది. అక్కడ భారీగా మంచు కురవడంతో ‘పూర్ణా, వెనక్కి రావడానికే సమస్యా ఉండదు. మీ క్షేమం ఎక్కువ ముఖ్యం మాకు’ అని ప్రవీణ్ అన్నప్పుడు, ‘మేము స్వేరోలము సర్, మనకు రివర్స్ గేర్లు ఉండవు’ అని జవాబిస్తుంది. మే 25, 2014 ముందటి రాత్రి, యాత్రను విరమించుకుని పిల్లని వెనక్కి పిలవాలన్న ప్రలోభానికి లోనయ్యారు ప్రవీణ్. అది పిల్లలిద్దరి ఆశనే కాక, ఇతర స్వేరోస్ ఆశలను కూడా చంపేస్తుంది అనుకుని సతమతమవుతారు.మర్నాడు తెల్లవారు 5:45కి పూర్ణ శిఖరాగ్రానికి చేరుకుంటుంది. ‘మౌంట్ ఎవరెస్ట్ చేరుకున్న అతి పిన్న వయస్కురాలిని’ అన్న మాటలున్న టీ షర్ట్ తొడుక్కుని జాతీయ జెండా, అప్పటికి అధికారికంగా ఏర్పడని తెలంగాణా జెండానూ పాతుతుంది. ఆ తరువాత ఎస్.ఆర్.శంకరన్, అంబేడ్కర్ ఫొటోలున్న జెండాలను. ఆఖర్న స్వేరోస్ జెండా. 6:45కు ఆనంద్ కూడా శిఖరాగ్రం చేరుకుంటాడు.చివరి పేజీలలో అనేకమైన ఫొటోలున్న ఈ 162 పేజీల పుస్తకంలో ‘రాపెల్, బెలే, బకెట్ ఫోల్డ్’ వంటి సాంకేతిక మాటలుంటాయి. ‘డెత్ జోన్’ అన్నవి పెద్దక్షరాల్లో పుస్తకమంతటా కనబడతాయి. ఇంగ్లిష్ లిపిలో ఉన్న తెలుగు, హిందీ మాటల అనువాదాలు బ్రాకెట్లలో ఉంటాయి. ప్రతీ అధ్యాయానికీ ముందుండే శీర్షిక, సమయం, తేదీ, సంవత్సరాలు కథాక్రమాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. ఈ నిజ జీవితపు కథను ప్రిజమ్ బుక్స్ ఈ జూలైలో ప్రచురించింది. u కృష్ణ వేణి -
కూతురు పుడితే సంబరం
కదంబ వృక్షం అంటే తెలుసు కదా! దుర్గాదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన చెట్టు. రాజస్తాన్‌లోని పిప్లాంత్రీ గ్రామంలో మనం అడుగు పెడితే పచ్చగా, అందంగా ఈ కదంబ వృక్షాలే కనువిందు చేస్తుంటాయి. ఎందుకంటారా ఆ గ్రామంలో అమ్మాయి పుడితే సంబరాలు చేసుకుంటారు. ప్రకృతికి మారుపేరైన అమ్మాయి పుట్టినందుకు ఓ మొక్క నాటుతారు. ఈ సంబరాల వెనుక ఓ విషాదం ఉంది. ఆ ఊరి మాజీ సర్పంచ్ శ్యామ్‌సుందర్ పాలీవాల్. 2006లో ఆయన 16 ఏళ్ల వయసు కుమార్తె కిరణ్ చనిపోయింది. ఆమె స్మృతి కోసం ఓ కదంబ మొక్క నాటారు. ఆ కదంబ చెట్టే తన కూతురంటూ ఆ చెట్టును వాటేసుకునేవారు. ప్రతి ఇల్లు తిరుగుతూ కూతురు పుడితే సంబరాలు చేసుకోవాలని, మొక్కల్ని పెంచాలని అవగాహన పెంచారు. అసలే కరువు ప్రాంతమైన రాజస్తాన్‌లో ఓ ఏడాది నీటి కటకట ఏర్పడింది. ప్రభుత్వం రైళ్ల ద్వారా ఆ ఊరికి నీరు సరఫరా చేసింది. దీంతో ప్రకృతి లాంటి ఆడపిల్లనే కాదు.. ప్రకృతిని కూడా కాపాడుకున్నారు. పిప్లాంత్రీతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల్లో విపరీతంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. 3 లక్షల 50 వేలకు పైగా మొక్కలు నాటారు. ఓ కూతురుంటే తల్లిదండ్రులు ఎంత పచ్చగా ఉంటారో, ఇప్పుడా ఊరు కూడా పచ్చగా కళకళలాడుతోంది. ఎవరెస్టంత ఎత్తుకు ఎదిగింది.. ‘బిడ్డ పర్వతం ఎక్కుతానంటే నాకు భయమనిపించింది.. కానీ అమ్మాయే నాకు ధైర్యం చెప్పింది. రెండు రాష్ట్రాల్లో ఇద్దరికే అవకాశం వచ్చిందంటే నమ్మకం కుదిరింది. కశ్మీర్‌కు వెళ్లే ఒకరోజు ముందు క్షణాలు ఇప్పటికీ గుర్తున్నయ్’ అంటూ ఆ ఉద్వేగ క్షణాలను నెమరేసుకున్నారు ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ తండ్రి దేవీదాస్. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాలకు చెందిన దేవీదాస్ది వ్యవసాయ కుటుంబం. కుమారుడు నరేశ్, కూతురు పూర్ణ. ‘ఐదో తరగతి వరకు పాకాల గవర్నమెంట్ స్కూళ్లోనే చదివింది. తర్వాత తాడ్వాయి గురుకులంలో చేర్చించా. పర్వతాధిరోహణ కోసం 110 మందిని సెలెక్ట్ చేసి అందులో 20 మందికి భువనగిరి కోట దగ్గర శిక్షణ ఇచ్చారు. ఇద్దరిని జమ్మూకశ్మీర్‌కు పంపించారు. పర్వతాధిరోహణకు అంతా రెడీ అయ్యాక పర్వతం ఎక్కేందుకు మాతో పంపిస్తావా అని అడిగిండ్రు. పూర్ణపై నమ్మకంతో ఓకే అని చెప్పినం.’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు దేవీదాస్. – సాక్షిప్రతినిధి/నిజామాబాద్ -
ప్రపంచ రికార్డు సాధించిన పూర్ణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిడ్డ మలావత్ పూర్ణ రికార్డులు మీద రికార్డులు సాధిస్తోంది. చిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ తాజాగా మరో ప్రపంచ రికార్డు సాధించింది. శుక్రవారం అర్జెంటీనాలోని అకాన్కాగో శిఖరాన్ని(6,962 మీటర్లు) అధిరోహించింది. ఇప్పటివరకు ఆమె నాలుగు ఖండాలలోని నాలుగు ఎత్తైన పర్వతాలను అధిరోహించింది. ఈ ఘనత సాధించిన తొలి గిరిజన యువతిగా ఆమె ప్రపంచ రికార్డు సృష్టించింది. అకాన్కాగో పర్వతాన్ని అధిరోహించిన అనంతరం పూర్ణ మాట్లాడుతూ తెలంగాణ, ఇండియా గర్వపడేలా ప్రపంచంలో ఏడు ఖండాలలోని ఏడు శిఖరాలను అధిరోహించడమే తన లక్ష్యమని పేర్కొంది. సీఎం కేసీఆర్ అందిస్తున్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపింది. ‘ఎవరెస్ట్ కంటే అకాన్కాగో అధిరోహించడం చాలా కష్టతరంగా అనిపించింది. అప్పుడు ఆకాశమే హద్దుగా ముందుకు సాగాలన్న స్వేరోస్ టెన్ కమాండ్మెంట్స్ గుర్తు చేసుకున్నాను. ఇప్పటివరకు ఎవరెస్ట్(ఆసియా), కిలిమంజారో(ఆఫ్రికా), ఎల్బ్రూస్(యూరప్), అకాన్కాగో(దక్షిణ అమెరికా) పర్వతాలు అధిరోహించాను. ఇకముందు డెనాయ్(నార్త్ అమెరికా), విన్సన్ మసిఫ్(అంటార్కిటికా), కాస్కిజ్కో(ఆస్ట్రేలియా) పర్వతాలను అధిరోహించడమే నా ధ్యేయం’అని తెలిపింది. గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ చిన్న వయసులో పూర్ణ ఇలాంటి ఘనత సాధించడం చాలా గొప్పవిషయమని, ఆమె సాధించిన విజయాలు విద్యార్థులకు స్ఫూర్తినిస్తాయని కొనియాడారు. -
చరిత్రను మార్చేది వారే
‘టైమ్స్‌నౌ’ కార్యక్రమంలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: రాజకుటుంబాలకు, పాలకులకు ప్రత్యేక శ్రద్ధ చూపటం పట్ల ప్రధాని మోదీ విచారం వ్యక్తంచేశారు. అది దేశాన్ని బానిస సంకెళ్లలో ఉంచేందుకు జరుగుతున్న ఉద్దేశపూర్వక కుట్రగా అభివర్ణించారు. చిన్న వారుగా పరిగణించే వాళ్లు సైతం చరిత్రను మార్చగలరన్నారు. కష్టాలు, సవాళ్లను అధిగమించి సమాజానికి ప్రత్యేక సేవ చేసిన వారికి ప్రధాని మోదీ గురువారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘టైమ్స్ నౌ’ వార్తా చానల్ ‘అద్భుత ఇండియన్లు’ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డులు పొందిన వారిలో ఎవరెస్టును అధిరోహించిన తెలుగమ్మాయి మలావత్ పూర్ణ ఉన్నారు. మోదీ మాట్లాడుతూ.. ‘‘గొప్ప పనులు చేయాలంటే అందుకు అనుకూలమైన వాతావరణం ఉంటేనే చేయగలమని కొందరు భావిస్తుంటే.. పట్టుదల గల వాళ్లు ఎన్నో కష్టాలను అధిగమించి గొప్ప పనులు సాధిస్తారు. గత 200-250 ఏళ్లుగా రాజకుటుంబాలు, పాలకులపై ప్రత్యేక శ్రద్ధ చూపటం మన దేశ దురదృష్టం. వారికి సంబంధించిన అంశాల గురించి మాత్రమే మాట్లాడటం, రాయటం జరిగింది. దేశం స్వాతంత్య్రం సాధించిన తర్వాతా అటువంటి పరిస్థితి కొనసాగింది. చిన్న వాళ్లు చరిత్రను మార్చగలరు. దీనిని సమాజం అర్థం చేసుకోవాలి. ఇది ఇతరులకు ఒక స్ఫూర్తి’’ అని పేర్కొన్నారు. ఎందరి జీవితాలనో రూపుదిద్దే ఏ ఉపాధ్యాయుడు / ఉపాధ్యాయురాలి పేరునూ ఏ వీధికి గానీ, కూడలికి గానీ పెట్టలేదని.. కానీ ఒక కార్పొరేటర్ పేరును సైతం పెట్టేస్తుంటారని వ్యాఖ్యానించారు. తక్కువ వాళ్లుగా పరిగణించే వాళ్లు సమాజానికి ఎక్కువ సేవ చేస్తుంటారని.. దానిని మరచిపోరాదని పేర్కొన్నారు. -
ఐపీఎస్ అధికారినవుతా: పూర్ణ
సిరికొండ: చిన్నతనంలోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన మాలావత్ పూర్ణ చదువులోనూ సత్తా చాటింది. టెన్త్‌లో 7.2 పాయింట్లతో ఉత్తీర్ణురాలైంది. ఎవరెస్ట్‌ను అధిరోహించిన సందర్భంగా తనకు చేసిన సన్మాన కార్యక్రమాల వల్ల సరిగా చదవలేకపోయానని, దీంతో తక్కువ పాయింట్లు వచ్చాయని తెలిపింది. సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల సంఘం కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ స్ఫూర్తితో ఐపీఎస్ కావాలని ఉందని పూర్ణ పేర్కొంది. టెన్త్ పాస్ అవ్వడం పట్ల పూర్ణ తల్లిదండ్రులు మాలావత్ దేవిదాస్, లక్ష్మీ సంతోషం వ్యక్తం చేశారు. -
పూర్ణ, ఆనంద్ లకు వైఎస్ భారతి సన్మానం
-
పూర్ణ, ఆనంద్ లకు వైఎస్ భారతి సన్మానం
హైదరాబాద్: అతి పిన్నవయస్సులో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తెలుగుజాతి ఔన్నత్యాన్ని చాటిన మాలావత్ పూర్ణ, సాధనపల్లి ఆనంద్‌కుమార్‌లను సాక్షి మీడియా గ్రూప్ చైర్ పర్సన్ వైఎస్ భారతి సన్మానించారు. ఈ సందర్భంగా సాహసయాత్ర వివరాలు వారిని అడిగి తెలుసుకున్నారు. అత్యంత ప్రతికూల వాతావరణాన్ని ఎదిరించి ఎవరెస్టు శిఖరంపై భారతపతాకాన్ని ఎగురువేసి యువతీయువకుల్లో అంతులేని విశ్వాసం నింపారని ప్రశంసించారు. మీ విజయం మరెందరికో స్ఫూర్తినిస్తుందని అన్నారు. పూర్ణ, ఆనంద్ లకు ఉజ్వల భవిష్యత్ సొంతం కావాలని వైఎస్ భారతి ఆకాంక్షించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ఈ ఇద్దరు ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించిన తెలుగు తేజాలుగా నిలిచారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలిగా 14 ఏళ్ల మాలావత్ పూర్ణ రికార్డు సృష్టించింది. -
ఎవరెస్టంత గర్వంగా ఉంది
‘సాక్షి’తో మాలావత్ పూర్ణ - మొదట అమ్మ భయపడింది - నాన్న వెన్నుతట్టారు - ప్రవీణ్ సార్ ప్రోత్సాహాన్ని మరిచిపోలేను - ఐపీఎస్ సాధించి ప్రజలకు సేవచేస్తా ‘‘చిన్న వయసులోనే పెద్ద శిఖరాన్ని అధిరోహించాను. ఎంత గర్వంగా ఉందం టే.. ఎవరెస్ట్ శిఖరమంత’’ అంటూ మాలావత్ పూర్ణ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘‘నా విజయం వెనుక ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్ సార్ ప్రోత్సాహం ఎంతో ఉంది. జీవితాంతం సార్‌కు రుణపడి ఉంటా. ఆయనలా ఐపీఎస్ అయి సేవలందిస్తా’’ అని పేర్కొన్నారు. చిన్న వయసులో ఎవరెస్ట్‌ను అధిరోహించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన పూర్ణ తన స్వగ్రామం సిరికొండ మండలంలోని పాకాలకు వెళ్తూ శనివారం రాత్రి కామారెడ్డిలోని బంధువుల ఇంట్లో బస చేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో తన యాత్ర అనుభవాలను పంచుకున్నారు. -కామారెడ్డి సాక్షి : ఎవరెస్టు ఎక్కాలన్న ఆలోచన ఎలా వచ్చింది. పూర్ణ : ప్రవీణ్‌సార్ ప్రోత్సాహం వల్లే ఈ ఘనత సాధించగలిగాను. నేను తాడ్వాయి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నపుడు కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ ఆడేదాన్ని. ఓసారి ప్రవీణ్‌కుమార్ సార్ వచ్చారు. ఆయన నాలోని ప్రతిభను గుర్తించారు. శిఖరారోహణకు ఎంపిక చేశారు. 2013 సెప్టెంబర్‌లో భువనగిరి ట్రైనింగ్ క్యాంపునకు తీసుకెళ్లారు. 110 మందికి ఐదు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. అందులో ప్రతిభ చూపిన 20 మంది ఎంపిక చేసి నవంబర్‌లో డార్జిలింగ్ తీసుకెళ్లారు. అక్కడ 20 రోజులపాటు శిఖరారోహణలో శిక్షణ ఇచ్చారు. 17వేల అడుగుల ఎత్తున్న శిఖరాలను అధిరోహించాం. ప్రతిభ చూపిన తొమ్మిది మందిని ఎంపిక చేసి లద్దాహ్ తీసుకెళ్లారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి నన్ను, ఆనంద్‌ను ఎంపిక చేశారు. మాకు రెండు నెలలపాటు రంగారెడ్డి జిల్లాలోని గేలిదొడ్డి స్కూల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. శారీరక, మానసిక దృఢత్వానికి శిక్షణ తోడ్పడింది. రోజూ 26 కిలో మీటర్లు జాగింగ్, అనంతరం మెడిటేషన్, యోగ సాధన చేసేవాళ్లం. వార్షిక పరీక్షల సమయంలో తాడ్వాయికి వచ్చి పరీక్షలు రాశాను. తర్వాత ఏప్రిల్ 6వ తేదీన హైదరాబాద్‌కు వెళ్లి అక్కడి నుంచి హియాలయాలకు బయలు దేరాం. సాక్షి : ఎవరెస్టును ఎలా అధిరోహించారు. పూర్ణ : మొదట 5,400 మీటర్ల వద్ద ఉన్న బేస్ క్యాంపునకు చేరాం. అక్కడి నుంచి 6,400 మీటర్ల వద్ద ఉన్న అడ్వాన్స్ బేస్ క్యాంప్‌నకు, అక్కడినుంచి 7,100 మీటర్ల దగ్గర ఉన్న క్యాంప్ ఫాక్స్‌కు చేరుకున్నాం. అక్కడినుంచి బేస్ క్యాంప్‌నకు తిరిగివచ్చాం. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల అక్కడ 15 రోజులు ఉండాల్సి వచ్చింది. 19వ తేదీన మళ్లీ మొదలుపెట్టాం. 20న అడ్వాన్స్ క్యాంపునకు చేరాం. అక్కడ ఒకరోజు విశ్రాంతి తీసుకొన్న అనంతరం ముందుకు సాగాం. 22న క్యాంప్ వన్‌కు, 23న క్యాంప్ -2కు, 24న క్యాంప్ -3కి చేరాం. దీన్ని డెడ్ జోన్ అంటారు. 24న ఉదయం 9.30 గంటలకు లాస్ట్ ఈవెంట్ సమ్మిట్ హెడ్ క్యాంప్ వద్దకు చేరాం. 26న ఉదయం 6 గంటల ప్రాంతంలో శిఖరంపై జాతీయ పతాకాన్ని, తెలంగాణ జెండాను ఆవిష్కరించాం. బీఆర్ ఆంబేద్కర్, శంకరన్ చిత్రపటాలను ఉంచాం. 15 నిమిషాలు అక్కడ గడిపిన అనంతరం తిరుగు ప్రయాణమయ్యాం. చదువు సంగతి.. పూర్ణ : పదో తరగతి తాడ్వాయి హాస్టల్లోనే ఉండి చదువుకుంటా. ఐపీఎస్ సాధించాలన్నది నా లక్ష్యం. కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకుంటా. సమాజానికి నావంతు సేవ చేస్తా. రాష్ట్ర, జాతీయ నేతలు అభినందించినపుడు మీ ఫీలింగ్ పూర్ణ : ఎవరెస్టును అధిరోహించి దేశ ప్రతిష్టను పెంచావంటూ అందరూ అభినందించారు. వారి అభినందనలతో ఎంతో సంతోషించా. గర్వంగా ఫీలవుతున్నా. కొత్త రాష్ట్రంలో ఈ విజయం సాధించడం ఆనందంగా ఉంది. ఈ ఘనత సాధిస్తానని ఎప్పుడైనా అనుకున్నావా? పూర్ణ : పేద కుటుంబానికి చెందిన తాను ఇలాంటి సాహస యాత్ర చేస్తానని ఏనాడూ ఊహించలేదు. ఎవరెస్టుకు వెళ్లేందుకు ఎదురయ్యే ఆటంకాల గురించిన ఫొటోలు, వీడియోలు చూపించినప్పుడు అమ్మ భయపడింది. కానీ నాన్న వెన్నుతట్టారు. ప్రవీణ్‌సార్ ప్రోత్సాహంతో అరుదైన ఘనత సాధించా. ఇప్పుడు అందరూ ఆనందిస్తున్నారు.